పేసర్లకు ప్రాక్టీస్‌

27 Jul, 2018 01:44 IST|Sakshi

వారితోనే 56 ఓవర్లు

ఇషాంత్, ఉమేశ్‌లకు చెరో రెండు వికెట్లు

చెమ్స్‌ఫోర్డ్‌: తొలి రోజు బ్యాట్స్‌మెన్‌ తడబడి నిలదొక్కుకుంటే... రెండో రోజు బౌలర్లు దొరికిన పట్టును సడలించారు. దీంతో టీమిండియాతో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కౌంటీ జట్టు ఎస్సెక్స్‌ పోరాడుతోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 322/6తో గురువారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత జట్టు  మరో 73 పరుగులు జోడించి 395కి ఆలౌటైంది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (82) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరిగాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (51) అర్ధశతకం సాధించాడు. కరుణ్‌ నాయర్‌ (4) విఫలం కాగా... రవీంద్ర జడేజా (15) తోడుగా రిషభ్‌ పంత్‌ (26 బంతుల్లో 34 నాటౌట్‌; 6 ఫోర్లు) సహజ శైలిలో ఆడాడు.  అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎస్సెక్స్‌ గురువారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్లకు 236 పరుగులు చేసింది. ఒక దశలో 45/2తో నిలిచిన జట్టును కెప్టెన్‌ థామస్‌ వెస్లీ (89 బంతుల్లో 57; 11 ఫోర్లు), స్టీవెన్‌ పెపెర్‌ (74 బంతుల్లో 68; 15 ఫోర్లు) ఆదుకున్నారు. భారత బౌలర్లను ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్న వీరు మూడో వికెట్‌కు 95 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు. అయితే, వెస్లీని పెవిలియన్‌ పంపి శార్దుల్‌ ఠాకూర్‌ ఈ జోడీని విడదీశాడు. రిషి పటేల్‌ (19) అండగా నిలవడంతో పెపెర్‌ జోరు చూపాడు. అతను బౌండరీలతోనే  60 పరుగులు చేయడం విశేషం. ఈ దశలో ఇషాంత్, ఉమేశ్‌ మరోసారి విజృంభించి 17 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరిని అవుట్‌ చేశారు. ప్రస్తుతం వికెట్‌ కీపర్‌ ఫోస్టర్‌ (23 బ్యాటింగ్‌), వాల్టర్‌ (22 బ్యాటింగ్‌) క్రీజులో ఉండగా జట్టు మరో 158 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో షమీ 13 ఓవర్లు వేసినా వికెట్‌ పడగొట్టలేకపోయాడు. జడేజా రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. 

అశ్విన్‌కు గాయం! 
రెండో రోజు అశ్విన్‌ ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయకపోవడానికి గాయం కారణమని తెలిసింది. ఆటకు ముందు ఉదయం నెట్‌ప్రాక్టీస్‌ సమయంలో బ్యాటింగ్‌ చేస్తుండగా అతని చేతికి స్వల్ప గాయమైంది. లంచ్‌ సమయంలో నెట్స్‌లో కొన్ని బంతులు విసిరినా అతను అసౌకర్యంగా కనిపించాడు. అయితే ఆందోళన పడాల్సిన విషయం ఏమీ లేదని జట్టు మేనేజ్‌మెంట్‌ వెల్లడించినట్లు సమాచారం.    

మరిన్ని వార్తలు