-

ధోనీ చెప్పినట్టే దుమ్ములేపారు..

17 Dec, 2014 15:56 IST|Sakshi
ధోనీ చెప్పినట్టే దుమ్ములేపారు..

బ్రిస్బేన్: 'ఆస్ట్రేలియాతో సిరీస్లో దూకుడైన క్రికెట్ ఆడుతాం'.. రెండో టెస్టుకు ముందు రోజు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్న మాటిది. ధోనీ చెప్పినట్టే బ్రిస్బేన్ టెస్టులో భారత యువ క్రికెటర్లు దుమ్ములేపారు. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా బుధవారం ఆరంభమైన రెండో మ్యాచ్లో భారత్ తొలిరోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లకు 311 పరుగులు చేసింది. మ్యాచ్ తొలి రోజు భారత్దే పైచేయి.

విదేశీ గడ్డపై, అందులోనూ ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్ ట్రాక్లపై భారత్ ఒకే రోజు 300 పైచిలుకు పరుగులు చేయడం ఆషామాషీ విషయం కాదు. పైగా ఫాస్ట్ పిచ్లపై తడబడే ఆనవాయితీకి ముగింపు పలుకుతూ భారత యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనలో ఆత్మస్థయిర్యంతో  దూసుకుపోతుండటం శుభపరిణామం. బ్రిస్బేన్ మ్యాచ్లో భారత్ను కట్టడి చేసేందుకు ఆసీస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 8 మంది బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా ఫలితం దక్కలేదు. రోజంతా శ్రమించినా కంగారూలు నాలుగే వికెట్లు తీశారు. భారత జట్టులో మురళీ విజయ్ (144) సెంచరీకి తోడు రహానె (75 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ చేశాడు. రహానెతో పాటు రోహిత్ క్రీజులో ఉన్నాడు. తొలి టెస్టులో భారత్ ఓడినా పోరాటపటిమతో ఆకట్టుకుంది. ఓ దశలో విజయానికి చేరువైన భారత్ చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. గాయం కారణంగా ధోనీ గైర్హాజరుతో తొలి టెస్టుకు సారథ్యం వహించిన కోహ్లీ రెండు సెంచరీలతో కదంతొక్కాడు. లోయరార్డర్తో పాటు బౌలర్లూ రాణిస్తే టీమిండియా విజయం దిశగా పయనించడం కష్టమేమీకాదు.

మరిన్ని వార్తలు