రోహిత్‌ తుఫాన్‌: రెండో టి20లో భారత్‌ జయభేరి

7 Nov, 2019 22:30 IST|Sakshi

రాణించిన చహల్‌

10న నాగ్‌పూర్‌లో ఆఖరి మ్యాచ్‌

రాజ్‌కోట్‌లో వస్తుందనుకున్న ‘మహా’ తుఫానైతే రాలేదు. కానీ... గెలవాల్సిన మ్యాచ్‌లో నాయకుడు చెలరేగిపోయాడు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ అంతా తానై నడిపించాడు. వందో మ్యాచ్‌లో ‘శత’గ్గొట్టే అవకాశం చేజారినా... భారీ సిక్సర్లతో చితగ్గొట్టేశాడు. తొలి మ్యాచ్‌తో వెనుకబడిన భారత్‌ ఈ అలవోక విజయంతో సమంగా నిలిచింది. ఇక సిరీస్‌ విజయమే మిగిలుంది.

రాజ్‌కోట్‌: రోహిత్‌ శర్మ మెరుపు బ్యాటింగ్‌ సౌరాష్ట్ర క్రికెట్‌ స్టేడియాన్ని ముంచెత్తింది. అతని పరుగుల ప్రవాహంతో భారత్‌ రెండో టి20లో అలవోక విజయం సాధించింది. గురువారం జరిగిన పోరులో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. మొహమ్మద్‌ నయీమ్‌ (31 బంతుల్లో 36; 5 ఫోర్లు), సౌమ్య సర్కార్‌ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. భారత స్పిన్నర్‌ చహల్‌ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 15.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (43 బంతుల్లో 85; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి గెలుపుబాట పరచగా,  శిఖర్‌ ధావన్‌ (27 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించాడు.

ఆరు+ఆరు... రోహిత్‌ జోరు 
సిరీస్‌ చేజార్చుకోకుండా ఉండాలంటే ఛేదించాల్సిన లక్ష్యాన్ని రోహిత్‌ సులువుగా మార్చేశాడు. టి20 మెరుపులకు సరిగ్గా సరిపోయే ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 6 ఫోర్లు... 6 సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ ఆరంభంలో అతని ఆట చాలా నెమ్మదిగా మొదలైంది. ఆ తర్వాత తుఫాన్‌ ఇన్నింగ్స్‌కు సంబంధించిన ‘షో’ మొదలైంది. ముస్తాఫిజుర్‌ ఓవర్లో 2 ఫోర్లు, బౌలర్‌ తలపైనుంచి ఓ భారీ సిక్సర్‌ బాదేశాడు. ఆ తర్వాత ఇస్లామ్‌ను ఓ బౌండరీ, సిక్సర్‌తో శిక్షించాడు. 5.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 50కి చేరింది. మొసద్దిక్‌ హుస్సేన్‌ వేసిన పదో ఓవర్‌లో రోహిత్‌ మరింతగా చేలరేగిపోయాడు. తొలి మూడు బంతులు సిక్సర్లే! ఆ ఓవర్‌ పూర్తికాకముందే 9.2 ఓవర్లకే భారత్‌ 100 పరుగులు పూర్తయ్యాయి. రోహిత్‌ ధాటికి రెండో ఫిఫ్టీకి కేవలం 4 ఓవర్లే అవసరమయ్యాయి. 11వ ఓవర్లో ధావన్‌ ఔట్‌ కావడంతో 118 పరుగుల భారీ ఓపెనింగ్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మరో రెండు ఓవర్లకే రోహిత్‌ కూడా ఔటైనా... మిగతా లాంఛనాన్ని శ్రేయస్‌ అయ్యర్‌ (13 బంతుల్లో 24 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), లోకేశ్‌ రాహుల్‌ (8 నాటౌట్‌) అజేయంగా పూర్తిచేశారు.

ఓపెనర్ల  శుభారంభం 
అంతకుముందు టాస్‌ నెగ్గిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా... బంగ్లా ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు లిటన్‌ దాస్, నయీమ్‌ శుభారంభాన్ని ఇచ్చారు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన ఖలీల్‌ అహ్మద్‌కు నయీమ్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో స్వాగతం పలికాడు. పవర్‌ప్లే ముగిసేలోపే 5.4 ఓవర్లలోనే బంగ్లాదేశ్‌ స్కోరు 50 పరుగులకు చేరింది. పిచ్‌ స్వభావరీత్యా ఇక భారీస్కోరు ఖాయంగా కనిపించింది. సాఫీగా... ధాటిగా సాగిపోతున్న ఓపెనింగ్‌ జోడీని రనౌట్‌ విడగొట్టింది. తొలి వికెట్‌ కూలాక భారత బౌలర్లు జాగ్రత్తపడ్డారు. ప్రత్యర్థిని చక్కగా కట్టడి చేశారు. ఆఖరి ఓవర్లలో కెప్టెన్‌ మహ్ముదుల్లా (21 బంతుల్లో 30; 4 ఫోర్లు) బౌండరీలు బాదడం తో జట్టు స్కోరు 150 పరుగులను దాటింది.

100 : వంద అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు  ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్‌ గుర్తింపు పొందాడు. షోయబ్‌ మాలిక్‌ (111) మాత్రమే ముందున్నాడు

స్కోరు వివరాలు 
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ రనౌట్‌ 29, నయీమ్‌ (సి) శ్రేయస్‌ (బి) సుందర్‌ 36; సౌమ్య సర్కార్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) చహల్‌ 30; ముష్ఫికర్‌ (సి) కృనాల్‌ (బి) చహల్‌ 4; మహ్ముదుల్లా (సి) దూబే (బి) చహర్‌ 30; అఫీఫ్‌ (సి) రోహిత్‌ (బి) ఖలీల్‌ 6; మొసద్దిక్‌ నాటౌట్‌ 7; ఇస్లామ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు)153.
వికెట్ల పతనం: 1–60, 2–83, 3–97, 4–103, 5–128, 6–142. 
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–25–1, ఖలీల్‌ 4–0–44–1, సుందర్‌ 4–0–25–1, చహల్‌ 4–0–28–2, దూబే 2–0–12–0, కృనాల్‌ 2–0–17–0. 


భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) (సబ్‌) మిథున్‌ (బి) అమినుల్‌ ఇస్లామ్‌ 85; శిఖర్‌ ధావన్‌ (బి) అమినుల్‌ ఇస్లామ్‌ 31; రాహుల్‌ నాటౌట్‌ 8; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 24; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (15.4 ఓవర్లలో 2 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1–118, 2–125. 
బౌలింగ్‌: ముస్తఫిజుర్‌ 3.4–0–35–0, షఫియుల్‌ ఇస్లామ్‌ 2–0–23–0, అల్‌ అమిన్‌ 4–0–32–0, అమినుల్‌ ఇస్లామ్‌ 4–0–29–2, అఫీఫ్‌ 1–0–13–0, మొసద్దిక్‌ హుస్సేన్‌ 1–0–21–0.

‘రాజ్‌కోట్‌ వికెట్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంటుందని, రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ కష్టంగా మారిపోతుందని నాకు తెలుసు. దానిని వాడుకొని పవర్‌ప్లేలో చెలరేగిపోయాం. ఆ తర్వాత జోరు కొనసాగించడమే    మిగిలింది. నేను బౌలర్లను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయను. ఇన్నేళ్లుగా నాకు     తెలిసిన ఒకే ఒక పని బ్యాట్‌ చేతిలో ఉన్నప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి బంతిని బలంగా బాదాలనే సిద్ధమయ్యా. 2019 అద్భుతంగా సాగింది. దీనిని అలాగే ముగించాలని కోరుకుంటున్నా’ 
–రోహిత్‌ శర్మ
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా