ఫార్మాట్ మారింది... పూనకమొచ్చింది!

28 Aug, 2014 02:46 IST|Sakshi
ఫార్మాట్ మారింది... పూనకమొచ్చింది!

వీళ్లేనా... మొన్నటిదాకా పరుగులు చేయడానికి వణికిన బ్యాట్స్‌మెన్..!
వీళ్లేనా... ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఆపడానికి ఆపసోపాలు పడ్డ బౌలర్లు..!
వీళ్లేనా... ఘోరమైన ఆటతో ఇంటా బయటా తిట్లు తిన్న క్రికెటర్లు..!


టెస్టుల్లో ఘోర ఓటమితో కసి పెరిగిందో... లేక ప్రపంచకప్ ఆడాలంటే నిలబడాలని గుర్తొచ్చిందో... కారణం ఏదైనా... ఫార్మాట్ మారగానే భారత క్రికెటర్లు పూనకం వచ్చినట్లు చెలరేగిపోయారు. అటు బ్యాట్స్‌మెన్ కసిదీరా ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడితే... ఇటు బౌలర్లు ప్రత్యర్థిని చుట్టిపారేశారు. ఫలితంగా రెండో వన్డేలో భారత్ 133 పరుగులతో ఘన విజయం సాధించింది.
 
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
133 పరుగులతో నెగ్గిన ధోనిసేన
రైనా సూపర్ సెంచరీ
రాణించిన ధోని, రోహిత్
ఐదు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యం
మూడో వన్డే శనివారం
కార్డిఫ్: ఇంగ్లండ్ గడ్డపై గత ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా ఐదు విజయాలతో భారత్ సత్తా చాటింది. నాటి రికార్డును ఇప్పుడు కొనసాగిస్తూ భారత్ మరోసారి అదే తరహా స్ఫూర్తిదాయక ఆటతీరును కనబర్చింది. అప్పటిలాగే జట్టు సమష్టిగా రాణించడంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం లభించింది. బుధవారం ఇక్కడ సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ 133 పరుగుల భారీ తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.

సురేశ్ రైనా (75 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత సెంచరీ సాధించగా... కెప్టెన్ ధోని (51 బంతుల్లో 52; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (87 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రైనా, ధోని ఐదో వికెట్‌కు 16.5 ఓవర్లలోనే 144 పరుగులు జోడించడం విశేషం. అనంతరం వర్షం కారణంగా ఇంగ్లండ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయీస్ ప్రకారం 47 ఓవర్లలో 295 పరుగులుగా నిర్ణయించారు. అయితే ఆ జట్టు 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్ హేల్స్ (63 బంతుల్లో 40; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జడేజా 28 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తాజా ఫలితంతో వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే శనివారం నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది.
 
ఆదుకున్న రోహిత్
ఆరంభంలో ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.   తన మూడో ఓవర్ తొలి బంతికి ధావన్ (11)ను అవుట్ చేసిన వోక్స్, మరో రెండు బంతులకే కోహ్లి (0)ని డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఎదుర్కొన్న మూడో బంతికే  భారీ షాట్‌కు ప్రయత్నించిన విరాట్, తన టెస్టు సిరీస్ వైఫల్యాన్ని కొనసాగించడంతో స్కోరు 19/2 వద్ద నిలిచింది. అయితే రోహిత్ శర్మ, రహానే (47 బంతుల్లో 41; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 91 పరుగులు జత చేశారు. రోహిత్ 82 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరు ట్రెడ్‌వెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు.
 
భారీ భాగస్వామ్యం
ఈ దశలో రైనా, ధోనిల భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది. మొదట్లో నెమ్మదిగానే ఆడిన రైనా, ఆ తర్వాత చెలరేగిపోయాడు. 49 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. తర్వాత జోరు మరింత పెంచి  74 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో వైపు కెప్టెన్ కూడా తనదైన శైలిలో షాట్లు ఆడి 49 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరి జోరుతో భారత్ రెండో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసింది. తొలి 37 ఓవర్లలో నాలుగు వికెట్లకు 171 పరుగులు చేస్తే... చివరి 13 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేయడం విశేషం.
 
బౌలర్ల జోరు
భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఏ దశలోనూ వేగంగా ఆడలేదు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన హేల్స్  మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ కుక్ (19), బెల్ (1)లను ఒకే ఓవర్లో అవుట్ చేసి షమీ ప్రత్యర్థి జట్టును నియంత్రించాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో రూట్ (4), హేల్స్, బట్లర్ (2) వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ భాగస్వామ్యం నమోదు కాకపోవడంతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు.  
 
స్కోరు వివరాలు:
భారత్ ఇన్నింగ్స్:
రోహిత్ (సి) వోక్స్ (బి) ట్రెడ్‌వెల్ 52; ధావన్ (సి) బట్లర్ (బి) వోక్స్ 11; కోహ్లి (సి) కుక్ (బి) వోక్స్ 0; రహానే (స్టం) బట్లర్ (బి) ట్రెడ్‌వెల్ 41; రైనా (సి) అండర్సన్ (బి) వోక్స్ 100; ధోని (బి) వోక్స్ 52; జడేజా నాటౌట్ 9; అశ్విన్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 304.
 వికెట్ల పతనం: 1-19; 2-19; 3-110; 4-132; 5-276; 6-288.
 బౌలింగ్: అండర్సన్ 10-1-57-0; వోక్స్ 10-1-52-4; జోర్డాన్ 10-0-73-0; స్టోక్స్ 7-0-54-0; రూట్ 3-0-14-0; ట్రెడ్‌వెల్ 10-1-42-2.
 
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (ఎల్బీ) (బి) షమీ 19; హేల్స్ (సి) అశ్విన్ (బి) జడేజా 40; బెల్ (బి) షమీ 1; రూట్ (బి) భువనేశ్వర్ 4; మోర్గాన్ (సి) షమీ (బి) అశ్విన్ 28; బట్లర్ (సి) కోహ్లి (బి) జడేజా 2; స్టోక్స్ (సి) రహానే (బి) జడేజా 23; వోక్స్ (స్టం) ధోని (బి) జడేజా 20; జోర్డాన్ (ఎల్బీ) (బి) రైనా 0; ట్రెడ్‌వెల్ (సి) జడేజా (బి) అశ్విన్ 10; అండర్సన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (38.1 ఓవర్లలో ఆలౌట్) 161.
వికెట్ల పతనం: 1-54; 2-56; 3-63; 4-81; 5-85; 6-119; 7-126; 8-128; 9-143; 10-161 బౌలింగ్: భువనేశ్వర్ 7-0-30-1; మోహిత్ శర్మ 6-1-18-0; షమీ 6-0-32-2; అశ్విన్ 9.1-0-38-2; జడేజా 7-0-28-4; రైనా 3-0-12-1.
 
అదే వేదిక... అవే పరుగులు
మూడేళ్ల క్రితం...ఇదే వేదికపై భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే...ఇరు జట్ల కెప్టెన్లు ధోని, కుక్... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్‌కు ముందు ఇంగ్లండ్ లక్ష్యాన్ని 47 ఓవర్లలో 295 పరుగులుగా నిర్ణయించారు. ఆ తర్వాత మళ్లీ లక్ష్యం మారి డక్‌వర్త్ లూయీస్ ప్రకారం ఇంగ్లండ్ గెలిచింది. ఇప్పుడూ అదే మైదానం...నాయకులూ వారే. భారత్ సరిగ్గా అదే స్కోరు చేసింది. నాడు కోహ్లి సెంచరీ చేస్తే నేడు రైనా శతకం బాదాడు. ఇంగ్లండ్ లక్ష్యం కూడా సరిగ్గా అదే. ఈ సారి మాత్రం ఫలితం మారింది.
 
11 బంతుల ఓవర్...
ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ వేసిన ఇన్నింగ్స్ 39వ ఓవర్ ఇంగ్లండ్ కెప్టెన్‌కు అసహనాన్ని మిగల్చగా, భారత్‌కు 13 పరుగులు అందించింది. ఏ మాత్రం నియంత్రణ లేకుండా సాగిన బౌలింగ్‌తో జోర్డాన్ ఆ ఓవర్లో ఏకంగా ఐదు వైడ్లు వేశాడు. ధోని ఒక ఫోర్ కొట్టగా, మరో నాలుగు సింగిల్స్ వచ్చాయి. మ్యాచ్‌లో మొత్తంగా జోర్డాన్ ఒక్కడే 12 వైడ్లు విసరగా, ఇంగ్లండ్ ఎక్స్‌ట్రాల రూపంలోనే 29 పరుగులు ఇచ్చింది.
 
1    ఉపఖండం వెలుపల రైనాకు ఇదే తొలి సెంచరీ
4    రైనా కెరీర్‌లో ఇది నాలుగో సెంచరీ. 2010 జనవరిలో తన మూడో సెంచరీ నమోదు చేసిన రైనా... 95 ఇన్నింగ్స్‌ల తర్వాత మరో సెంచరీ సాధించాడు.
1     వన్డేల చరిత్రలో ఐదో వికెట్‌కు 2000కు పైగా పరుగులు జోడించిన తొలి జోడి ధోని, రైనా.

మరిన్ని వార్తలు