సిరీస్‌  విజయమే లక్ష్యంగా!

28 Jan, 2019 01:19 IST|Sakshi

జోరు మీదున్న టీమిండియా

నేడు భారత్‌–కివీస్‌ మూడో వన్డే

తుది జట్టులోకి హార్దిక్‌ పాండ్యా

ఒత్తిడిలో ఆతిథ్య జట్టు 

ఆస్ట్రేలియాలో మొదలైన భారత జట్టు విజయ యాత్ర టాస్మన్‌ సముద్రం దాటి మరోవైపు న్యూజిలాండ్‌లో కూడా కొనసాగుతోంది. లోపాలే లేకుండా దూసుకుపోతున్న టీమిండియాకు సొంతగడ్డపై కూడా కనీసం పోటీనివ్వడంలో కివీస్‌ తడబడుతోంది. ఇదే జోరులో భారత్‌ చెలరేగితే మరో వన్డే సిరీస్‌ మన ఖాతాలో చేరుతుంది. వరల్డ్‌ కప్‌నకు ముందు విదేశీ గడ్డపై కూడా జట్టు కూర్పు ఎలా ఉండాలో మరింత స్పష్టత వస్తుంది.

వివాదాన్ని వెనక వదిలేసి జట్టుతో చేరిన హార్దిక్‌ పాండ్యా ఆడనుండటం మూడో మ్యాచ్‌లో కీలక మార్పు కాగా... విశ్రాంతి కోసం స్వదేశం వెళ్లే ముందు జట్టుకు కోహ్లి సిరీస్‌ అందిస్తాడా అనేది ఆసక్తికరం. స్వదేశంలో ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఒకే జట్టు చేతిలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన కివీస్‌ సిరీస్‌ కాపాడుకోవాల్సిన మ్యాచ్‌లో ఎలా స్పందిస్తుందో చూడాలి.   

మౌంట్‌మాంగనీ: వరుసగా రెండు విజయాలతో ఊపు మీదున్న భారత జట్టు మరో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. న్యూజిలాండ్‌తో నేడు జరిగే మూడో వన్డేను కూడా గెలుచుకుంటే 3–0తో సిరీస్‌ టీమిండియా సొంతమవుతుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో పటిష్టంగా కనిపిస్తున్న కోహ్లి సేనను నిలువరించడం న్యూజిలాండ్‌కు అంత సులువు కాదు. అనూహ్యంగా రెండు మ్యాచ్‌లు కోల్పోయిన కివీస్‌ సిరీస్‌ను చేజార్చుకోకుండా ఉండాలంటే ఎంతో పట్టుదల కనబర్చాల్సి ఉంది.  

విజయ్‌ శంకర్‌ ఔట్‌... 
భారత జట్టు ఫామ్‌ ప్రకారం చూస్తే తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అయితే వన్డే జట్టులో రెగ్యులర్‌ సభ్యుడైన హార్దిక్‌ పాండ్యా నిషేధం కారణంగా గత మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఇప్పుడు అతను తిరిగి రావడంతో ఆల్‌రౌండర్‌గా విజయ్‌ శంకర్‌ స్థానంలో చోటు ఖాయమైంది.ఎప్పటిలాగే మన టాప్‌–3 ఆట జట్టు విజయాలకు బాటలు వేస్తోంది. భారీ స్కోర్లు చేయకపోయినా కోహ్లి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. రాయుడు తొలి మ్యాచ్‌ వైఫల్యాన్ని రెండో వన్డేలో మరచిపోయేలా చేశాడు. ధోని, జాదవ్‌ కూడా తమ వంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు.

మిడిలార్డర్‌లో కూడా మరింత వేగంగా పరుగులు సాధించడంపైనే తాము దృష్టి పెట్టామని, అది మాత్రమే ప్రస్తుతానికి తమ దృష్టిలో కొంత సరిదిద్దుకోవాల్సిన అంశమని కోహ్లి ఇప్పటికే చెప్పాడు. కాబట్టి మిడిలార్డర్‌లో కూడా అందరూ పరుగులు సాధించడమే ఈ మ్యాచ్‌లో కీలకంగా మారనుంది. బౌలింగ్‌లో నలుగురు స్పెషలిస్ట్‌లు కూడా సత్తా చాటుతున్నాడు. భువీ, షమీ పేస్‌ ముందు కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేస్తుండగా... చహల్, కుల్దీప్‌ స్పిన్‌ దెబ్బకు లోయర్‌ ఆర్డర్‌ నిలబడలేకపోతోంది.

ఈ మ్యాచ్‌ తర్వాత కోహ్లి చివరి రెండు వన్డేలతో పాటు టి20 సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు.  న్యూజిలాండ్‌కు సొంత మైదానాల్లో ఇలాంటి స్థితి ఇటీవలి కాలంలో ఎప్పుడూ ఎదురు కాలేదు. స్వదేశంలో రికార్డులతో చెలరేగిపోయే గప్టిల్, మున్రో, టేలర్‌ రెండు మ్యాచ్‌లలో కూడా భారత బౌలింగ్‌ ముందు తడబడ్డారు.  కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కివీస్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వన్డే వరల్డ్‌ కప్‌ ఫేవరెట్‌లలో ఒకటిగా కనిపించింది. కానీ సిరీస్‌ ఓడితే జట్టు స్థయిర్యం దెబ్బ తినడం ఖాయం. విలియమ్సన్‌ తన బృందాన్ని ఎలా నడిపిస్తాడో చూడాలి.

పిచ్, వాతావరణం
రెండో వన్డే జరిగిన మైదానంలోనే ఈ మ్యాచ్‌ కూడా నిర్వహిస్తున్నారు. అయితే పిచ్‌ మారవచ్చు. సాధారణ బ్యాటింగ్‌ వికెట్టే అయినా స్పిన్‌కు కొంత అనుకూలం. మంచి వాతావరణం. ఆటకు ఇబ్బంది లేదు.  

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, రాయుడు, ధోని, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, షమీ, చహల్‌.  
న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, నికోల్స్, సాన్‌ట్నర్, బ్రేస్‌వెల్, సోధి, ఫెర్గూసన్, బౌల్ట్‌. 

మరిన్ని వార్తలు