ఇక టి20 సిరీస్‌పై దృష్టి

13 Feb, 2018 04:15 IST|Sakshi
కొత్త కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌

దక్షిణాఫ్రికాతో భారత మహిళల తొలి మ్యాచ్‌ నేడు

పోట్చెఫ్‌స్ట్రూమ్‌: వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇప్పుడు టి20లపై కన్నేసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్‌ నేడు జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతోంది. తొలి రెండు వన్డేల్లోనూ భారీ తేడాతో గెలుపొందిన మిథాలీ సేన మూడో మ్యాచ్‌లో మాత్రం ఓడింది. ఇప్పుడు కొత్త కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలో పొట్టి ఫార్మాట్‌లోనూ తమ ఆధిపత్యం చాటాలని భావిస్తోంది. ఇందులో 17 ఏళ్ల ముంబై అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్‌ ఆకర్షణగా నిలవనుంది.

భారత క్రీడాకారిణుల్లో స్మృతి మంధానతో పాటు, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ హర్మన్‌ ధాటిగా ఆడటంలో దిట్ట. మూడో వన్డేలో విశ్రాంతి తీసుకున్న వెటరన్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి తిరిగి తుది జట్టులోకి రావడం భారత్‌కు లాభించనుంది. ఈమెతో పాటు శిఖా పాండే, దీప్తి శర్మ, పూజ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలరు. చివరి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టులో డు ప్రీజ్, లారా వోల్వార్డ్‌ నిలకడగా ఆడారు. కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నికెర్క్‌ ఫామ్‌లో ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.  

మరిన్ని వార్తలు