పుజారా సూపర్‌ సెంచరీ

1 Sep, 2018 00:35 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 273 ఆలౌట్‌

27 పరుగుల స్వల్ప ఆధిక్యం 

మొయిన్‌ అలీకి 5 వికెట్లు 

టెస్టు క్రికెట్‌లో తన విలువేమిటో చతేశ్వర్‌ పుజారా మరోసారి చూపించాడు. క్లిష్ట పరిస్థితుల్లో, సహచరులంతా వెనుదిరిగిన వేళ ఒక్కడే నిలబడి ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా చేశాడు. మొయిన్‌ అలీ తెలివైన బౌలింగ్, మన బ్యాట్స్‌మెన్‌ స్వయంకృతం కలగలిపి ఒక దశలో ఆధిక్యం కోల్పోయేలా కనిపించిన భారత్‌.... విదేశీ గడ్డపై పుజారా చిరస్మరణీయ సెంచరీతో కోలుకుంది. రెండు రోజుల ఆట తర్వాత ఇరు జట్లు దాదాపు సమంగా నిలిచిన స్థితిలో నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది.   

సౌతాంప్టన్‌: ఒక దశలో భారత్‌ స్కోరు 142/2... క్రీజ్‌లో పుజారాతో పాటు కోహ్లి ఉన్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం అప్పటికే 92 పరుగులకు చేరుకుంది. భారీ ఆధిక్యం సునాయాసంగా లభిస్తుందని అనిపించింది. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయి స్కోరు 195/8కు చేరుకుంది. మరో 51 పరుగులు వెనుకబడి ఉండగా, 2 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి స్థితిలో చతేశ్వర్‌ పుజారా (257 బంతుల్లో 132 నాటౌట్‌; 16 ఫోర్లు) పట్టుదలగా నిలబడి శతకంతో చెలరేగాడు. ఇషాంత్‌తో తొమ్మిదో వికెట్‌కు 32, బుమ్రాతో పదో వికెట్‌కు 46 పరుగుల చొప్పున జత చేశాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 273 పరుగులకు ఆలౌటై 27 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. చివరి రెండు వికెట్లకు భారత్‌ 78 పరుగులు జోడిస్తే అందులో పుజారా చేసినవే 54 ఉన్నాయి. దాదాపు ఆరు గంటల పాటు క్రీజ్‌లో నిలిచిన పుజారా కెరీర్‌లో 15వ సెంచరీ సాధించడం విశేషం. ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ (5/63) ఐదు వికెట్లతో చెలరేగగా, బ్రాడ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఇంగ్లండ్‌ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.  

కీలక భాగస్వామ్యం... 
ఓవర్‌నైట్‌ స్కోరు 19/0తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తొందరగానే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బ్రాడ్‌ చక్కటి బౌలింగ్‌కు 13 పరుగుల వ్యవధిలో రాహుల్‌ (19), ధావన్‌ (23) ఔటయ్యారు. ఈ దశలో మరోసారి జట్టు ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సిన బాధ్యత పుజారా, కోహ్లిపై పడింది. వీరిద్దరు ఇంగ్లండ్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనడంతో లంచ్‌ సమయానికి భారత్‌ స్కోరు వంద పరుగులకు చేరింది. విరామం తర్వాత వీరిద్దరు వేగం పెంచి చకచకా పరుగులు సాధించారు. 100 బంతుల్లో పుజారా అర్ధసెంచరీ పూర్తయింది. అయితే కరన్‌ ఈ జోడీని విడదీయడంతో భారత్‌ పతనం ప్రారంభమైంది. దూరంగా వెళుతున్న బంతిని వెంటాడిన కోహ్లి స్లిప్‌లో కుక్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత రహానే (11) వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో రహానే వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్‌ రివ్యూలో అది ‘నోబాల్‌’గా కనిపించింది. దీనిపై పూర్తిగా స్పష్టత లేకున్నా... టీవీ అంపైర్‌ మాత్రం ఇంగ్లండ్‌కు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ దశలో మొయిన్‌ అలీ 14 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లతో టీమిండియాను దెబ్బ తీశాడు. 29 బంతులాడిన రిషభ్‌ పంత్‌ (0) డకౌట్‌గా వెనుదిరగ్గా, పాండ్యా (4) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాత రివర్స్‌ స్వీప్‌ ఆడబోయి అశ్విన్‌ (1), తర్వాతి బంతికి షమీ (0) క్లీన్‌ బౌల్డయ్యారు. ఇషాంత్‌ (14) అండగా నిలవడంతో పుజారా స్కోరును ముందుకు నడిపించాడు. ఇషాంత్‌ ఔటైన తర్వాత బుమ్రా (6) సహకారంతో అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి భారత్‌కు కీలకమైన తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందించాడు.  

119 కోహ్లి టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో గావస్కర్‌ (117) తర్వాత తక్కువ ఇన్నింగ్స్‌ (119)లలో ఈ మైలురాయి చేరిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 5 వేల నుంచి 6 వేల పరుగులకు చేరుకునేందుకు కోహ్లి 14 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకోవడం విశేషం. 

మరిన్ని వార్తలు