నాలుగో ప్రయత్నం ఫలిస్తుందా..!

5 Mar, 2020 03:38 IST|Sakshi

ఫైనల్‌ లక్ష్యంగా భారత మహిళలు  

నేడు ఇంగ్లండ్‌తో టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ పోరు 

గతంలో మూడుసార్లు సెమీస్‌లోనే ఓటమి  

ఉదయం గం. 9.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

మహిళల టి20 ప్రపంచ కప్‌ చరిత్రలో భారత జట్టు ఒక్కసారి కూడా ఫైనల్లోకి అడుగు పెట్టలేదు. మూడుసార్లు సెమీఫైనల్‌కే పరిమితమైంది. ఇప్పుడు నాలుగో ప్రయత్నంలో ఆ గీత దాటాలని పట్టుదలగా ఉంది. తాజా ఫామ్, టోర్నీలో అజేయ ప్రదర్శన అందుకు కావాల్సిన స్ఫూర్తిని అందిస్తున్నాయి. ఇది హర్మన్‌ సేనపై ఉన్న అంచనాలకు సంబంధించి ఒక పార్శ్వం. 

కానీ అటువైపు చూస్తే ప్రత్యర్థి ఇంగ్లండ్‌... టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో తలపడిన ఐదు సార్లూ భారత్‌కు పరాజయమే ఎదురైంది. 2018 టోర్నీ సెమీఫైనల్లో కూడా ఇదే జట్టు చేతిలో మన టీమ్‌  ఓడింది. అప్పుడు కూడా సరిగ్గా ఇలాగే లీగ్‌ దశలో నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి సెమీస్‌లోనే వెనుదిరిగింది. ఇప్పుడు గత  రికార్డును మన అమ్మాయిలు సవరిస్తారా, లెక్క సరి చేస్తారా  వేచి చూడాలి.  


సిడ్నీ: లీగ్‌ దశలో నాలుగు వరుస విజయాలతో సత్తా చాటిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో అసలు పోరుకు సన్నద్ధమైంది. నేడు జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ టోర్నీలో భారత్‌ ఓటమి లేకుండా అజేయంగా నిలవగా... ఇంగ్లండ్‌ మాత్రం దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఇరు జట్ల మధ్య ముఖాముఖీ పోరులో మాత్రం మన ప్రత్యర్థిదే పైచేయి. అయితే ఎక్కువ మంది యువ ప్లేయర్లతో నిండిన మన జట్టు తాజా ఫామ్‌ మాత్రం ఫైనల్‌ చేరడంపై ఆశలు రేపుతోంది.  

హర్మన్‌ ఫామ్‌తో ఇబ్బంది!  
లీగ్‌ దశలో భారత జట్టు వరుస విజయాల్లో 16 ఏళ్ల షఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. బుధవారం ప్రకటించిన తాజా ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కూడా మారిన షఫాలీ 4 ఇన్నింగ్స్‌లలో కలిపి 161 పరుగులు చేసింది. అదీ 166 స్ట్రయిక్‌ రేట్‌తో కావడం విశేషం. మరోసారి షఫాలీ ఇచ్చే ఆరంభం జట్టుకు కీలకం కానుంది. జెమీమా రోడ్రిగ్స్‌ (85 పరుగులు), దీప్తి శర్మ (83 పరుగులు) కొంత వరకు ఫర్వాలేదనిపించారు కానీ తొలి స్థానంలో ఉన్న షఫాలీకి వీరిద్దరికి మధ్య పరుగుల్లో చాలా అంతరం ఉంది. అయితే అన్నింటికి మించి భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇద్దరు టాప్‌ బ్యాటర్లు స్మృతి మంధాన, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ల ఆట. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో అద్భుతంగా ఆడిన అనుభవంతో స్మృతి ఈసారి వరల్డ్‌ కప్‌లో భారత్‌ను నడిపిస్తుందని భావిస్తే ఆమె పూర్తిగా నిరాశపర్చింది. 3 మ్యాచ్‌లలో కలిపి 38 పరుగులే చేసింది. ఇక హర్మన్‌ కౌర్‌ మరీ ఘోరం. అటు వన్డేలు, ఇటు టి20ల్లో పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన హర్మన్‌ ఈ మెగా టోర్నీలో పూర్తిగా చేతులెత్తేసింది.

ఆమె వరుసగా 2, 8, 1, 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీఫైనల్లోనైనా వీరిద్దరు తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాల్సి ఉంది. కేవలం షఫాలీ బ్యాటింగ్‌పైనే ఆధారపడితే కీలక మ్యాచ్‌లో భారత్‌కు ఎదురు దెబ్బ తగలవచ్చు. బౌలింగ్‌లో స్పిన్నర్లే భారత్‌కు బలం. తుది జట్టులో శిఖా పాండే రూపంలో ఏకైక పేసర్‌ ఉన్నా విభిన్న శైలి గల స్పిన్నర్లే ఆటను శాసిస్తున్నారు. లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్, లెఫ్టార్మ్‌ స్పిన్నర్లు రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, ఆఫ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మలతో బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పూనమ్‌ స్పిన్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనిగా మారింది. శిఖా పాండే కూడా చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఈ ఐదుగురు బౌలర్ల ఎకానమీ ప్రపంచకప్‌లో 6 దాటకపోవడం విశేషం. గాయాల సమస్య లేదు కాబట్టి  శ్రీలంకతో చివరి లీగ్‌ ఆడిన తుది జట్టునే మార్పుల్లేకుండా భారత్‌ కొనసాగించనుంది.  2018 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఓడిన జట్టులో ఆడిన ఏడుగురు ప్లేయర్లు ఇప్పుడు భారత జట్టు తరఫున మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 

జోరు మీదున్న సివెర్‌..
వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్‌ను సెమీఫైనల్‌ చేర్చడంలో ఇద్దరు బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. నటాలీ సివెర్‌ 4 మ్యాచ్‌లలో కలిపి 202 పరుగులు చేసింది. ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆమెకు కెప్టెన్‌ హెథర్‌ నైట్‌ (193)నుంచి మంచి సహకారం లభించింది. నైట్‌ ఖాతాలో ఒక శతకం కూడా ఉండటం విశేషం. మరోసారి ఇంగ్లండ్‌ జట్టు ఈ ఇద్దరి బ్యాటింగ్‌పైనే ఆధారపడుతోంది. వీరిని నిలువరించగలిగితేనే ప్రత్యర్థి పని సులువవుతుంది. అమీ జోన్స్, డానియెలా వ్యాట్‌ వరుసగా విఫలమవుతున్నారు. అయితే ఇంగ్లండ్‌ కూడా తమ బౌలింగ్‌ను బాగా నమ్ముకుంది. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ఎకెల్‌స్టోన్‌ పాత్ర మరోసారి కీలకం కానుంది. ఈ బౌలర్‌ టోర్నీలో ఇప్పటి వరకు కేవలం 3.23  ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టింది. ష్రబ్‌సోల్‌ కూడా 8 వికెట్లతో అండగా నిలవగా, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను సారా గ్లెన్‌ కట్టడి చేసింది. ఈ నేపథ్యంలో సెమీస్‌ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

వర్షం పడితే ఫైనల్‌కు భారత్‌..
రిజర్వ్‌ డే అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ  
ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ల కోసం రిజర్వ్‌ డే ఉంచాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) చేసిన విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తోసి పుచ్చింది. స్థానిక వాతావరణ శాఖ సూచన ప్రకారం గురువారం రోజంతా వర్ష సూచన ఉంది. దాంతో కీలకమైన పోరు కాబట్టి రిజర్వ్‌ డే ఉంటే బాగుంటుందని సీఏ భావించింది. ‘టోర్నీ ప్రారంభానికి ముందు అంగీకరించిన నిబంధనల్లో రిజర్వ్‌ డే ప్రస్తావన లేదు కాబట్టి ఇప్పుడు కుదరదు’ అని ఐసీసీ తేల్చి చెప్పింది. సెమీస్, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే పెడితే టోర్నీ వ్యవధి మరింత పెరుగుతుందని, ఇది అనవసరపు ఇబ్బందికి దారి తీస్తుందని కూడా ఐసీసీ వెల్లడించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం వర్షం పడితే పిచ్, మైదానం పరిస్థితులను బట్టి రిఫరీ నిర్ణయం తీసుకుంటారు. కనీసం ఒక్కో జట్టు 10 ఓవర్ల చొప్పున ఆడే అవకాశం ఉంటేనే మ్యాచ్‌ కొనసాగిస్తారు. అంతకంటే తక్కువ ఓవర్లే సాధ్యమైతే మ్యాచ్‌ రద్దయినట్లే. ఇదే జరిగితే గ్రూప్‌లో పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంటాయి.

రెండో సెమీస్‌ కూడా..
తొలి మ్యాచ్‌ ముగిసిన తర్వాత డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్‌ జరుగుతుంది. గ్రూప్‌ ‘బి’లో సఫారీ జట్టు అజేయంగా నిలవగా... ఆసీస్‌ మాత్రం భారత్‌ చేతిలో ఓడింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం గం. 1.30 నుంచి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), షఫాలీ, స్మృతి, జెమీమా, దీప్తి, వేద, తానియా, శిఖా పాండే, రాధ, పూనమ్, రాజేశ్వరి. ఇంగ్లండ్‌: హెథర్‌ నైట్‌ (కెప్టెన్‌), వ్యాట్, బీమాంట్, సివెర్, విల్సన్, అమీ జోన్స్, బ్రంట్, ష్రబ్‌సోల్, మ్యాడీ విలియర్స్, ఎకెల్‌స్టోన్, సారా గ్లెన్‌. 

పిచ్, వాతావరణం 
స్పిన్‌కు అనుకూలం. వర్షం పడితే పిచ్‌ స్వభావంలో మార్పు రావచ్చు. మ్యాచ్‌  సమయంలో వర్ష సూచన ఉంది. ఆటకు అంతరాయం కలిగించడం ఖాయం.

4 - భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 19 టి20 మ్యాచ్‌లు జరగ్గా... భారత్‌ 4 గెలిచి, 15 ఓడింది. ఇటీవల ముక్కోణపు టోర్నీలో భాగంగా రెండు సార్లు తలపడగా, ఇరు జట్లు చెరో మ్యాచ్‌ నెగ్గాయి.

>
మరిన్ని వార్తలు