‘ఇంగ్లిష్‌’ క్రికెట్‌కు రెడీ!

27 Jun, 2018 01:26 IST|Sakshi

ఐర్లాండ్‌ పోరుతో  పర్యటన ప్రారంభం

నేడు తొలి టి20 మ్యాచ్‌ 

కొత్త ఉత్సాహంతో టీమిండియా 

సంచలనంపై ఐర్లాండ్‌ గురి 

ఇంగ్లండ్‌ గడ్డపై నాలుగేళ్ల తర్వాత కీలక టెస్టు సిరీస్‌కు ముందు టి20, వన్డేలలో సత్తా చాటి ఫామ్‌లోకి వచ్చేందుకు భారత్‌ సన్నద్ధమైంది. పర్యటనలో భాగంగా అసలు పరీక్షకు ముందు ఐర్లాండ్‌తో టి20ల్లో తలపడనుంది. 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ బరిలోకి దిగుతున్న టీమిండియా తమ స్థాయికి తగినట్లుగా విజయంపై దృష్టి పెట్టగా... గతంలోనూ పలు సంచలనాలు నమోదు చేసిన ఐర్లాండ్‌ సొంతగడ్డపై మరోసారి అలాంటి ఆటతీరు కనబర్చాలని పట్టుదలగా ఉంది.   

డబ్లిన్‌: దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత భారత జట్టు తొలిసారి తమ పూర్తి స్థాయి జట్టుతో మరో అంతర్జాతీయ పోరుకు సిద్ధమైంది. ఐర్లాండ్‌తో రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ తొలి మ్యాచ్‌ జరుగనుంది. జట్టు బలాబలాలు, ఫామ్‌ దృష్ట్యా చూస్తే భారత్‌ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఇటీవలే టెస్టు హోదా పొందిన ఐర్లాండ్‌కు టి20ల్లో కూడా మంచి రికార్డు ఉండటం, స్థానిక పరిస్థితుల అనుకూలత కారణంగా మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.  

తుది జట్టులో ఎవరు? 
భారత జట్టు తమ ఆఖరి టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ గత మార్చిలో నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఆడింది. అయితే ఆ టోర్నీ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి, ధోని, భువనేశ్వర్, బుమ్రా ఇప్పుడు తిరిగొచ్చారు. ఈ నలుగురు కూడా తుది జట్టులో ఖాయం. అయితే తాజా ఫామ్‌ ప్రకారం చూస్తే ధోని వచ్చినా దినేశ్‌ కార్తీక్‌కు బ్యాట్స్‌మన్‌గా స్థానం దక్కవచ్చు. లోకేశ్‌ రాహుల్‌ కూడా టీమ్‌లో ఉండే అవకా శం ఉంది. కాబట్టి మనీశ్‌ పాండేకు చోటు కష్టం. టి20ల్లో అద్భుత రికార్డు ఉన్నా... తాజా కూర్పులో రైనాకు కూడా స్థానం అనుమానంగా ఉంది. హార్దిక్‌ పాండ్యాతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ మరింత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో ఇక్కడ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు  చహల్, కుల్దీప్‌లను కోహ్లి కచ్చితంగా తుది జట్టులో ఎంచుకోవచ్చు. ఇద్దరు పేసర్ల స్థానాల్లో భువీ, బుమ్రాలు తప్పనిసరి. అయితే ఇటీవల మంచి ఫామ్‌లో ఉండి పునరాగమనం చేసిన ఉమేశ్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటే వీరిద్దరిలో ఒకరికి విశ్రాంతి తప్పదు. సిద్ధార్థ్‌ కౌల్‌  అవకాశం కోసం కొంత కాలం వేచి చూడక తప్పదు.  

సీనియర్లదే భారం... 
ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా పది రోజుల క్రితమే స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌లతో ఆడిన ఐర్లాండ్‌ మంచి మ్యాచ్‌ ప్రాక్టీస్‌లో ఉంది. ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌ చేరిన ఐర్లాండ్‌ అదే జట్టును ఇక్కడా కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా కెప్టెన్‌ గ్యారీ విల్సన్, వెటరన్లు పోర్టర్‌ ఫీల్డ్, కెవిన్‌ ఓబ్రైన్‌లపై ఆ జట్టు ఆధారపడుతోంది. ఓపెనర్‌ స్టిర్లింగ్‌కు కూడా దూకుడుగా ఆడగల సత్తా ఉంది. బౌలింగ్‌లో డాక్‌రెల్, థాంప్సన్‌ కీలకం. భారత్‌లో పుట్టి ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్‌ స్పిన్నర్‌ సిమి సింగ్‌ తొలిసారి తన సొంత దేశానికి ప్రత్యర్థిగా ఆడనుం డటం విశేషం. టి20ల్లో ఒక మ్యాచ్‌ లో విండీస్‌పై మినహా మిగతా అన్ని విజయాలు చిన్న జట్లపైనే సాధించిన ఐర్లాండ్‌ పటిష్ట టీమిండియాకు ఎంతవరకు పోటీనిస్తుందనేది ఆసక్తికరం.  

ఆహ్లాదకర వాతావరణంలో... 
ఇంగ్లండ్‌ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత భారత జట్టు సోమవారం తొలిసారి ప్రాక్టీస్‌లో పాల్గొంది. లండన్‌ మహానగర శివార్లలో ఉన్న మర్చంట్‌ టేలర్స్‌ స్కూల్‌ను అందుకు వేదికగా ఎంచుకుంది. ఇంగ్లండ్‌లో అందుబాటులో ఉన్న ప్రధాన వేదికల్లోని శిక్షణా సౌకర్యాలకు దూరంగా కాస్త ప్రశాంతంగా సాధన చేసేందుకు కోహ్లి సేన ఇక్కడకు వచ్చింది. 800కు పైగా విద్యార్థులు ఉన్న ఈ స్కూల్‌లో ఎక్కువ మంది భారత ఉపఖండం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. 285 ఎకరాల విస్తీర్ణంలో అందమైన పచ్చిక బయళ్లు, రెండు వైపుల సరస్సులతో అద్భుతంగా ఉన్న ఈ స్కూల్‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేయడాన్ని ఆటగాళ్లు అమితంగా ఆస్వాదించారు. గతంలో ఈ స్కూల్‌లో కోచింగ్‌ ఇచ్చిన దిగ్గజ బ్యాట్స్‌మన్‌ గార్డన్‌ గ్రీనిడ్జ్‌ అక్కడే ఉండే భారత ఆటగాళ్లతో ముచ్చ టించాడు. సెలవులు గడిపేందుకు తన కొడుకుతో కలిసి వచ్చిన మాజీ పేసర్‌ నెహ్రా కూడా టీమిండియా బౌలర్లకు ప్రాక్టీస్‌లో సూచనలిచ్చాడు.  

►100  భారత్‌కు ఇది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌. ఇప్పటివరకు 62 మ్యాచ్‌లు గెలిచి, 35 ఓడింది. 2 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. 

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాహుల్, కార్తీక్, పాండ్యా, ధోని, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా/ఉమేశ్‌. 
ఐర్లాండ్‌: విల్సన్‌ (కెప్టెన్‌), స్టిర్లింగ్, షెనాన్, బల్బిర్నీ, సిమిసింగ్, కెవిన్‌ ఓబ్రైన్, థాంప్సన్, పాయింటర్, డాక్‌రెల్, మెకార్తీ, ఛేజ్‌.  
 


 

>
మరిన్ని వార్తలు