సిరీస్‌ కాపాడుకునేందుకు... 

8 Feb, 2020 01:59 IST|Sakshi

ఒత్తిడిలో భారత బృందం

నేడు న్యూజిలాండ్‌తో రెండో వన్డే

ఆత్మవిశ్వాసంతో కివీస్‌

ఉదయం గం.7.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

తొలి వన్డేలో 347 పరుగులు...ఇంత భారీ స్కోరు చేసిన తర్వాత కూడా భారత జట్టు మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. టీమిండియా బౌలింగ్, ఫీల్డింగ్‌ వైఫల్యాలు ఇక్కడ స్పష్టంగా కనిపించాయి. టి20 సిరీస్‌లో ఘన విజయం తర్వాత జట్టు ఉదాసీనత ప్రదర్శించినట్లు గత మ్యాచ్‌లో అనిపించింది. ఇప్పుడు ఆ పరాజయాన్ని మరచి కొత్త వ్యూహంతో బరిలోకి దిగాల్సిన సమయం వచ్చింది. సిరీస్‌ కాపాడుకునేందుకు కచ్చితంగా నెగ్గాల్సిన స్థితిలో భారత్‌ ఉండగా... విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో కివీస్‌ మరో పోరుకు ఉత్సాహంగా సిద్ధమైంది. కనీసం వన్డే సిరీస్‌నైనా సొంతం చేసుకొని పరువు కాపాడుకోవాలని ఆ జట్టు పట్టుదలగా ఉంది.

ఆక్లాండ్‌: గత ఏడాది న్యూజిలాండ్‌ పర్యటనలో టి20 సిరీస్‌ను కోల్పోయిన భారత్‌ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. ఈ పర్యటనలో టి20 సిరీస్‌ మన ఖాతాలోకి వచ్చేసింది. అయితే మళ్లీ ‘లెక్క సమం’ కాకుండా ఉండాలంటే కోహ్లి బృందం తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్‌ జట్లు నేడు జరిగే రెండో వన్డేలో తలపడబోతున్నాయి. ఇరు జట్లు కనీసం ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.

జాదవ్‌ స్థానంలో పాండే! 
నాలుగో స్థానంలో పూర్తిగా స్థిరపడిపోయిన శ్రేయస్‌ అయ్యర్, కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్, ఎప్పటిలాగే కోహ్లి నిలకడ వెరసి గత మ్యాచ్‌లో భారత్‌ భారీ స్కోరుకు కారణమయ్యాయి. బ్యాటింగ్‌పరంగా భారత్‌ ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. తొలిసారి ఓపెనింగ్‌ చేశారు కాబట్టి రోహిత్‌–ధావన్‌ స్థాయిలో ఆరంభాన్ని పృథ్వీ–మయాంక్‌ల నుంచి ఆశించడం కూడా సరైంది కాదు. అయితే తమ సత్తా చాటేందుకు వీరికి ఈ మ్యాచ్‌ మరో అవకాశం ఇస్తోంది. ఓపెనింగ్‌ జోడి శుభారంభం అందిస్తే దానిపై జట్టు దూసుకుపోవచ్చు. ఆరో స్థానంలో కేదార్‌ జాదవ్‌ బాగానే ఆడినా అతని బ్యాటింగ్‌పై మళ్లీ సందేహాలు వస్తున్నాయి. జాదవ్‌కంటే ఏ రకంగా చూసినా మనీశ్‌ పాండే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. పైగా అద్భుతమైన ఫీల్డర్‌ కూడా.

అదనపు బౌలర్‌గా జాదవ్‌ పనికొస్తాడంటూ తుది జట్టులో తీసుకుంటున్నా గత మ్యాచ్‌లో అతను ఒక్క ఓవర్‌ కూడా వేయలేదు. కాబట్టి మార్పు తప్పకపోవచ్చు. తొలి వన్డేలో భారీగా పరుగులు ఇచ్చిన శార్దుల్, కుల్దీప్‌ల స్థానాల్లో సైనీ, చహల్‌లకు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. గత మ్యాచ్‌లో కీలక సమయంలో అనూహ్యంగా బుమ్రా కూడా ప్రభావం చూపలేకపోవడం కోహ్లిని కలవర పెట్టింది. అతను మళ్లీ తన స్థాయిలో బౌలింగ్‌ చేయాలని జట్టు కోరుకుంటోంది. అన్నింటికంటే ముఖ్యంగా భారత ఫీల్డింగ్‌ మెరుగుపడటం ఎంతో ముఖ్యం. ప్రత్యర్థి జట్టుతో పోలిస్తే మన ప్రదర్శన ఈ విషయంలో ఎంతో తీసికట్టుగా కనిపిస్తోంది.

6.8 అడుగుల అరంగేట్రం! 
గత మ్యాచ్‌లో వీరోచిత ప్రదర్శనతో ఆధిక్యం సంపాదించిన న్యూజిలాండ్‌కు అదే జోరులో సిరీస్‌ గెలుచుకునేందుకు ఇది మంచి అవకాశం. జట్టు బ్యాటింగ్‌ బలమేంటో తొలి వన్డే చూపించింది. అనుభవజ్ఞుడైన రాస్‌ టేలర్‌ అసలు సమయంలో చెలరేగగా, తాత్కాలిక కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ భారత్‌పై తన అద్భుత రికార్డును మరింత మెరుగపర్చుకున్నాడు. ఓపెనర్‌ నికోల్స్‌ ప్రదర్శన కూడా బాగుంది. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన అతి కొద్ది మందిలో ఒకడైన మరో ఓపెనర్‌ గప్టిల్‌ కూడా రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు.

తొలి మ్యాచ్‌లో విఫలమైనా... మూడో స్థానంలో బ్లన్‌డెల్‌కు మరో అవకాశం ఖాయం. కివీస్‌ను ఇబ్బంది పడుతున్న అంశం కీలకమైన ఆల్‌రౌండర్ల వైఫల్యం. వన్డే సిరీస్‌కే అందుబాటులోకి వచ్చిన నీషమ్‌ పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు టి20ల్లో ఘోరంగా విఫలమైన గ్రాండ్‌హోమ్‌ తొలి వన్డేలోనూ తన వైఫల్యాన్ని కొనసాగించాడు. వీరిద్దరు స్వదేశంలో తమ స్థాయికి తగినట్లుగా ఆడితే భారత్‌కు సమస్యలే. బౌలింగ్‌ ఎప్పటిలాగే బలహీనంగానే ఉండటంతో తమ బ్యాటింగ్‌నే కివీస్‌ నమ్మకుంటోంది. ఇష్‌ సోధిని తప్పించి అతని స్థానంలో 6 అడుగుల 8 అంగుళాల పొడగరి కైల్‌ జేమీసన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టడం ఖాయమైంది. సౌతీ ఘోరంగా విఫలమవుతున్నా... సీనియర్‌గా అతనిలాంటి మరో ప్రత్యామ్నాయం కివీస్‌కు అందుబాటులో లేదు.

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), పృథ్వీ షా, మయాంక్, అయ్యర్, రాహుల్, పాండే, జడేజా, షమీ, బుమ్రా, సైనీ, చహల్‌.
న్యూజిలాండ్‌: లాథమ్‌ (కెప్టెన్‌), గప్టిల్, నికోల్స్, బ్లన్‌డెన్, టేలర్, గ్రాండ్‌హోమ్, నీషమ్, సాన్‌ట్నర్, జేమీసన్, సౌతీ, బెన్నెట్‌.

పిచ్, వాతావరణం 
ఇలా బ్యాట్‌కు బంతి తగలడమే ఆలస్యం అలా బౌండరీ దాటడం ఈడెన్‌ పార్క్‌లో సహజం. ప్రపంచంలో అతి చిన్న మైదానాల్లో ఇదొకటి. పరుగుల వరదతో భారీ స్కోర్లు ఖాయం. ఈ పర్యటనలో తొలి రెండు టి20లు ఇక్కడే జరిగాయి. ఛేదన సులువు కాబట్టి టాస్‌ కీలకం కానుంది. మ్యాచ్‌ రోజు వర్షం ముప్పు లేదు.

మరిన్ని వార్తలు