వరల్డ్ కప్ కు యువ భారత జట్టు ఎంపిక

22 Dec, 2015 15:30 IST|Sakshi
వరల్డ్ కప్ కు యువ భారత జట్టు ఎంపిక

ముంబై: వచ్చే ఏడాది బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తున్న అండర్-19 వరల్డ్ కప్ లో పాల్గొనే యువ భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. ఈ మేరకు ఇషాన్ కిషన్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన క్రికెట్ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. యువ భారత క్రికెట్ జట్టు జాబితాను మూడు విడతలుగా  రిలీజ్ చేశారు. ఇషాన్ కిషన్(కెప్టెన్), రిషబ్ పాంట్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, అమన్ దీప్ లతో కూడిన జట్టును తొలుత విడుదల చేయగా, ఆ తరువాత అన్మూల్ ప్రీత్ సింగ్, ఆర్మాన్ జాఫర్, రికీ భూయ్, మయాంక దాగర్, జీషన్ అన్సారీ, మహిపాల్ లామ్రోర్, అవీష్ ఖాన్ ల పేర్లను విడుదల చేసింది. చివరగా సుభామ్ మావి, ఖలీల్ అహ్మద్, రాహుల్ బథామ్ ల పేర్లను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఖరారు చేసింది.

జనవరి 27 నుంచి ఫిబ్రవరి 14 వరకూ బంగ్లాదేశ్ లోని నాలుగు నగరాల్లో మొత్తం 8 వేదికల్లో పోటీలు జరుగనున్నాయి. స్థానిక కాలమాన ప్రకారం మ్యాచ్ లు ఉదయం గం.9.00.లకు ప్రారంభమవుతాయి. జనవరి 28 వ తేదీన భారత్ తన తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ టోర్నీలో పాల్గొనే మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతీ ఒక్క గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ లీగ్ కు అర్హత సాధిస్తాయి. టెస్టు హోదా ఉన్న 10 దేశాలే కాకుండా, మరో ఆరు సభ్య దేశాలు (ఆఫ్ఘనిస్తాన్, ఫిజీ, కెనడా, నమీబియా, నేపాల్, స్కాట్లాండ్) కూడా ఈ టోర్నికి అర్హత సాధించాయి.  ముక్కోణపు సిరీస్ లో భాగంగా సోమవారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించి ట్రోఫీని అందుకున్న అనంతరం భారత జట్టును ప్రకటించడం విశేషం.దాదాపు ముక్కోణపు సిరీస్ లో పాల్గొన్న సభ్యుల్నే వరల్డ్ కప్ కు ఎంపిక చేశారు.

మరిన్ని వార్తలు