ఇక్కడే కొట్టాలి!

25 Nov, 2015 01:25 IST|Sakshi
ఇక్కడే కొట్టాలి!

మొహాలీలో మన ముచ్చట తీరినా... చిన్నస్వామిలో చినుకు అడ్డు పడింది. ఇక ఢిల్లీ దాకా వెళ్లక ముందే నాగ్‌పూర్‌లోనే సిరీస్ మన ఖాతాలో పడుతుందా... వికెట్ స్పిన్‌తో సిద్ధం, ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం... ఇక మిగిలింది విజయమే. ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న భారత్ మరో గెలుపు అందుకొని సిరీస్ సొంతం చేసుకుంటే ఓ పనైపోతుంది. టి20, వన్డేలకు ప్రతీకారం తీర్చుకున్నట్లవుతుంది.
 
ఒక వైపు తొమ్మిదేళ్లుగా విదేశాల్లో టెస్టు సిరీస్ ఓడిపోని రికార్డు చెరిగిపోయే ప్రమాదం... మరోవైపు బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యం, స్పిన్ బంతిని చూస్తే బెదిరిపోతున్న వైనం, గెలుపు సంగతేమో కానీ... కొద్దిసేపు క్రీజ్‌లో నిలబడి మ్యాచ్‌ను కాపాడుకోగలిగితే చాలు... ఈ ఒత్తిడిలో జామ్‌తా మైదానంలో గత రికార్డు ఇస్తున్న భరోసాతో బరిలోకి దిగుతున్న సఫారీలు. మరి మూడో టెస్టు భారత్‌కు ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా... ఏకపక్ష విజయం దక్కుతుందా లేక దక్షిణాఫ్రికా పోరాటపటిమ ప్రదర్శిస్తుందా..?
 
* సిరీస్‌పై భారత్ కన్ను  
* స్పిన్ పిచ్‌తో సిద్ధం
* తీవ్ర ఒత్తిడిలో దక్షిణాఫ్రికా  
* నేటినుంచి మూడో టెస్టు

నాగ్‌పూర్: సొంతగడ్డపై ఆడి కూడా దక్షిణాఫ్రికాతో గత రెండు టెస్టు సిరీస్‌లలో డ్రా తోనే సంతృప్తిపడిన భారత్ ఈ సారి ఎలాంటి అవకాశం ఇవ్వరాదని భావిస్తోంది. తమ బలమైన స్పిన్‌నే మరోసారి నమ్ముకొని సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేటి (బుధవారం)నుంచి మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలి టెస్టు నెగ్గిన భారత్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.
 
మిశ్రాకు చోటు!
బెంగళూరులో నాలుగు రోజుల ఆట సాధ్యం కాకపోవడంతో ఇరు జట్లకూ మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. అయితే రెండో టెస్టు అనంతరం దక్కిన విరామంలో స్వస్థలాలకు వెళ్లి వచ్చిన భారత ఆటగాళ్లు కొత్త ఉత్సాహంతో సన్నద్ధమయ్యారు. మొహాలీ టెస్టులో బౌలర్ల అండతో టీమిండియా నెగ్గినా... విజయ్, పుజారా మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ముఖ్యంగా కోహ్లి, రహానే ఏ మాత్రం ప్రభావం చూపించలేదు.

రెండో టెస్టులో దీనిని సరిదిద్దుకునే అవకాశం రాలేదు. జట్టులో ఐదుగురే రెగ్యులర్ బ్యాట్స్‌మెన్ ఉండటంతో ఇద్దరు విఫలం కావడం స్కోరుపై ప్రభావం చూపిస్తుంది. కీలకమైన ఆరో స్థానంలో ఆడుతున్న సాహా ఇంకా టెస్టు బ్యాట్స్‌మన్‌గా నిలదొక్కుకోలేదు. రెండో మ్యాచ్‌లో చక్కటి షాట్లు ఆడిన ధావన్ తిరిగి ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం.

బౌలింగ్‌లో మరోసారి స్పిన్నర్లదే ప్రధాన బాధ్యత కానుంది. మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 27 వికెట్లు మన స్పిన్నర్లే పడగొట్టడం వారి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. అశ్విన్, జడేజా ‘జుగల్‌బందీ’ సఫారీలను కట్టి పడేస్తోంది. గత టెస్టులో బిన్నీకి అవకాశం ఇచ్చినా... వికెట్ స్వభావాన్ని బట్టి చూస్తే లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మళ్లీ తుది జట్టులోకి రావచ్చు.
 
నడిపించేది ఎవరు?
భారత్‌లో పర్యటించిన విదేశీ జట్లలో అత్యుత్తమ రికార్డు ఉన్న టీమ్‌గా ఇక్కడ అడుగు పెట్టిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ టెస్టుల్లో ఘోరంగా విఫలమైంది. తొలి రెండు టెస్టులు జరిగిన వేదికల్లో స్పిన్‌కు మరీ భయపడే పరిస్థితి ఏమీ లేదని స్వయంగా ఆ జట్టు ఆటగాళ్లే ఒప్పుకుంటున్నా...మానసికంగా ముందే ఓటమికి సిద్ధమైనట్లుగా వారు ఆడారు.

వర్షం కారణంగా విరామం తెచ్చిన మార్పు ఏదైనా ఉంటే అది ఈ మ్యాచ్‌లోనే వారు చూపించాలి. లేదంటే సిరీస్ చేజారిపోవడం ఖాయం. డివిలియర్స్ మినహా ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. టన్నుల కొద్దీ రికార్డులు తన పేరిట ఉన్న ఆమ్లా, స్పిన్‌ను సమర్థంగా ఆడగలడన్న డు ప్లెసిస్ (0, 1, 0 పరుగులు) ఘోర వైఫల్యం జట్టును దెబ్బతీస్తోంది.

వీరిద్దరు రాణించడంతో పాటు డుమిని తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే సఫారీలు కొంత కోలుకునే అవకాశం ఉంది. ఎల్గర్ కొద్దిగా పట్టుదల కనపర్చినా...అనుభవం లేని వాన్ జిల్, విలాస్ తేలిపోయారు. ఈ స్థితిలో భారత బౌలింగ్‌ను అడ్డుకోవాలంటే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ శక్తికి మించి శ్రమించాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో కూడా ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది.

స్టెయిన్ గాయంపై ఇంకా సందేహాలు ఉండటంతో అతను ఆడేది లేనిదీ చెప్పలేని స్థితి. ఈ దశలో మోర్నీ మోర్కెల్‌తో పాటు అనుభవం లేని రబడపై బాధ్యత పెరిగింది. పరిమిత ఓవర్ల తరహాలో తాహిర్ రాణిస్తేనే ఆ జట్టుకు కూడా పిచ్ అండగా మారుతుంది. ఒక పేసర్‌ను తగ్గించి జట్టు మరో స్పిన్నర్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.
 
పిచ్, వాతావరణం
భారత్ ఆశించినట్లే ఇక్కడ కూడా స్పిన్ పిచ్‌నే తయారు చేశారు. మొదటి రోజునుంచే బంతి తిరుగుతుందని క్యురేటర్ చెప్పడం విశేషం. గతంతో పోలిస్తే మైదానంలో ఈ సారి బౌన్స్ కూడా కాస్త ఎక్కువగా ఉండవచ్చు. కొన్ని రోజులుగా నగరంలో 30 డిగ్రీలతో సాధారణం వాతావరణం ఉంది. కాబట్టి మ్యాచ్‌కు ఇబ్బంది ఉండకపోవచ్చు.
 
జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, మిశ్రా, ఇషాంత్, ఆరోన్.
 
దక్షిణాఫ్రికా: ఆమ్లా (కెప్టెన్), ఎల్గర్, వాన్ జిల్, డు ప్లెసిస్, డివిలియర్స్, డుమిని, విలాస్, మోర్కెల్, తాహిర్, రబడ/అబాట్, హార్మర్/పీడ్
 
2006లో శ్రీలంక చేతిలో 0-2తో పరాజయంపాలైన తర్వాత దక్షిణాఫ్రికా విదేశాల్లో ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. ఇంగ్లండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో పాటు ఆస్ట్రేలియాను (రెండు సార్లు) కూడా సఫారీలు చిత్తు చేశారు. మొత్తం 14 సిరీస్‌లలో దక్షిణాఫ్రికా 10 గెలవడం విశేషం.
 
* భారత్‌లో ఆడిన గత రెండు సిరీస్‌లను (2007-08, 2009-10) దక్షిణాఫ్రికా ‘డ్రా’గా ముగించగలిగింది.
* నాగ్‌పూర్ జామ్‌తా స్టేడియంలో నాలుగు టెస్టులు ఆడిన భారత్ 2 గెలిచి 1 డ్రా చేసుకొని మరొకటి ఓడింది. ఆ ఒక్కటి దక్షిణాఫ్రికా (2010) చేతిలోనే కావడం విశేషం.
* ఈ సీజన్‌లో జామ్‌తా మైదానంలో జరిగిన రెండు రంజీ మ్యాచ్‌ల్లో స్పిన్నర్లు 44 వికెట్లు తీయడం విశేషం.

ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం...

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు