పాక్‌పై భారత్‌ ఘన విజయం

2 Jul, 2017 22:30 IST|Sakshi
పాక్‌పై భారత్‌ ఘన విజయం

74 పరుగులకే కుప్పకూలిన పాక్‌
►  5 వికెట్లతో ఎక్తా బిష్త్‌ విజృంభణ


డెర్బీ: మహిళా ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో చాంపియన్స్‌ ట్రోఫీలో భారత పురుషుల జట్టుకు ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కాగా, మహిళల ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసింది.

తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టును మట్టికరిపించిన మిథాలీ సేన.. అదే దూకుడును కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధించింది భారత్‌. భారత బౌలర్లలో స్పిన్నర్‌ ఎక్తా బిస్త్‌ ఐదు వికెట్లను నేలకూల్చారు. దీంతో  తోక ముడవడం దాయాది జట్టు వంతైంది.

170 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ మహిళల జట్టు ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ నాలుగో బంతికి ఎక్తా బిస్త్‌ బౌలింగ్‌లో ఓపెనర్ అయేషా జఫర్ వికెట్ల ముందు దొరికిపోయింది. అక్కడి నుంచి పాక్‌ పతనం ప్రారంభమైంది. 38.1 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్‌ బ్యాట్స్‌విమెన్లలో సనామిర్‌ మాత్రమే ఒంటరి పోరాటం చేసింది.

భారత బౌలర్లలో గోస్వామి, దీప్తీ శర్మ, జోషి, హర్మిత్‌ కౌర్‌లు తలో వికెట్‌ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. భారత్‌ మహిళల్లో పూనమ్‌ రౌత్‌ (47), దీప్తీ శర్మ(28), సుష్మా వర్మ(33) పరుగులతో రాణించారు. గత రెండు మ్యాచుల్లో అదరగొట్టిన శతక్కొట్టిన సృతి మంధన(2), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(8)  అభిమానులను నిరాశపర్చారు.

మరిన్ని వార్తలు