ఏకపక్షమా సంచలనమా ?

18 Jun, 2015 06:57 IST|Sakshi
ఏకపక్షమా సంచలనమా ?

నేడు భారత్, బంగ్లాదేశ్ తొలి వన్డే
పటిష్టంగా కనిపిస్తున్న ధోని సేన
ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్
ఈ మ్యాచ్‌కూ వర్షం అడ్డంకి!

 
 సరిగ్గా మూడు నెలల క్రితం...ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయానికి వివాదం తోడైంది. ‘నోబాల్’ కారణంగానే తాము ఓడామంటూ, లేదంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని బంగ్లాదేశ్ ఆటగాళ్లతో పాటు అధికారులూ రచ్చ చేశారు. అందులో వాస్తవం సంగతి ఎలా ఉన్నా, ఆ దేశ అభిమానుల మనసుల్లో మాత్రం అదే ముద్రించుకుపోయింది. ఇప్పుడు ఇరు జట్లు మరోసారి వన్డే మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. భారత్ ముందు బంగ్లాదేశ్ స్థాయి ఏమిటో చూపించేందుకు ధోని సేన సిద్ధమవుతుండగా... భారత్‌కు షాక్ ఇవ్వాలని ఆతిథ్య జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్‌కు రంగం సిద్ధమైంది.
 
 మిర్పూర్: వర్షం బారిన పడిన టెస్టు తర్వాత ఇప్పుడు ఇరు జట్లు కొత్తగా కనిపిస్తున్నాయి. పలువురు ఆటగాళ్లతో పాటు కెప్టెన్లు కూడా మారారు. ప్రపంచకప్ సెమీస్ ఓటమి తర్వాత భారత్ తొలిసారి వన్డే ఆడబోతుండగా... ఇటీవల పాక్‌ను చిత్తు చేసిన ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్ సన్నద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం (నేడు) ఇక్కడ తొలి మ్యాచ్ (డేనైట్) జరగనుంది. అయితే టెస్టులాగే ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రతీ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండటం ఊరటనిచ్చే విషయం.
 
 క్లీన్‌స్వీప్ లక్ష్యం
 సరిగ్గా ఏడాది క్రితం బంగ్లాదేశ్‌లో వన్డే సిరీస్ ఆడినప్పుడు భారత జట్టు ఏకంగా తమ ప్రధాన ఆటగాళ్లు ఎనిమిది మందికి విశ్రాంతినిచ్చి జూనియర్లను పంపించింది. అయితే అప్పుడు ఆడని ఏడుగురు సభ్యులతో కలిపి ప్రస్తుతం జట్టు పూర్తి బలగంతో బరిలోకి దిగుతోంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో పాటు బలమైన బౌలింగ్ టీమిండియా విజయానికి భరోసా ఇస్తున్నాయి. అనూహ్య మార్పులు లేకుండానే తుది జట్టు ఉండవచ్చు. రోహిత్, ధావన్‌ల ఓపెనింగ్ మరోసారి చక్కటి ఆరంభం ఇస్తే ఆ తర్వాత కోహ్లి, రైనా, రహానేలు చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ కప్ ఆసాంతం విఫలమైనా జడేజాకు మళ్లీ అవకాశం దక్కవచ్చు.
 
  బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ పేస్‌కు మోహిత్ శర్మ అండగా నిలుస్తాడు. అశ్విన్ స్పిన్‌ను ఎదుర్కోవడం బంగ్లా బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. వరల్డ్ కప్ సెమీస్‌లో ఆసీస్‌తో ఆడిన జట్టులో ఒకే ఒక మార్పుతో టీమిండియా ఆడనుంది. గాయంతో ఈ టూర్‌కు దూరమైన షమీ స్థానంలో భువనేశ్వర్ తుది జట్టులో ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా గత ఐదు నెలల్లో 36 సార్లు 300కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఉపఖండం వికెట్లపై 400 పరుగులు ఇప్పుడు అసాధారణమేమీ కాదు. కాబట్టి మన ఆటగాళ్లు చెలరేగితే భారీ స్కోరు ఖాయం. ఈ సిరీస్‌ను 3-0తో గెలుచుకున్నా భారత్ నంబర్ 2 ర్యాంక్‌లో మార్పు ఉండదు. అయితే బంగ్లాదేశ్ స్థాయి ఏంటో చెప్పాలంటే క్లీన్‌స్వీప్ చేయాల్సిందే.
 
 పెద్దన్నపై గెలిస్తేనే...
 బంగ్లాదేశ్ వన్డే ప్రదర్శన ఇటీవల బాగా మెరుగైంది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై సంచలనం తర్వాత, సొంతగడ్డపై పాకిస్తాన్‌ను 3-0తో ఆ జట్టు చిత్తు చేసింది. అయితే పై రెండు జట్లతో పోలిస్తే పటిష్టమైన ‘పెద్దన్న’ భారత్‌పై గెలవడం ఆ జట్టు శక్తికి మించిన పనే!  జట్టు ఆర్డర్‌లో ఏడో స్థానం వరకు కూడా బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఉన్నారు. సీనియర్ తమీమ్ ఇక్బాల్‌తో పాటు మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. మూడో స్థానంలో మోమినుల్ లేదా టెస్టులో రాణించిన లిటన్ దాస్‌లలో ఒకరికి చోటు దక్కవచ్చు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ముష్ఫికర్, షకీబ్ కీలకం కానున్నారు.  జట్టులోని ముగ్గురు పేసర్లు కూడా బంగ్లా ఆశలను నిలబెట్టగలరు. కెప్టెన్ మొర్తజాతో పాటు వరల్డ్ కప్ స్టార్లు రూబెల్ హుస్సేన్, తస్కీన్‌లపై ఆ జట్టు ఆధార పడుతోంది. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్ నెగ్గినా... ఆ జట్టు ర్యాంకుల్లో టాప్-8లో ఉంటుంది. దాంతో చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉంటాయి.
 
 జట్లు (అంచనా)
 భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, రహానే, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, ఉమేశ్, మోహిత్.
 బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), తమీమ్, సర్కార్, మోమినుల్/లిటన్, ముష్ఫికర్, షకీబ్, రహమాన్, హొస్సేన్, అరాఫత్, రూబెల్, తస్కీన్.
 
 పిచ్, వాతావరణం
 ఏడాది క్రితం ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన సిరీస్‌లో బంతి అనూహ్యంగా స్వింగ్ కావడం ఆశ్చర్యపరచింది. అయితే ఈ సారి ఆ పరిస్థితి లేదు. మిర్పూర్ పిచ్ సాధారణంగా నెమ్మదిగా స్పందిస్తుంది. అయితే వాతావరణాన్ని బట్టి వికెట్ స్వభావం మారవచ్చు. గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు కూడా వర్ష సూచన ఉంది. కాబట్టి మ్యాచ్ ఎంతవరకు సాగుతుందో సందేహమే.
 
 లైవ్
 మ. గం. 2.30 నుంచి
 స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

 

>
మరిన్ని వార్తలు