98 ఓవర్లు...9 వికెట్లు...

6 Oct, 2019 03:26 IST|Sakshi

విశాఖ టెస్టులో విజయంపై భారత్‌ గురి

దక్షిణాఫ్రికా లక్ష్యం 395

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 323/4 డిక్లేర్డ్‌

రోహిత్‌ శర్మ రెండో సెంచరీ

నేడు వైజాగ్‌లో పాక్షిక వర్షసూచన 

ఓపెనర్‌గా వన్డే తరహా ఆటను తలపిస్తూ, కొత్త రికార్డులు నెలకొల్పుతూ రోహిత్‌ శర్మ మరో శతకం... అనూహ్య రీతిలో చతేశ్వర్‌ పుజారా ఎదురు దాడి... ఆపై జడేజా, కోహ్లి, రహానేల ధాటైన బ్యాటింగ్‌... ఫలితంగా తొలి టెస్టులో భారత జట్టు విజయానికి బాటలు వేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 4.82 రన్‌రేట్‌తో పరుగులు సాధించిన టీమిండియా...  దక్షిణాఫ్రికా ముందు 395 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది.

స్పిన్‌తోనే సఫారీలను పడగొట్టేందుకు సిద్ధమైన కోహ్లి సేన ఇప్పటికే కీలకమైన ఎల్గర్‌ వికెట్‌ తీసి ప్రత్యరి్థని ఆందోళనలో పడేసింది. మ్యాచ్‌ చివరి రోజు మిగిలిన 9 వికెట్లు తీయగలమని భారత్‌ విశ్వాసంతో ఉండగా... తొలి ఇన్నింగ్స్‌ స్ఫూర్తితో 98 ఓవర్ల పాటు ఆడి, వర్షం కూడా కలిసొస్తే మ్యాచ్‌ను కాపాడుకోగలమని దక్షిణాఫ్రికా భావిస్తోంది. మధ్యలో నేనున్నానంటూ వరుణుడు అడ్డుపడకపోతే మొగ్గు మన వైపే ఉంది.   

విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఫ్రీడమ్‌ ట్రోఫీ తొలి టెస్టు చివరి రోజుకు చేరింది. మ్యాచ్‌లో గెలుపుపై భారత్‌ దృష్టి పెట్టగా, దక్షిణాఫ్రికా కనీసం ‘డ్రా’ను ఆశిస్తోంది. 395 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా శనివారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 11 పరుగులు చేసింది. జడేజా బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో డీన్‌ ఎల్గర్‌ (2) అవుటయ్యాడు.  దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ బలం, చివరి రోజు పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే తీరు చూస్తే సఫారీలు ఈ రికార్డు స్థాయి లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమే. కాబట్టి ఆ జట్టు ‘డ్రా’ కోసమే ప్రయతి్నంచవచ్చు. ఆదివారం వాతావరణం అనుకూలిస్తే కనీసం 98 ఓవర్లు వేసేందుకు అవకాశం ఉంది.

ఇందులో మిగిలిన 9 వికెట్లు తీస్తే సిరీస్‌లో భారత్‌ ముందంజ వేస్తుంది. అంతకుముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్ల నష్టానికి 323 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. రోహిత్‌ శర్మ (149 బంతుల్లో 127; 10 ఫోర్లు, 7 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో వరుసగా రెండో సెంచరీ చేయగా... పుజారా (148 బంతుల్లో 81; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 169 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో 46 పరుగులు జోడించి 431 పరుగుల వద్ద ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 71 పరుగుల ఆధిక్యం లభించింది. అశ్విన్‌ 145 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.

తొలి సెషన్‌: అశ్విన్‌కే 2 వికెట్లు
నాలుగో రోజు ఉదయం దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ కొద్దిసేపు భారత్‌కు చికాకు పరిచారు. అంత తేలిగ్గా లొంగకుండా వీలైనన్ని ఎక్కువ పరుగులు జోడించే ప్రయత్నం చేశారు. ముత్తుసామి (106 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే తక్కువ వ్యవధిలో అశ్విన్‌ మిగిలిన రెండు వికెట్లు పడగొట్టి సఫారీల ఆట ముగించాడు. రెండో ఇన్నింగ్స్‌ను భారత ఓపెనర్లు జాగ్రత్తగా మొదలు పెట్టారు. ఫిలాండర్‌ వేసిన వరుస మూడు ఓవర్లను ఎదుర్కొన్న మయాంక్‌ 18 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేదు. చివరకు మహరాజ్‌ బౌలింగ్‌లో మయాంక్‌ (7) వెనుదిరగడంతో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ మాత్రం మహరాజ్‌ బౌలింగ్‌లోనే రెండు సిక్సర్లు బాది తన ఉద్దేశాన్ని చాటాడు. 

ఓవర్లు: 13.2, పరుగులు: 46, వికెట్లు: 2 (దక్షిణాఫ్రికా)
ఓవర్లు: 14, పరుగులు: 35, వికెట్లు: 1 (భారత్‌)

రెండో సెషన్‌:  మెరుపు భాగస్వామ్యం
వేగంగా పరుగులు రాబట్టి ప్రత్యరి్థకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనే ఆలోచన భారత జట్టులో కనిపించింది. రోహిత్‌ మొదటినుంచీ దూకుడు చూపించగా, ఆరంభంలో నెమ్మదిగా ఆడిన పుజారా ఆ తర్వాత వేగం పెంచాడు. పీట్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన రోహిత్‌ 72 బంతుల్లో అర్ధసెంచరీ  పూర్తి చేసుకున్నాడు. 50 పరుగుల వద్ద  ముత్తుసామి చక్కటి క్యాచ్‌ పట్టినా... చివరి క్షణంలో అతని కాలు బౌండరీని తాకి సిక్సర్‌గా మారడంతో రోహిత్‌ బతికిపోయాడు. మరో ఎండ్‌లో ఒక దశలో 63 బంతుల్లో 8 పరుగుల వద్ద ఉన్న పుజారా ఆపై బౌండరీలతో చెలరేగాడు.   
ఓవర్లు: 34, పరుగులు: 140, వికెట్లు: 0

మూడో సెషన్‌:   అదే దూకుడు...
విరామం తర్వాత పుజారాను ఫిలాండర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అయితే భారత్‌ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఈసారి రోహిత్‌కు జడేజా (40; 3 సిక్సర్లు) జత కలిశాడు. ఫిలాండర్‌ బౌలింగ్‌లో స్క్వేర్‌ లెగ్‌ దిశగా సింగిల్‌ తీయడంతో 133 బంతుల్లో రోహిత్‌ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత పీట్‌ వేసిన ఓవర్లో రోహిత్‌ మూడు భారీ సిక్సర్లు కొట్టాడు. అయితే మహరాజ్‌ వేసిన తర్వాతి ఓవర్లో స్టంపౌట్‌ కావడంతో రోహిత్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ముగిసింది. కోహ్లి (31 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), రహానే (27 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడటంతో భారత్‌ స్కోరు దూసుకుపోయింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఎల్గర్‌ (2) వికెట్‌ను కోల్పోయింది. వెలుతురు మందగించడంతో నిర్ధారిత సమయంకంటే నాలుగు ఓవర్ల ముందే ఆటను నిలిపివేశారు.  ఓవర్లు: 19, పరుగులు: 148, వికెట్లు: 3 (భారత్‌); ఓవర్లు: 9, పరుగులు: 11, వికెట్లు: 1 (దక్షిణాఫ్రికా)  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 502/7 డిక్లేర్డ్‌; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 431.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) డు ప్లెసిస్‌ (బి) మహరాజ్‌ 7; రోహిత్‌ (స్టంప్డ్‌) డి కాక్‌ (బి) మహరాజ్‌ 127; పుజారా (ఎల్బీ) (బి) ఫిలాండర్‌ 81; జడేజా (బి) రబడ 40; కోహ్లి (నాటౌట్‌) 31; రహానే (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (67 ఓవర్లలో 4 వికెట్లకు డిక్లేర్డ్‌) 323.  వికెట్ల పతనం: 1–21, 2–190, 3–239, 4–286. బౌలింగ్‌: ఫిలాండర్‌ 12–5–21–1, మహరాజ్‌ 22–0–129–2, రబడ 13–3–41–1, పీట్‌ 17–3–102–0, ముత్తుసామి 3–0–20–0.

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (బ్యాటింగ్‌) 3; ఎల్గర్‌ (ఎల్బీ) (బి) జడేజా 2; బ్రూయిన్‌ (బ్యాటింగ్‌) 5; ఎక్స్‌ట్రాలు 1;
మొత్తం (9 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 11.  
వికెట్ల పతనం: 1–4. బౌలింగ్‌: అశి్వన్‌ 5–2–7–0, జడేజా 4–2–3–1.

మరిన్ని వార్తలు