రైనాకు అవకాశం ఇస్తారా?

25 Dec, 2014 00:14 IST|Sakshi
రైనాకు అవకాశం ఇస్తారా?

రేపటి నుంచి బాక్సింగ్ డే టెస్టు   
 తీవ్ర ఒత్తిడిలో ధోనిసేన  
 వార్నర్, వాట్సన్ సిద్ధం
 

 మెల్‌బోర్న్: తొలి రెండు టెస్టుల్లో చేజేతులా ఓటమిపాలైన భారత్ కీలకమైన మూడో టెస్టు (బాక్సింగ్ డే)పై దృష్టిసారించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో ‘అనిశ్చితి’కి తెరదించి ప్రాక్టీస్‌లో జోరు పెంచింది. మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో శుక్రవారం నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టెస్టు సిరీస్‌ను ధోనిసేన డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే గత జట్ల మాదిరిగా పరాభావంతో వెనుదిరగాల్సిందే.
 
  గత రెండు మ్యాచ్‌ల్లో ఒత్తిడికి తలొగ్గిన భారత జట్టులో కొన్ని మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. మిడిలార్డర్‌లో రోహిత్ గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 43, 6, 32, 0 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇతని స్థానంలో సురేశ్ రైనాను జట్టులోకి తెస్తే ఎలా ఉంటుందని టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి తీవ్రంగా యోచిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పిస్తే అతని సత్తాను కూడా పరీక్షించే అవకాశం దక్కుతుందని నమ్ముతున్నారు.
 
 ఇందుకు అనుగుణంగా రైనా కూడా రహానే, అశ్విన్‌తో కలిసి నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నాడు. దీంతో ఎవరికి విశ్రాంతి ఇస్తారనే అంశం ఇప్పుడు జట్టులో హాట్ టాపిక్‌గా మారింది. ఏ ఇద్దరు కలిసినా దీని గురించే చర్చించుకుంటున్నారు. రోహిత్ నెట్ ప్రాక్టీస్‌లో జోరు తగ్గించడంతో ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది. సెషన్ చివర్లో వృద్ధిమాన్ సాహాతో కలిసి రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్ ఎక్కువసేపు బౌలింగ్ చేయలేదు. దీంతో అతను తుది జట్టులో ఉండటంపై సందేహం నెలకొంది.
 
 వార్నర్ ఫిట్!
 మరోవైపు గాయాల నుంచి కోలుకుంటున్న ఆసీస్ కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు. బొటన వేలి గాయంతో బాధపడుతున్న వార్నర్ మ్యాచ్‌లో ఆడతానని స్పష్టం చేశాడు. మంగళవారం ప్యాటిన్సన్ బౌన్సర్‌కు ప్రాక్టీస్ వదిలేసి వెళ్లిన వాట్సన్ కూడా మ్యాచ్‌కు సిద్ధమేనని చెప్పాడు.
 
 ఈ ఇద్దరు బుధవారం ప్రాక్టీస్ సెషన్‌లో ఎలాంటి సమస్యలు లేకుండా బ్యాటింగ్ చేశారు. ‘బంతి తగిలినప్పుడు కాస్త నొప్పి ఎక్కువగా ఉండింది . ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. మ్యాచ్ ఆడతా’ అని వార్నర్ పేర్కొన్నాడు. మిషెల్ మార్ష్ స్థానంలో వచ్చిన జో బర్న్స్ టెస్టుల్లో అరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. నెట్స్‌లో గాయపడిన స్టార్క్, తొడ కండరాల గాయం నుంచి హారిస్‌లు పూర్తిగా కోలుకున్నారు. అయితే ప్రాక్టీస్‌లో వేగంగా దూసుకొచ్చిన బంతి షాన్ మార్ష్ ఎడమ చేతికి బలంగా తాకడంతో ఆసీస్ మేనేజ్‌మెంట్ మళ్లీ ఆందోళనలో పడింది.
 
 భారత్‌కు నమ్మకం లేదు: హెడెన్
 విదేశాల్లో టెస్టు మ్యాచ్‌లు గెలుస్తామన్న నమ్మకం భారత జట్టులో లేదని ఆసీస్ మాజీ ఓపెనర్ మ్యాథ్యూ హెడెన్ అన్నాడు. ప్రస్తుత టెస్టు సిరీస్‌లో కీలక సమయాలను ధోనిసేన సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నాడు. ‘విదేశాల్లో మ్యాచ్‌లు గెలవలేమన్నది భారత్ నమ్మకం. ఇదే అతిపెద్ద బలహీనత. తొలి రోజు మంచి ఆరంభాలు లభించినా మ్యాచ్‌ను ముగించే విషయంలో మాత్రం వెనుకబడిపోయారు.
 
 అత్యంత కీలక క్షణాలను వాళ్లు చేజేతులా జారవిడుచుకున్నారు. జట్టును పనికిమాలిన అంశాలు చుట్టుముట్టాయి. ఫుడ్ విషయాన్ని పక్కనబెడితే.. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు సాకులను వెదుకుతోంది. బ్రిస్బేన్ మ్యాచ్‌లో ధావన్ బ్యాటింగ్ చేయలేనని చెప్పడమే వాళ్ల పిరికితనానికి నిదర్శనం’ అని హెడెన్ విమర్శించాడు. ఆసీస్ ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేసి భారత్ అనవసరంగా ఇబ్బందుల్లో పడుతుందన్నాడు. అయితే ఆసీస్‌తో పోలిస్తే భారత బ్యాటింగ్ ఆర్డర్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. బౌలింగ్‌లో మాత్రం ఆసీస్‌దే పైచేయి అని చెప్పాడు.
 
 మూడో టెస్టు
 రేపు ఉదయం గం. 5.00 నుంచి
 స్టార్ క్రికెట్-1లో ప్రత్యక్ష ప్రసారం
 

మరిన్ని వార్తలు