విజేత యువ భారత్‌

10 Jan, 2020 00:49 IST|Sakshi

నాలుగు దేశాల వన్డే టోర్నీ

ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 69 పరుగుల తేడాతో విజయం

శతకంతో చెలరేగిన ధ్రువ్‌ 

డర్బన్‌: ప్రపంచకప్‌కు ముందు భారత యువ జట్టు తమ సత్తాను ప్రదర్శిస్తూ నాలుగు దేశాల అండర్‌–19 వన్డే టోర్నీలో విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో భారత అండర్‌–19 జట్టు 69 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా అండర్‌–19 జట్టుపై గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. ఆరంభంలో గెరాల్డ్‌ కోయిజే (3/19) విజృంభించడంతో... యశస్వి జైస్వాల్‌ (0), దివ్యాన్‌‡్ష సక్సేనా (6), సారథి ప్రియమ్‌ గార్గ్‌ (2) వెంట వెంటనే పెవిలియన్‌కు చేరారు. దీంతో భారత్‌ 13 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ ట్రోఫీతో హైదరాబాద్‌ ఆటగాడు ఠాకూర్‌ తిలక్‌వర్మ

ఈ దశలో జట్టు బాధ్యతను తిలక్‌ వర్మ (103 బంతుల్లో 70; 7 ఫోర్లు, సిక్స్‌), ధ్రువ్‌ జురెల్‌ (115 బంతుల్లో 101; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 164 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో సిద్ధేశ్‌ వీర్‌ (37 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో భారత్‌ గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయగలిగింది. ఛేదన ప్రారంభించిన దక్షిణాఫ్రికాను అథర్వ అన్కోలేకర్‌ (4/31) హడలెత్తించడంతో... ఆ జట్టు 43.1 ఓవర్లలో 190 పరుగులకే చాప చుట్టేసింది. జాక్‌ లీస్‌ (52; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బౌలింగ్‌లోనూ రాణించిన తిలక్‌ వర్మ కీలకమైన ఓపెనర్‌ ఆండ్రూ లోవ్‌ (17; 3 ఫోర్లు) వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ధ్రువ్‌ జురెల్‌ అవార్డు అందుకోగా... టోర్నీ మొత్తం రాణించిన హైదరాబాద్‌ ఆటగాడు తిలక్‌ వర్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును సొంతం చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు