సశేషం!

10 Jul, 2019 03:30 IST|Sakshi
విలియమ్సన్‌ వికెట్‌ తీసిన చహల్‌కు రోహిత్, కోహ్లి అభినందన

భారత్, న్యూజిలాండ్‌ సెమీఫైనల్‌ నేడు కొనసాగింపు

మ్యాచ్‌కు వర్షం కారణంగా అంతరాయం

46.1 ఓవర్లలో కివీస్‌ 211/5

ఇదే స్కోరు నుంచి మ్యాచ్‌ ముందుకు

రాణించిన భారత బౌలర్లు

రాస్‌ టేలర్, విలియమ్సన్‌ అర్ధసెంచరీలు

నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డు పడ్డాడు. భారత్, న్యూజిలాండ్‌ మధ్య పోరులో ఒక ఇన్నింగ్సూ పూర్తిగా ముగియకుండానే వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. అయితే వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ నిబంధనల ప్రకారం ‘రిజర్వ్‌ డే’ అయిన నేడు  మ్యాచ్‌ కొనసాగుతుంది. 46.1 ఓవర్ల వద్ద కివీస్‌ ఇన్నింగ్స్‌ నిలిచిపోగా... ఇప్పుడు అక్కడి నుంచే బుధవారం ఆట జరుగుతుంది. భారత బౌలర్లు చెలరేగడంతో స్వల్ప స్కోరు మాత్రమే చేయగలిగిన కివీస్‌ మిగిలిన 3.5 ఓవర్లలో మరికొన్ని పరుగులు జోడించే అవకాశం ఉంది.

రెండో రోజు వాన దెబ్బ లేకుండా సెమీస్‌ సజావుగా సాగితే భారీ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన టీమిండియాకు లక్ష్యాన్ని ఛేదించడంలో ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ నేడు కూడా మ్యాచ్‌ మధ్యలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగితే డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం భారత లక్ష్యాన్ని సవరిస్తారు. భారత ఇన్నింగ్స్‌లో కనీసం 20 ఓవర్లు కూడా సాధ్యంకాకపోతే మ్యాచ్‌ రద్దయినట్లు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం లీగ్‌ దశలో టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.   

మాంచెస్టర్‌: ప్రపంచ కప్‌ తొలి సెమీస్‌ మ్యాచ్‌ రెండో రోజుకు చేరింది. సుదీర్ఘ సమయం పాటు కురిసిన వర్షం కారణంగా మంగళవారం ఆట అర్ధాంతరంగా నిలిచిపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రాస్‌ టేలర్‌ (85 బంతుల్లో 67 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), విలియమ్సన్‌ (95 బంతుల్లో 67; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఐదుగురు భారత బౌలర్లు తలా ఒక వికెట్‌ తీశారు. ప్రస్తుతం టేలర్‌తో పాటు లాథమ్‌ (3 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు.  

ఎదురుచూపులు...
కివీస్‌ ఇన్నింగ్స్‌లో భువనేశ్వర్‌ వేసిన 47వ ఓవర్‌ తొలి బంతికి టేలర్‌ రెండు పరుగులు తీశాడు. ఈ దశలో వర్షం వచ్చింది. కొన్ని చినుకుల వరకు అంపైర్లు ఆగినా... చహల్‌ మైదానంలో జారడం, వాన పెరిగితే పిచ్‌ పాడయ్యే ప్రమాదం ఉండటంతో వెంటనే ఆటను నిలిపివేశారు. భారత కాలమానం ప్రకారం సా. 6.30 గంటలకు ఆట ఆగిపోయింది. ఆ తర్వాతి నుంచి వర్షం పెరగడం, మధ్యలో కొంత తెరిపినిచ్చినా పూర్తిగా తగ్గకపోవడంతో గంటలు గడిచిపోయాయి. దాదాపు రెండున్నర గంటల తర్వాత వాన ఆగడంతో అంపైర్లు పరిస్థితిని సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ వెంటనే మళ్లీ వర్షం వచ్చింది. కివీస్‌ ఇన్నింగ్స్‌ను అంతటితో ఆపివేసి భారత్‌ కనీసం 20 ఓవర్లు ఆడే అవకాశం ఇవ్వాలన్నా రాత్రి గం.11.05కు ఆట ఆరంభం కావాల్సింది. కానీ అలాంటి పరిస్థితి కనిపించలేదు. చివరకు రాత్రి గం.10.52కు మంగళవారం ఆటను యథాతథ స్థితిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.  

బౌలర్లు భళా...
న్యూజిలాండ్‌ను ప్రపంచ కప్‌ ఆసాంతం వేధించిన ఓపెనింగ్‌ సమస్య సెమీస్‌లోనూ కొనసాగింది. భువీ, బుమ్రా వేసిన తొలి రెండు ఓవర్లు మెయిడిన్లుగా ముగియగా, తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఆడిన గప్టిల్‌ (1)ను చక్కటి బంతితో బుమ్రా పెవిలియన్‌ పంపించాడు. స్లిప్‌లో కోహ్లి అద్భుత రీతిలో ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఎనిమిదో ఓవర్‌ చివరి బంతికి గానీ తొలి ఫోర్‌ కొట్టలేకపోయిన కివీస్‌... తొలి 10 ఓవర్లలో 27 పరుగులే చేయగలిగింది. ఈ దశలో నికోల్స్‌ (51 బంతుల్లో 28; 2 ఫోర్లు), విలియమ్సన్‌ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.

రెండో వికెట్‌కు వీరిద్దరు 68 పరుగులు జత చేశారు. అయితే భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కివీస్‌ స్కోరు బాగా నెమ్మదిగా సాగింది. ఈ జోడి కుదురుకుంటున్న దశలో జడేజా టర్నింగ్‌ బంతితో నికోల్స్‌ స్టంప్స్‌ను పడగొట్టాడు. దాంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత కెప్టెన్‌తో పాటు మరో సీనియర్‌ టేలర్‌పై పడింది. అయితే ఈ జంట కూడా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక మరీ నెమ్మదిగా ఆడింది. ఒక దశలో 80 బంతుల పాటు న్యూజిలాండ్‌ ఫోర్‌ కూడా కొట్టలేకపోయింది!  ఎట్టకేలకు చహల్‌ ఓవర్లో రెండు ఫోర్లు సాధించిన కివీస్‌ తడబాటును అధిగమించే ప్రయత్నం చేసింది.

ఈ క్రమంలో విలియమ్సన్‌ 79 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 65 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి విలియమ్సన్, టేలర్‌ ఏకంగా 102 బంతులు తీసుకున్నారు. చివరకు చహల్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌కు విలియమ్సన్‌ ఔటయ్యాడు. వెంటనే నీషమ్‌ (12), గ్రాండ్‌హోమ్‌ (16) పెవిలియన్‌ చేరారు. మరో వైపు చహల్‌ బౌలింగ్‌లో సిక్సర్‌తో టేలర్‌ 73 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. చివర్లో భారత బౌలర్లు కట్టు తప్పడంతోపాటు నాసిరకమైన ఫీల్డింగ్‌తో 5 ఓవర్లలో కివీస్‌ 47 పరుగులు చేయగలిగింది. వారి ఇన్నింగ్స్‌లో 153 డాట్‌ బాల్స్‌ ఉండటం ఆ జట్టు బ్యాటింగ్‌ వైఫల్యానికి నిదర్శనం.

మ్యాచ్‌ రద్దయితే... మనమే ఫైనల్‌కు
వాతావరణ శాఖ అంచనా ప్రకారం మాంచెస్టర్‌లో బుధవారం కూడా పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు. ఒక వేళ మ్యాచ్‌ సమయంలో మళ్లీ వర్షం పడితే కివీస్‌ ఇన్నింగ్స్‌ను అక్కడితోనే ముగించి డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యమైనా డక్‌వర్త్‌ లూయిస్‌ వర్తిస్తుంది. అదీ జరగకుండా పూర్తిగా రద్దయితే మాత్రం లీగ్‌ దశలో టాప్‌ ర్యాంలో నిలిచిన భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది. నిజానికి మంగళవారం మళ్లీ వర్షం రావడమే భారత్‌కు మంచిదైంది. మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదిస్తే టీమిండియా విజయానికి 148 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది. టి20 స్టార్లు టీమ్‌లో ఉన్నా...వర్షం ఆగిన తర్వాత పిచ్‌లో వచ్చే మార్పు, మబ్బు పట్టిన వాతావరణంలో కివీస్‌ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగిపోయే ప్రమాదం ఉండేది. అదే జరిగితే భారత్‌కు ఛేదన కష్టంగా మారిపోయేదేమో!

తొలి బంతికే రివ్యూ పోయింది!
భువనేశ్వర్‌ వేసిన మ్యాచ్‌ తొలి బంతి గప్టిల్‌ ప్యాడ్లను తాకడంతో భారత ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం గట్టిగా అప్పీల్‌ చేశారు. అయితే అంపైర్‌ కెటిల్‌బరో తిరస్కరించడంతో కోహ్లి రివ్యూ కోరాడు. రీప్లేలో బంతి లెగ్‌స్టంప్‌కు దూరంగా వెళుతున్నట్లు తేలింది. దాంతో గప్టిల్‌ బతికిపోగా... మొదటి బంతికే రివ్యూ కోల్పోయిన భారత్‌ తీవ్రంగా నిరాశ చెందింది.

స్కోరు వివరాలు  
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 1; నికోల్స్‌ (బి) రవీంద్ర జడేజా 28; విలియమ్సన్‌ (సి) జడేజా (బి) చహల్‌ 67; టేలర్‌ (బ్యాటింగ్‌) 67; నీషమ్‌ (సి) కార్తీక్‌ (బి) పాండ్యా 12; గ్రాండ్‌హోమ్‌ (సి) ధోని (బి) భువనేశ్వర్‌ 16; లాథమ్‌ (బ్యాటింగ్‌) 3; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (46.1 ఓవర్లలో 5 వికెట్లకు) 211.  

వికెట్ల పతనం: 1–1, 2–69, 3–134, 4–162, 5–200.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 8.1–1–30–1; బుమ్రా 8–1–25–1; పాండ్యా 10–0–55–1, రవీంద్ర జడేజా 10–0–34–1, చహల్‌ 10–0–63–1. 


87 ఏళ్ల భారత అభిమాని చారులత ఉత్సాహం

మరిన్ని వార్తలు