సమష్టి వైఫల్యం.. 10 వికెట్ల పరాభవం

24 Feb, 2020 09:05 IST|Sakshi

వెల్లింగ్టన్‌ : అంతా ఊహించిందే జరిగింది! న్యూజిలాండ్‌తో జరిగిన తొలిటెస్టులో టీమిండియాకు ఘోర ఓటమి తప్పలేదు. సమష్టిగా విఫలమైన కోహ్లీసేన ప్రత్యర్థి ముందు మోకరిల్లింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లలో రాణించిన కివీస్‌ 10 వికెట్లతో తేడాతా ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌లో కివీస్‌ 1-0 ముందంజలోఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌట్‌ అయిన భారత్‌, రెండో ఇన్నింగ్స్‌లోనూ అంతా కలిసి ద్విశతకం కూడా చేయలేకపోయారు. మయాంక్‌ అగర్వాల్‌ ఒక్కడే 58 పరుగులతో రాణించాడు. దీంతో  టీమిండియా 191 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థికి నామమాత్ర 9 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్‌ ఓపెనర్లు టామ్‌ లాథమ్‌ 7, టామ్‌ బ్లండెల్‌ 2 పరుగులతో లాంఛనాన్ని పూర్తి చేశారు.

టీమిండియా ‘బౌల్ట్‌’..
టిమ్‌ సౌతీ, జేమీషన్‌ దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో కుదేలైన టీమిండియాను రెండో ఇన్నింగ్స్‌లో బౌల్ట్‌ కోలుకోలేని దెబ్బతీశాడు. కోహ్లి (19), పుజారా (11), పృథ్వీ షా (14), రహానే (29) వికెట్లను బౌల్ట్‌ ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన సౌతీ, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి భారత్‌కు ‘డ్రా’ కూడా దక్కకుండా చేశాడు.

అదే కథ పునరావృతం..
తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే కోహ్లీసేన చాపచుట్టేయగా.. కివీస్‌ 348 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. ఈ స్కోరులో కివీస్‌ టెయిలెండర్ల పరుగులే కీలకం. మూడోరోజు ఆట మొదలైన తొలి బంతికే న్యూజిలాండ్‌ వికెట్‌ కోల్పోయింది. వాట్లింగ్‌ (14)ను బుమ్రా అవుట్‌ చేశాడు. మరో 9 పరుగుల తర్వాత సౌతీ (6) వికెట్‌ను ఇషాంత్‌ శర్మ పడేశాడు. కివీస్‌ స్కోరు 225/7. ఇక భారత్‌ పేస్‌ అలజడి మొదలైందని అనుకున్నారంతా! టెయిలెండర్లను అవుట్‌ చేయడం ఎంతసేపు... 250, 260 స్కోరుతో కివీస్‌ కథ ముగుస్తుందనిపించింది. కానీ అసలు కథ అప్పుడే మొదలైంది. మరో వికెట్‌ తీసేందుకు సుదీర్ఘ పోరాటం తప్పలేదు. గ్రాండ్‌హోమ్‌ (74 బంతుల్లో 43; 5 ఫోర్లు)తో జతకలిసిన తొమ్మిదో వరుస బ్యాట్స్‌మన్‌ జేమీసన్‌ (45 బంతుల్లో 44; 1 ఫోర్, 4 సిక్స్‌లు) చకచకా పరుగులు బాదేశాడు.

వన్డేను తలపించేలా జేమీసన్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. షమీ బౌలింగ్‌లో 2, అశ్విన్‌ ఒకే ఓవర్లో మరో రెండు సిక్సర్లు దంచేశాడు. చూస్తుండగానే స్కోరు దూసుకెళ్లింది. ఎట్టకేలకు 300 స్కోరుకు ముందు జేమీసన్‌ను, 300 అయ్యాక గ్రాండ్‌హోమ్‌ను అశ్వినే పెవిలియన్‌ చేర్చాడు. 9 వికెట్లు పడ్డా కూడా ఆలౌట్‌ అయ్యేందుకు మరో 38 పరుగులు ఆగాల్సి వచ్చింది. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బౌల్ట్‌ (24 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్‌) బౌండరీలతో హోరెత్తించాడు. చివరకు ఇషాంత్‌ అతన్ని అవుట్‌ చేయడంతో కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 348 పరుగుల వద్ద ముగిసింది. ఇషాంత్‌కు 5, అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి.

మయాంక్‌ ఒక్కడే...
మూడోరోజు లంచ్‌ తర్వాత 183 పరుగుల లోటుతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ కష్టాలతో మొదలైంది. 8వ ఓవర్లో పృథ్వీ షా (14)ను బౌల్ట్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో మయాంక్‌ అగర్వాల్‌కు పుజారా జతయ్యాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ వికెట్లు కాపాడుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. కొంతవరకు ఇది ఫలించినా... రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించాక జిడ్డుగా ఆడుతున్న పుజారాను బౌల్టే క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 78 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోగా... ఓపెనర్‌కు కెప్టెన్‌ కోహ్లి అండగా నిలిచాడు. చక్కగా ఆడుతున్న మయాంక్‌ 75 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కానీ జట్టు స్కోరు వంద పరుగులకు ముందే అతని వికెట్‌ కూడా పడిపోవడం భారత్‌ కష్టాల్ని ఒక్కసారిగా పెంచింది. ఆఖరి సెషన్‌ మొదలైన కాసేపటికి సౌతీ బౌలింగ్‌లో మయాంక్‌ వెనుదిరిగాడు. 96 పరుగులకే భారత్‌ మూ డు కీలక వికెట్లను కోల్పోయింది. ఇది చాలదన్నట్లు బౌల్ట్‌... కోహ్లి (19; 3 ఫోర్లు) వికెట్‌ పడగొట్టి భారత్‌ను చావుదెబ్బ తీశాడు. మరో వికెట్‌ పడకుండా రహానే (29), విహారి (15) ఆచితూచి ఆడుతున్న క్రమంలో జట్టు స్కోరు 148 పరగుల వద్ద  ఇద్దరూ ఔట్ అయ్యారు. అటు తర్వాత తర్వాత అశ్విన్‌ (4), ఇషాంత్‌ శర్మ (12) వెనుదిరగ్గా,  వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ కాసేపు పోరాడాడు. 41 బంతుల్లో 25 పరుగులు  చేసి పెవిలియన్‌ చేరాడు. బుమ్రా పరుగులైమీ చేయకుండానే వికెట్‌ సమర్పించుకోవడంతో 191 పరుగుల వద్ద భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ముగిసింది.

మరిన్ని వార్తలు