పాక్‌పై భారత్‌ కొట్టిన సిక్సర్‌!

16 Jun, 2019 09:18 IST|Sakshi

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌దే పైచేయి

ఆరు మ్యాచ్‌లలోనూ విజయం

ప్రతీసారి పాక్‌కు నిరాశే

ఒకటోసారి...రెండోసారి...మూడోసారి... 23 ఏళ్ల వ్యవధిలో తేదీలు, వేదికలు మారాయి... నాలుగు ఖండాల్లో ఆట జరిగింది... కానీ ఫలితం మాత్రం సేమ్‌ టు సేమ్‌... ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ విజయం. ఆరు మ్యాచ్‌లలో ఇరు జట్లు తలపడగా ఎన్ని ప్రయత్నాలు చేసినా పాక్‌కు ఒక్కసారి కూడా గెలుపు దక్కలేదు. ఇప్పుడు మరోసారి భారత్, పాకిస్తాన్‌ మధ్య సమరానికి సిద్ధమైన తరుణంలో టీమిండియా కొట్టిన ‘సిక్సర్‌’ను   గుర్తు చేసుకుంటే...

4 మార్చి, 1992 (సిడ్నీ): ప్రపంచ కప్‌లో భారత్, పాక్‌ తలపడిన తొలి మ్యాచ్‌. 49  ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సచిన్‌ (62 బంతుల్లో 54 నాటౌట్‌; 3 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం పాకిస్తాన్‌ 48.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. భారత్‌ 43 పరుగుల తేడాతో నెగ్గింది.  కపిల్, ప్రభాకర్, శ్రీనాథ్‌ తలా 2 వికెట్లు తీయగా సచిన్‌ కూడా కీలకమైన సొహైల్‌ వికెట్‌ తీసి భారత్‌ను గెలిపించాడు. మియాందాద్‌ను రనౌట్‌ చేయడంలో కిరణ్‌ మోరే విఫలం కాగా... అతడిని వెక్కిరిస్తూ మియాందాద్‌ వేసిన కుప్పిగంతులు ‘ఫోటో ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచిపోయింది. 

9 మార్చి, 1996 (బెంగళూరు): ఉత్కంఠభరిత క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 287 పరుగులు చేసింది. నవజ్యోత్‌ సిద్ధూ (93; 11 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపించాడు. చివర్లో అజయ్‌ జడేజా (25 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడు భారత్‌కు భారీ స్కోరు అందించింది. పాక్‌ 49 ఓవర్లలో 9 వికెట్లకు 248 పరుగులు చేసింది. భారత్‌ 39 పరు గులతో గెలిచింది. అమీర్‌ సొహైల్‌ (55), అన్వర్‌ (48) కలిసి మెరుపు ఆరంభాన్ని (10 ఓవర్లలో 84) ఇచ్చినా వీరిద్దరు ఔటయ్యాక పాక్‌ ఓటమి దిశగా పయనించింది. వెంకటేశ్‌ ప్రసాద్, కుంబ్లే మూడేసి వికెట్లు తీశారు. ప్రసాద్‌ బౌలింగ్‌లో వాదనకు దిగి తర్వాతి బంతికే సొహైల్‌ క్లీన్‌బౌల్డ్‌ కావడం అభిమానుల దృష్టిలో ఎప్పటికీ నిలిచిపోయే క్షణం.  

8 జూన్, 1999 (మాంచెస్టర్‌): ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌ విజయాల ‘హ్యాట్రిక్‌’ పూర్తి చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 6 వికెట్లకు 227 పరుగులు చేసింది. రాహుల్‌ ద్రవిడ్‌ (61), అజహరుద్దీన్‌ (59), సచిన్‌ (45) స్కోరులో కీలక పాత్ర పోషించారు. అనంతరం పాక్‌ 45.3 ఓవర్లలో 180 పరుగులకే కుప్పకూలింది. భారత్‌ 47 పరుగులతో గెలిచింది. వెంకటేశ్‌ ప్రసాద్‌ 5 వికెట్లతో చెలరేగి ప్రత్యర్థిని పడగొట్టగా,  శ్రీనాథ్‌కు 3 వికెట్లు దక్కాయి.  

1 మార్చి, 2003 (సెంచూరియన్‌):  టాస్‌ గెలిచిన పాక్‌ 7 వికెట్లకు 273 పరుగులు చేసింది. సయీద్‌ అన్వర్‌ (101) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. అనంతరం భారత్‌ 45.4 ఓవర్లలో 4 వికెట్లకు 276 పరుగులు చేసి సునాయాస విజయాన్నందుకుంది. సచిన్‌ (75 బంతుల్లో 98; 12 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగా, చివర్లో యువరాజ్‌ సింగ్‌ (50 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు.

30 మార్చి, 2011 (మొహాలి): ప్రపంచకప్‌లో విజేతగా నిలిచే దిశగా భారత్‌... సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌ అడ్డంకిని దాటింది. టాస్‌ గెలిచిన భారత్‌ 9 వికెట్లకు 260 పరుగులు చేసింది. సచిన్‌ (115 బంతుల్లో 85; 11 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. వహాబ్‌ రియాజ్‌కు 5 వికెట్లు దక్కాయి. అనంతరం పాక్‌ 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌటవ్వడంతో భారత్‌ 29 పరుగులతో నెగ్గింది.

15 ఫిబ్రవరి, 2015 (అడిలైడ్‌):  ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 7 వికెట్లకు 300 పరుగులు సాధించింది. కోహ్లి (126 బంతుల్లో 107; 8 ఫోర్లు) సెంచరీ చేశాడు. అనంతరం పాక్‌ 47 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌ 76 పరుగులతో నెగ్గింది. షమీకి 4 వికెట్లు దక్కాయి.

మరిన్ని వార్తలు