86 పరుగులు వ్యవధిలో 9 వికెట్లు!

3 Oct, 2017 19:49 IST|Sakshi

విజయవాడ:న్యూజిలాండ్'ఎ'తో జరిగిన తొలి అనధికార టెస్టులో ఇన్నింగ్స్ విజయాన్ని సాధించిన భారత్ 'ఎ'.. తాజాగా ముగిసిన రెండో అనధికార టెస్టులో సైతం ఇన్నింగ్స్ 26 పరుగుల విజయాన్ని అందుకుంది.  చివరి రోజు ఆటలో భాగంగా మంగళవారం 104/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ మరో 106 పరుగులు చేసి మిగతా వికెట్లను చేజార్చుకుంది. భారత 'ఎ' స్పిన్నర్లు కరణ్ శర్మ, షెహబాజ్ నదీమ్ లకు దాటికి తలవంచిన న్యూజిలాండ్ 'ఎ' 86 పరుగుల వ్యవధిలో తొమ్మిది వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్ 'ఎ' రెండో వికెట్ ను  124 పరుగుల వద్ద కోల్పోగా,  210 పరుగులకు ఆలౌట్ కావడం ఇక్కడ గమనార్హం. దాంతో డ్రా చేసుకునే అవకాశాన్ని న్యూజిలాండ్ 'ఎ' కోల్పోయి ఘోర ఓటమిని చవిచూసింది.

 రెండో ఇన్నింగ్స్ లో కరణ్ శర్మ, నదీమ్ లు ఏ దశలోనూ న్యూజిలాండ్'ఎ' ను తేరుకోనీయకుండా చేసి భారత్ 'ఎ'కు మరో అద్భుతవిజయాన్ని అందించారు. కరణ్ శర్మ ఐదు వికెట్లతో కివీస్ రెక్కలను విరగగొట్టగా, నదీమ్ నాలుగు వికెట్లతో రాణించాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో ఎనిమిది వికెట్లను సాధించిన కరణ్ శర్మ భారత్ 'ఎ' విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి మ్యాచ్ లో కూడా కరణ్ శర్మ ఎనిమిది వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే. తొలి అనధికార టెస్టును ఇన్నింగ్స్ తేడాతో భారత్ 'ఎ' విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో రెండు టెస్టుల సిరీస్ ను భారత్ 'ఎ' 2-0 తో ముగించింది.

న్యూజిలాండ్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ 211 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 210 ఆలౌట్

భారత్ 'ఎ' తొలి ఇన్నింగ్స్ 447 ఆలౌట్

మరిన్ని వార్తలు