ఆదిలోనే టీమిండియాకు షాక్‌

8 Feb, 2020 12:26 IST|Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఐదు ఓవర్లకే ఓపెనర్లు పృథ్వీ షా(24; 19 బంతుల్లో 6 ఫోర్లు), మయాంక్‌ అగర్వాల్‌(3) వికెట్లను కోల్పోయింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్య ఛేదనలో ఇన్నింగ్స్‌ను పృథ్వీ షా, మయాంక్‌లు ధాటిగా ఆరంభించారు. బెన్నెట్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి రెండు బంతుల్ని పృథ్వీ షా ఫోర్లు కొట్టి ఊపులో కనిపించగా, మాయంక్‌ మాత్రం తడబడ్డాడు. 

అయితే అదే బెన్నెట్‌ వేసిన మూడో ఓవర్‌ మూడో బంతికి అగర్వాల్‌ వికెట్‌ను కోల్పోయాడు. లైన్‌ లెంగ్త్‌ బంతికి స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో 21 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఇక జెమీసన్‌ వేసిన ఐదో ఓవర్‌ ఆఖరి బంతికి పృథ్వీషా బౌల్డ్‌ కావడంతో  భారత్‌ 34 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. (ఇక్కడ చదవండి: జడేజా.. నువ్వు సూపరమ్మా!)

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌.. ముందుగా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌(79; 79 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), నికోలస్‌(41; 59 బంతుల్లో 5 ఫోర్లు),  రాస్‌ టేలర్‌(73 నాటౌట్‌; 74 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు  రాణించగా,  బ్లండెల్‌(22), జెమీసన్‌(25 నాటౌట్‌; 24 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించడంతో పోరాడే స్కోరును భారత్‌కు నిర్దేశించింది. 

మరిన్ని వార్తలు