ఆలౌట్‌ చేసి... ఆలౌట్‌ దారిలో... 

2 Mar, 2020 01:30 IST|Sakshi

రెండో రోజు వికెట్ల జాతర

మొత్తం 16 వికెట్లు కూలిన వైనం

కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌కు 235 వద్ద తెర

భారత్‌కు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం

రెండో ఇన్నింగ్స్‌లో 90/6

బౌలర్లు కష్టపడి ప్రత్యర్థిని తమకంటే తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేస్తే... మన బ్యాట్స్‌మెన్‌ మళ్లీ కష్టాలపాలు చేశారు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ టెయిలెండర్‌ జేమీసన్‌ చక్కగా 49 పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మన స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ పృథ్వీ షా (14), మయాంక్‌ అగర్వాల్‌ (3), కోహ్లి (14), రహానే (9)లు అంతా కలిసి 40 పరుగులు చేయడం టీమిండియా ‘పటిష్టమైన బ్యాటింగ్‌’ లైనప్‌ ముద్రకు పెను సవాల్‌ విసురుతోంది. క్రీజులో ఉన్న విహారి, రిషభ్‌ పంత్‌ మూడో రోజు భారీ ఇన్నింగ్స్‌ ఆడితే తప్పించి రెండో టెస్టులోనూ భారత్‌కు భంగపాటు తప్పేలా లేదు.

క్రైస్ట్‌చర్చ్‌: భారత బౌలర్లు న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ జోరుకు కళ్లెం వేశారు. అయితే తొలి టెస్టులాగే టెయిలెండర్లను ఆపలేకపోయినా... మొత్తం మీద చెమటోడ్చి తమ తొలి ఇన్నింగ్స్‌ కంటే తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని ఆలౌట్‌ చేశారు. కానీ బ్యాట్స్‌మెన్‌ మళ్లీ బాధ్యత మరిచారు. సమం చేసేందుకు పురోగమించే చోట సమర్పించుకునేందుకే తిరోగమించారు. 36వ ఓవర్‌ పూర్తవకముందే 6 కీలక వికెట్లను అప్పగించేశారు. రెండో టెస్టులో బౌలర్ల శ్రమతో పట్టు చిక్కినట్లే చిక్కి పేలవ బ్యాటింగ్‌తో భారత్‌ కష్టాల్లో పడింది.

స్థూలంగా చెప్పాలంటే రెండో రోజు ఆటను ఇరు జట్ల బౌలర్లు శాసించారు. ఏకంగా 16 వికెట్లను పడేశారు. దీంతో ఈ టెస్టు నేడే ముగిసినా ఆశ్చర్యం లేదు. ఆదివారం మొదట 63/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 73.1 ఓవర్లలో 235 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్‌ లాథమ్‌ (52; 5 ఫోర్లు) అర్ధ శతకం సాధించాడు. భారత బౌలర్లలో షమీ 4, బుమ్రా 3 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ఆడిన భారత్‌ ఆట నిలిచే సమయానికి 36 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. అవుటైన ఆరుగురితో పాటు క్రీజ్‌లో ఉన్న ఇద్దరు... మొత్తం 8 మందిలో ఏ ఒక్కరు చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. బౌల్ట్‌ (3/12) భారత ఇన్నింగ్స్‌ను దెబ్బ తీశాడు.

రాణించిన లాథమ్‌... 
ఆటమొదలైన కాసేపటికే న్యూజిలాండ్‌ రెండు కీలక వికెట్లను కోల్పోయింది. బ్లన్‌డెల్‌ (30; 4 ఫోర్లు)ను ఉమేశ్‌... కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను (3)ను బుమ్రా అవుట్‌ చేశాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటాక... షమీ విజృంభించాడు. దీంతో స్వల్ప వ్యవధిలో రాస్‌ టేలర్‌ (15; 1 ఫోర్‌), ఫిఫ్టీ పూర్తి చేసుకున్న లాథమ్, నికోల్స్‌ (14; 1 ఫోర్‌) పెవిలియన్‌ చేరారు. టేలర్‌ను జడేజా బోల్తా కొట్టించగా... లాథమ్, నికోల్స్‌లను షమీ అవుట్‌ చేశాడు. లంచ్‌ విరామానికి కివీస్‌ స్కోర్‌ 142/5. రెండో సెషన్‌లో కివీస్‌ పతనం కొనసాగింది. బుమ్రా ఒకే ఓవర్లో వాట్లింగ్‌ (0), సౌతీ (0)లను డకౌట్‌గా పంపాడు.

ఈ దశలో గ్రాండ్‌హోమ్‌ (26; 4 ఫోర్లు), టెయిలెండర్‌ జేమీసన్‌ (49; 7 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే పనిలో పడినప్పటికీ ఈ జోడీ ఎంతోసేపు నిలువలేదు. జడేజా... గ్రాండ్‌హోమ్‌ను బౌల్డ్‌ చేశాడు. 177 పరుగులకే 8 వికెట్లను కోల్పోయినా కూడా కివీస్‌ కథ అప్పుడే ముగిసిపోలేదు. జేమీసన్, వాగ్నర్‌ (21; 3 ఫోర్లు)తో కలిసి 9వ వికెట్‌కు 51 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో భారత్‌ భారీ ఆధిక్యానికి గండిపడింది. ఎట్టకేలకు షమీ తన వరుస ఓవర్లలో వాగ్నర్, జేమీసన్‌లను అవుట్‌ చేయడంతో 235 పరుగుల వద్ద కివీస్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

కష్టాలతో రెండో ఇన్నింగ్స్‌... 
తమకన్నా తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని కట్టడి చేశామన్న భారత్‌ ఆనందం ఆవిరయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. తీరు మారని బ్యాటింగ్‌తో రెండో ఇన్నింగ్స్‌ కష్టాలతోనే మొదలైంది. రెండో ఓవర్లోనే బౌల్ట్‌ బౌలింగ్‌లో మయాంక్‌ (3) వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్‌ పృథ్వీ షా (14) కాసేపే ఆడగలిగాడు. ఇతన్ని సౌతీ అవుట్‌ చేయగా... కెప్టెన్‌ కోహ్లి (14; 3 ఫోర్లు), పుజారా (24; 2 ఫోర్లు) జట్టు స్కోరును కష్టమ్మీద 50 పరుగులు దాటించారు. దీనికి మరో పరుగు జతయ్యాక విరాట్‌ కోహ్లి ఎల్బీగా పెవిలియన్‌ బాట పట్టాడు. తర్వాత రహానే (9) వచ్చినా... ఉమేశ్‌ (1)ను నైట్‌వాచ్‌మన్‌గా పంపించినా ఫలితం లేకపోయింది. కుదురుకుంటాడనుకున్న పుజారా కూడా బౌల్ట్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డవ్వడం భారత్‌ కష్టాల్ని మరింత పెంచింది. ఆట నిలిచే సమయానికి హనుమ విహారి (5 బ్యాటింగ్‌), రిషభ్‌ పంత్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ ఓవరాల్‌ ఆధిక్యం 97 పరుగులకు చేరింది. సౌతీ, వాగ్నర్, గ్రాండ్‌హోమ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 242; న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బి) షమీ 52; బ్లన్‌డెల్‌ ఎల్బీడబ్ల్యూ (బి) ఉమేశ్‌ 30; విలియమ్సన్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 3; రాస్‌ టేలర్‌ (సి) ఉమేశ్‌ (బి) జడేజా 15; నికోల్స్‌ (సి) కోహ్లి (బి) షమీ 14; వాట్లింగ్‌ (సి) జడేజా (బి) బుమ్రా 0; గ్రాండ్‌హోమ్‌ (బి) జడేజా 26; సౌతీ (సి) పంత్‌ (బి) బుమ్రా 0; జేమీసన్‌ (సి) పంత్‌ (బి) షమీ 49; వాగ్నర్‌ (సి) జడేజా (బి) షమీ 21; బౌల్ట్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (73.1 ఓవర్లలో ఆలౌట్‌) 235 
వికెట్ల పతనం: 1–66, 2–69, 3–109, 4–130, 5–133, 6–153, 7–153, 8–177, 9–228, 10–235.
బౌలింగ్‌: బుమ్రా 22–5–62–3, ఉమేశ్‌ యాదవ్‌ 18–2–46–1, షమీ 23.1–3–81–4, జడేజా 10–2–22–2.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) సౌతీ 14; మయాంక్‌ ఎల్బీడబ్ల్యూ (బి) బౌల్ట్‌ 3; పుజారా (బి) బౌల్ట్‌ 24; కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) గ్రాండ్‌హోమ్‌ 14; రహానే (బి) వాగ్నర్‌ 9; ఉమేశ్‌ (బి) బౌల్ట్‌ 1; విహారి (బ్యాటింగ్‌) 5, పంత్‌ (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (36 ఓవర్లలో 6 వికెట్లకు) 90.
వికెట్ల పతనం: 1–8, 2–26, 3–51, 4–72, 5–84, 6–89.
బౌలింగ్‌: సౌతీ 6–2–20–1, బౌల్ట్‌ 9–3–12–3, జేమీసన్‌ 8–4–18–0, గ్రాండ్‌హోమ్‌ 5–3–3–1, వాగ్నర్‌ 8–1–18–1.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా