భారత్‌-పాక్‌ మెమరబుల్ మూమెంట్స్!

27 Feb, 2016 17:31 IST|Sakshi

దాయాదుల పోరంటే కేవలం భారత్, పాక్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికుల్లోనూ అమితాసక్తి నెలకొంటుంది. భారత్‌-పాక్‌ ఎప్పుడు క్రికెట్ మైదానంలో తలపడినా ఒకటే ఉత్కంఠ. అభిమానుల్లో ఎన్నో అంచనాలు. 1986 షార్జాలో జావేద్ చివరి బాల్ సిక్స్ దగ్గర నుంచి 2007 టీ-20 వరల్డ్ కప్ ఫైనల్ విజయం వరకు ఇలా అనేక మ్యాచ్‌లలో ఎన్నో మధురానుభూతులు క్రికెట్ ప్రేమికుల మదిలో మెదులుతుంటాయి. ఆసియా కప్‌లో భాగంగా మరోసారి భారత్‌-పాక్ తలపడతున్న నేపథ్యంలో ఆ మధురమైన జ్ఞాపకాలు మరోసారి మీకోసం..


జావేద్ మియాందాద్ చివరి బాల్ సిక్స్
అది 1986 ఆసియా కప్ ఫైనల్, షార్జాలో అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు, ఆఖరి బంతికి పాక్ నాలుగు పరుగులు చేయాలి. మియాందాద్ క్రీజ్‌లో ఉన్నాడు. చేతన్ శర్మ చివరి బంతి వేయడానికి సిద్ధమయ్యాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మియాందాద్ బంతిని సిక్సర్ కొట్టి పాక్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందిచాడు.

జావేద్ VS కిరణ్ మోరే

అది 1992 ప్రపంచకప్ మ్యాచ్. తొలిసారి వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో భారత్-పాక్ తలపడుతున్నాయి. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 216 పరుగులు చేసింది. దీనికి దీటుగా బదులిస్తోంది పాక్. జావేద్ మియాందాద్, ఆమిర్ సోహెల్ క్రీజ్‌లో ఉన్నారు. ఆ సమయంలో భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే ప్రతిసారి ఎంపైర్‌ కు అప్పీల్ చేస్తుండటంతో మియాందాద్ రెచ్చిపోయాడు. ఓవర్ అయిపోయాక చిన్నపిల్లాడిలా రెండు చేతులు పైకి ఎత్తి కుప్పిగంతులు వేస్తూ కిరణ్ ను గేలి చేస్తాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. కానీ అసహనంతో మియందాద్ వేసిన కుప్పిగంతులు మాత్రం అభిమానులు మరువలేదు.

వెంకటేశ్ ప్రసాద్ రివెంజ్ వికెట్

1996 ప్రపంచకప్ క్వార్టర్‌ ఫైనల్ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. భారత్‌ మొదట బ్యాటింగ్ చేసి 287 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా పాక్ బ్యాట్స్‌మెన్ అమిర్ సోహెల్ చెలరేగి ఆడుతున్నాడు. పాక్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఆ సమయంలో ప్రసాద్ బౌలింగ్‌లో సోహెల్ ఓ బౌండరీ కొట్టి.. ఫోర్‌ అంటే ఇలా కొట్టాలి అన్నట్టు దురుసుగా ప్రసాద్‌ వైపు బ్యాటుతో చూపాడు. దీంతో కసిగా బౌలింగ్ చేసిన ప్రసాద్ ఆ తర్వాత బంతికే సోహెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. సోహెల్‌ కు పెవిలియన్ ను చూపిస్తూ రివెంజ్ తీర్చుకున్నాడు. సోహెల్ నిష్ర్కమణతో పాక్ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది.

1996 మాస్టర్ ఇన్నింగ్స్..


1996.. చెన్నై వేదిక.. భారత్ టార్గెట్ 271.  కానీ లక్ష్యఛేదనలో భారత్ తడబడింది. ఒక దశలో 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పొయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన సచిన్  నయన్ మోంగియాతో కలిసి భారత్‌ను విజయం చేరువగా నడిపించాడు.  సెంచరీతో కదం తొక్కాడు. కానీ చివరి దశలో సక్లైన్ ముస్తాక్ బౌలింగ్లో సచిన్ అవుటవ్వడంతో భారత్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది.

అనిల్ కుంబ్లే 10/10..


1999లో ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ అనిల్‌కుంబ్లే తన విశ్వరూపం చూపాడు. పదికి పది వికెట్లు తీసి పాక్ పరాజయాన్ని శాసించాడు. 420 పరుగుల విజయలక్ష్యంలో బరిలోకి దిగిన పాక్ కుంబ్లే స్పిన్‌కు దాసోహమై.. 207 పరుగులకే మొత్తం పది వికెట్లు అతనికి అప్పగించింది.

సయ్యద్ అన్వర్ చెలరేగిన వేళ..
దాదాపు రెండు దశాబ్దాల క్రితం చపాక్ స్టేడియంలో భారత్‌కు వ్యతిరేకంగా సయ్యద్ అన్వర్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు.  1997లో పాత రికార్డులను బద్దలు కొడుతూ.. ప్రపంచ వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 145 బంతుల్లో 194 పరుగులు చేశాడు.


సచిన్-సెహ్వగ్ ఓపెనింగ్ జోడి
అది 2003 ప్రపంచకప్ మ్యాచ్.. మొదట బ్యాటింగ్ చేసిన పాక్.. భారతకి 274 పరుగుల విజయలక్ష్యాన్ని విసిరింది.    వసీమ్ అక్రమ్, వకార్ యునిస్, షోయబ్ అక్తర్ లాంటి భయంకర పేస్ విభాగంతో పాక్‌ బౌలింగ్ బలంగా ఉంది. ఈ సమయంలో భారత్ ఓపెనింగ్ జోడి మెరుపులు మెరిపించింది. పాక్ పేస్ ను పటాపంచలు చేస్తూ మొదటి 10 ఓవర్లలోనే విజయాన్ని ఖరారు చేసింది సచిన్- సెహ్వాగ్‌ జోడీ. 98 పరుగులు చేసిన సచిన్ అక్తర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

 ఎంఎస్ ధోని 148 @ వైజాగ్‌
2005 ఏప్రిల్ 5న వైజాగ్ వేదికగా మహేంద్రసింగ్ ధోనీ తన ధనాధన్ బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఈ మ్యాచ్‌తో ధోని అంటే ఏంటో ప్రపంచానికి తెలిసింది. తనదైనా షాట్లతో  కేవలం 123 బంతుల్లో 148 పరుగులు చేసి భారత్‌కు  విజయాన్నందించాడు.


2007 టీ-20 వరల్డ్‌కప్..
ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఫలితం కోసం బౌలౌట్ ఆడాల్సివచ్చింది. ఈ బౌలౌట్‌లో భారత్ 4-0 తేడాతో విజయం సాధించింది.
 
2007 టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్
 బహుశ భారత క్రికెట్ అభిమాని ఈ మ్యాచ్‌ను మరిచి పోలేడేమో.. బౌలౌట్‌లో ఉత్కంఠభరిత విజయం సాధించిన కొన్ని రోజులకే దాయాదులు మరోసారి తలపడ్డారు. అదీకూడా వరల్డ్ కప్ ఫైనలో..  ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో చివరిబంతి వరకు విజయం కోసం ఇరు జట్లు పోరాడాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకొని 157 పరుగులే చేసింది. కానీ భారత బౌలర్లు పోరాడారు. ఒకదశలో 11.3 ఓవర్లలో 76 పరుగులే చేసి పాక్ కష్టాల్లో ఉంది. కానీ పాక్ బ్యాట్స్‌మెన్ మిస్బా ఉల్ హక్ పోరాడాడు. చివరికి ఆఖరి ఓవర్లో 13 పరుగులు చేయాలి. మిస్బా ఓ సిక్స్ కొట్టి దాదాపు విజయాన్ని ఖరారుచేశాడు. ఆ తర్వాత బంతికే మిస్బా స్కూప్ షార్ట్ ఆడబోయి శ్రీశాంత్ చేతికి చిక్కాడు. దాంతో ఇండియా 5 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి టీ-20 ప్రపంచకప్‌ను అందుకుంది.

 

మరిన్ని వార్తలు