భారత్‌తో తొలి వన్డే; న్యూజిలాండ్‌ ఫీల్డింగ్‌

5 Feb, 2020 07:21 IST|Sakshi

హామిల్టన్‌: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రోహిత్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో రోహిత్‌ శర్మ గాయపడిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రోహిత్‌ కాలిపిక్క కండరాలు పట్టేయడంతో ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. ఆపై రోహిత్‌ను బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉంచగా, అతనికి కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని ఫిజియో సూచించారు.

దాంతో మొత్తం న్యూజిలాండ్‌ పర్యటన నుంచి రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. ఆ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. న్యూజిలాండ్‌‘ఎ’తో సిరీస్‌లో భాగంగా అక్కడే ఉన్న మయాంక్‌కు సీనియర్‌ జట్టులో అవకాశం కల్పించారు. ఈ స్థానం కోసం శుబ్‌మన్‌ గిల్‌ పోటీపడినప్పటికీ మయాంక్‌కే మేనేజ్‌మెంట్‌ మొగ్గుచూపింది. ఓపెనర్లుగా పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరికీ ఇది అరంగేట్రపు వన్డే. ‘పొట్టి ఫార్మాట్‌’లో అద్భుత ప్రదర్శన తర్వాత కోహ్లి సేన ఆత్మవిశ్వాసం అంబరాన్ని చుంబిస్తుండగా, అటు న్యూజిలాండ్‌ టి20 గాయాలను మరచి కొత్తగా ఆటను మొదలు పెట్టాలని భావిస్తోంది. భారత్‌ సొంతగడ్డపై ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విజయం సాధించగా... న్యూజిలాండ్‌కు ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ‘బౌండరీ పరాజయం’ తర్వాత ఇదే తొలి వన్డే కావడం విశేషం.

>
మరిన్ని వార్తలు