కివీస్‌ పని పట్టేందుకు సిద్ధం!

21 Jan, 2020 04:42 IST|Sakshi
భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ చెత్రీ దంపతుల ఇంట్లో కోహ్లి, అనుష్కశర్మ

కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్య

బెంగళూరు: గత ఏడాది న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత జట్టు వన్డే సిరీస్‌లో 4–1తో ఘన విజయం సాధించింది. టి20 సిరీస్‌ను మాత్రం 1–2తో చేజార్చుకుంది. ఆస్ట్రేలియాపై సాధించిన వన్డే సిరీస్‌ విజయంతో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అమితోత్సాహంతో ఉన్నాడు. తాజా ప్రదర్శనతో తమ ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని, దీంతో పాటు గత ఏడాది విజయం ఇచ్చిన స్ఫూర్తితో మళ్లీ కివీస్‌ను పడగొడతామని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఈ నెల 24న భారత జట్టు కివీస్‌ టూర్‌ ప్రారంభంకానుంది. ‘గత ఏడాది న్యూజిలాండ్‌ గడ్డపై సాధించిన విజయం నుంచి మేం స్ఫూర్తి పొందుతున్నాం.

నాడు మంచి సానుకూల దృక్పథంతో ఆడాం. ఇప్పుడు కూడా ఏం చేయాలో మాకు బాగా తెలుసు. సరిగ్గా చెప్పాలంటే ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచగలిగితే చాలు. సొంత గడ్డపై కచ్చితంగా గెలవాలనే పట్టుదల వారిలో ఉంటుంది. మనం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలిగితే వారిపై ఒత్తిడి పెరుగుతుంది. గత ఏడాది కూడా అదే చేశాం. ఈసారీ జోరును కొనసాగిస్తాం’ అని కెప్టెన్‌ అన్నాడు. మరో వైపు రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యం జట్టుకు అదనపు బలంగా మారిందని అతను అభిప్రాయ పడ్డాడు.

సోమవారం న్యూజిలాండ్‌కు బయలు దేరేముందు భారత టి20 జట్టు సభ్యులు
‘ఐదో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌ కూడా చేస్తుంటే జట్టు మంచి సమతూకంతో ఉంటుంది. అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకునే అవకాశం కూడా ఉంది. గతంలో రాహుల్‌ భాయ్‌ (ద్రవిడ్‌) కూడా ఇలాగే చేశారు. పైగా రాహుల్‌ ఏ స్థానంలోనైనా ఆడగలడు. అయితే నా అభిప్రాయాన్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవద్దు. రాహుల్‌ను మెచ్చుకున్నానంటే కీపర్లుగా పంత్, సామ్సన్, ధోని అవకాశాలను కొట్టివేసినట్లు కాదు. మనకు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పడం నా ఉద్దేశం’ అని కోహ్లి స్పష్టం చేశాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో మూడో వన్డే ముగిసిన అనంతరం కెప్టెన్‌ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ చెత్రీ దంపతుల ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్లి డిన్నర్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు