ఆశల పల్లకిలో...

20 Jun, 2015 02:06 IST|Sakshi
ఆశల పల్లకిలో...

నేటి నుంచి
 హాకీ వరల్డ్ లీగ్
 బరిలో భారత జట్లు
 రియో ఒలింపిక్స్ బెర్త్‌పై మహిళల జట్టు గురి

 
 యాంట్‌వర్ప్ (బెల్జియం): ఇప్పటికే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత పురుషుల జట్టు... మూడున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో భారత మహిళల జట్టు... శనివారం మొదలయ్యే హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్)లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గత ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించి వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన భారత పురుషుల జట్టు ఈ టోర్నమెంట్‌ను ప్రయోగాలకు వేదికగా చేసుకోనుంది. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో తలపడనున్న సర్దార్ సింగ్ బృందం స్థాయికి తగ్గట్టు ఆడితే విజయంతో శుభారంభం చేసే అవకాశముంది.
 
  చీఫ్ కోచ్ పాల్ వాన్ యాస్ ఆధ్వర్యంలో భారత పురుషుల జట్టు ఈ టోర్నీలో నూతన ప్రయోగాలకు పెద్దపీట వేసే అవకాశముంది. అగ్రశ్రేణి జట్లకు దీటుగా పోటీనిచ్చే స్థాయికి భారత జట్టు ఆటతీరు చేరుకుందని కోచ్ పాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. పెనాల్టీ కార్నర్‌లను సంపాదించడం, వాటిని గోల్స్‌గా మలచడంపైనే తమ దృష్టి ఉందన్నాడు. పురుషుల విభాగంలో మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, పోలండ్, ఫ్రాన్స్ ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో బ్రిటన్, బెల్జియం, మలేసియా, ఐర్లాండ్, చైనా జట్లకు చోటు కల్పించారు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ల మధ్య లీగ్ మ్యాచ్ జూన్ 26న జరుగుతుంది.
 
 మరోవైపు మహిళల జట్టు ఆతిథ్య బెల్జియంతో ఆడనుంది. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత భారత మహిళల జట్టు మరోసారి ఒలింపిక్స్‌కు అర్హత పొందలేకపోయింది. ఒకవేళ ఈ టోర్నీలో టాప్-3లో నిలిస్తే భారత జట్టుకు రియో ఒలింపిక్స్ బెర్త్ లభిస్తుంది. ఈ నేపథ్యంలో మహిళల జట్టుపై అందరి దృష్టి నెలకొని ఉంది. భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు యెండల సౌందర్య (తెలంగాణ), రజని ఎతిమరపు (ఆంధ్రప్రదేశ్) ఉన్నారు. ‘తొలి మ్యాచ్‌లో గెలిస్తే తర్వాతి మ్యాచ్‌లకు ఆత్మవిశాస్వం పెరుగుతుంది. మా అందరి లక్ష్యం రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే’ అని కెప్టెన్ రితూ రాణి తెలిపింది. మహిళల విభాగంలోనూ మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో జపాన్, నెదర్లాండ్స్, అజర్‌బైజాన్, కొరియా, ఇటలీ... గ్రూప్ ‘బి’లో భారత్, బెల్జియం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పోలండ్ జట్లు ఉన్నాయి.
 లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక ఆయా గ్రూప్‌ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మహిళల విభాగంలో ఫైనల్ జులై 4న, పురుషుల విభాగంలో ఫైనల్ జులై 5న జరుగుతుంది.
 
 పురుషుల విభాగం
 భారత్ ఁ ఫ్రాన్స్
 రాత్రి గం. 9.30 నుంచి

 
 మహిళల విభాగం
 భారత్ ఁ బెల్జియం
 రాత్రి గం. 7.30 నుంచి

 
 స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 

మరిన్ని వార్తలు