భారత్‌కు బలపరీక్ష

13 Jun, 2019 05:15 IST|Sakshi

నేడు న్యూజిలాండ్‌తో పోరు

ధావన్‌ లేకుండా బరిలోకి

ఓపెనర్‌గా రాహుల్‌

మ్యాచ్‌కు వర్ష సూచన

నాలుగో విజయంపై కివీస్‌ దృష్టి

మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

ప్రపంచ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో అగ్రశ్రేణి టీమ్‌లను ఓడించిన భారత్‌ ఇప్పుడు మరో ప్రధాన జట్టును ఓడించడంపై గురి పెట్టింది. టోర్నీలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ను టీమిండియా ఎదుర్కోనుంది. బలాబలాలపరంగా చూస్తే ఇటీవలే కివీస్‌ను వారి సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో చిత్తుగా ఓడించిన కోహ్లి సేనదే పైచేయిగా కనిపిస్తున్నా... ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్‌ ఎప్పుడైనా ప్రమాదకర జట్టే. అయితే అన్నింటికి మించి ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ లేని జట్టు తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త వ్యూహంతో బరిలోకి దిగాల్సి వస్తోంది. ఇన్నేళ్లుగా జట్టు విజయాల్లో కీలకంగా నిలిచిన ధావన్‌ లేకుండా బలపరీక్షకు సిద్ధమైన కోహ్లి సేన అదే తరహా జోరు ప్రదర్శించగలదా? కూర్పులో మార్పు వల్ల జట్టు లయ దెబ్బతింటుందా? చూడాలి!

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత సన్నాహాల్లో భాగంగా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ చిత్తుగా ఓడింది. ఇరవై రోజుల క్రితం ఆ మ్యాచ్‌ ఫలితం మనపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆ తర్వాత అసలు పోరులో మన టీమ్‌ సత్తా చూపింది. ఇక ఇప్పుడు అసలు సమరంలో గెలిస్తే భారత్‌కు టోర్నీ లో తిరుగుండదు. మరోవైపు రెండు మ్యాచ్‌లలో బలహీన శ్రీలంక, అఫ్గానిస్తాన్‌లపై నెగ్గిన కివీస్‌... అతి కష్టమ్మీద బంగ్లాను ఓడించింది. ఈ నేపథ్యంలో భారత్‌లాంటి టీమ్‌తో ఆ జట్టుకు పెను సవాల్‌ ఎదురవుతోంది.  

నాలుగో స్థానంలో ఎవరు?  
ముందుగా దక్షిణాఫ్రికాపై, ఆ తర్వాత ఆస్ట్రేలియాపై కూడా భారత్‌ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. అన్ని విభాగాల్లో ఆటగాళ్లు ఒకరితో మరొకరు పోటీ పడి చక్కటి ప్రదర్శన కనబర్చారు. రోహిత్, ధావన్‌లు సెంచరీలు చేయగా, కోహ్లి గత మ్యాచ్‌లో తన స్థాయికి తగినట్లుగా ఆడాడు. హార్దిక్‌ పాండ్యా మెరుపు బ్యాటింగ్‌ అదనపు బలం కాగా, ధోని కూడా చక్కటి స్ట్రోక్స్‌ ఆడుతున్నాడు. కేదార్‌ జాదవ్‌కు ఇంకా బ్యాటింగ్‌ అవకాశం సరిగా రాలేదు. బౌలింగ్‌లో కూడా నలుగురు రెగ్యులర్‌ బౌలర్లు తమ పాత్రను సమర్థంగా పోషించగా... పాండ్యా, జాదవ్‌ కలిసి ఐదో బౌలర్‌ కోటాను ఇబ్బంది లేకుండా పూర్తి చేయగలిగారు. మొత్తంగా జట్టులో లోపాలేవీ కనిపించడం లేదు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ధావన్‌కు బదులుగా వచ్చే ఆటగాడిపైనే ఉంది.

లోకేశ్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేయడం ఖాయమైపోయింది. ఓపెనర్‌ పాత్ర అతనికి కొత్త కాదు. నిజానికి ప్రపంచకప్‌కు ఎంపిక చేసినప్పుడు కూడా సెలక్టర్లు మూడో ఓపెనర్‌గానే చూశారు. కెరీర్‌లో అతని ఏకైక సెంచరీ ఓపెనర్‌గానే సాధించాడు. ఇప్పుడు కీలకమైన ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో అతను రోహిత్‌తో కలిసి ఎలాంటి ఆరంభం ఇస్తాడనేది చూడాలి. మరోవైపు రాహుల్‌కు బదులుగా మిడిలార్డర్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందో చెప్పలేని పరిస్థితి. బుధవారం నెట్స్‌లో విజయ్‌ శంకర్‌ ఎక్కువసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. కానీ దినేశ్‌ కార్తీక్‌ అవకాశాలను కూడా కొట్టి పారేయలేం. వార్మప్‌ మ్యాచ్‌ తరహా వాతావరణమే ఎదురయ్యే అవకాశం ఉండటంతో బౌల్ట్‌ను భారత బ్యాట్స్‌మెన్‌ సమర్థంగా ఎదుర్కోవడం ముఖ్యం.  

మిడిలార్డర్‌ కీలకం...
న్యూజిలాండ్‌ కూడా మూడు విజయాలతో అమితోత్సాహంతో ఉంది. అయితే ఆ జట్టుకు కూడా సొంత సమస్యలు ఉన్నాయి. కివీస్‌కు ఓపెనింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. గత కొన్నేళ్లలో ఏ జోడి కూడా భారీ భాగస్వామ్యాలు నమోదు చేయలేదు. గప్టిల్‌ గత రెండు మ్యాచ్‌లలోనూ విఫలమయ్యాడు. భారత్‌తో సిరీస్‌లో విఫలమైన మున్రోను పక్కన పెట్టి నికోల్స్‌ను మరో ఓపెనర్‌గా పంపే అవకాశం ఉంది. టీమ్‌ బరువు బాధ్యతలన్నీ ఇప్పుడు విలియమ్సన్, రాస్‌ టేలర్‌లపైనే ఆధారపడి ఉన్నాయి. మరోసారి వీరిద్దరు రాణిస్తే కివీస్‌కు గెలుపు అవకాశాలు ఉంటాయి. లాథమ్, నీషమ్‌ కూడా రాణించడం అవసరం. బౌలింగ్‌లో ప్రధాన బలం ట్రెంట్‌ బౌల్ట్‌. అతను చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు. 145 కిలోమీటర్లకు తగ్గకుండా బౌలింగ్‌ చేస్తున్న ఫెర్గూసన్‌ కూడా ప్రత్యర్థికి ఇబ్బందులు సృష్టించగలడు.  

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, రాహుల్, దినేశ్‌ కార్తీక్‌/విజయ్‌ శంకర్, పాండ్యా, ధోని, జాదవ్, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. 

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, నికోల్స్, టేలర్, లాథమ్, నీషమ్, సాన్‌ట్నర్, గ్రాండ్‌హోమ్, సౌతీ, ఫెర్గూసన్, బౌల్ట్‌.

పిచ్, వాతావరణం
గత కొన్నేళ్లుగా పరుగుల వరద పారిన మైదానం. ఈ వరల్డ్‌ కప్‌లో కూడా రెండు మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బౌండరీలు చిన్నవి కాబట్టి బ్యాట్స్‌మెన్‌ చెలరేగిపోవచ్చు. అయితే మేఘావృత వాతావరణం కారణంగా స్వింగ్‌ బౌలర్లకూ మంచి అవకాశ ముంది. దాంతో బ్యాట్‌కు, బంతికి మధ్య సమాన పోరు జరిగేందుకు ఆస్కారముంది. గురువారం నాటింగ్‌హామ్‌లో వర్ష సూచన ఉంది. ఆటకు అంతరాయం కలగవచ్చు.

57:  కోహ్లి మరో 57 పరుగులు చేస్తే అందరికంటే వేగంగా (222 ఇన్నింగ్స్‌లలో) వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. సచిన్‌ 276 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయి దాటాడు.

మరిన్ని వార్తలు