మణికట్టు...ఆటకట్టు

5 Feb, 2018 04:23 IST|Sakshi
చహల్‌, కుల్దీప్‌

స్పిన్నర్ల మాయాజాలానికి దక్షిణాఫ్రికా 118కే ఆలౌట్‌

చహల్‌కు ఐదు... కుల్దీప్‌కు మూడు వికెట్లు

రెండో వన్డేలో భారత్‌ 9 వికెట్లతో ఘన విజయం

మూడో వన్డే బుధవారం  

పేస్‌ ఇబ్బంది పెట్టలేదు... బౌన్స్‌ పెద్దగా కనిపించలేదు... కానీ స్పిన్‌ మాత్రం సఫారీ బ్యాట్స్‌మెన్‌తో సొంతగడ్డపైనే చిందులు వేయించింది. మణికట్టును వీడిన బంతులు మిసైల్స్‌లా దూసుకొస్తుంటే ఆడుతోంది భారత్‌లోనా లేక తమ దేశంలోనా అని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లో సంశయం... ఆ సందేహం తీరేలోపే అంతా ముగిసిపోయింది... ఒకరి వెంట మరొకరు... ఒకే స్కోరు వద్ద ముగ్గురు... కలిసికట్టుగా, సమష్టిగా పెవిలియన్‌ చేరిపోయారు... 42 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీసిన మన స్పిన్‌ మంత్రం మళ్లీ పని చేసింది. ఫలితంగా దక్షిణాఫ్రికా 118 ఆలౌట్‌...ఆ తర్వాత వరుసగా రెండో మ్యాచ్‌లో భారత్‌ అలవోక ఛేదన.

 దాదాపు మూడు వారాల క్రితం ఇక్కడే రెండో టెస్టులో ఇది భారత్‌ పిచ్‌లాగానే ఉందని అందరూ అన్నారు. దానిని ఉపయోగించు కోలేకపోయిందంటూ పరాజయం తర్వాత వ్యాఖ్యలూ వినిపించాయి. అయితే ఈసారి కూడా వికెట్‌ సరిగ్గా భారత్‌లోలాగే స్పందించింది. ఇప్పుడు మనోళ్లు దానిని పూర్తిగా వాడుకున్నారు. యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్‌ అద్భుత బౌలింగ్‌తో కోహ్లి సేన అతి సునా యాసంగా రెండో వన్డేను తమ ఖాతాలో వేసుకుంది. లెగ్‌ స్పిన్నర్‌ చహల్‌ కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టగా... చైనామన్‌ కుల్దీప్‌ 3 వికెట్లతో అండగా నిలిచాడు. ఫలితంగా స్వదేశంలో అతి తక్కువ స్కోరుకు ఆలౌటైన చెత్త రికార్డుతో సఫారీలు మ్యాచ్‌ను సమర్పించుకున్నారు.   

సెంచూరియన్‌:
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్‌ ఆధిపత్యం కొనసాగింది. ఆదివారం ఇక్కడి సూపర్‌ స్పోర్ట్‌ పార్క్‌లో పూర్తి ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో భారత్‌ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. డుమిని (25), జోండో (25)లదే అత్యధిక స్కోరు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యజువేంద్ర చహల్‌ (5/22), కుల్దీప్‌ యాదవ్‌ (3/20) ప్రత్యర్థి పని పట్టారు. అనంతరం భారత్‌ 20.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 119 పరుగులు చేసింది. ధావన్‌ (56 బంతుల్లో 51 నాటౌట్‌; 9 ఫోర్లు), కోహ్లి (50 బంతుల్లో 46 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు అభేద్యంగా 93 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఈ ఫలితంతో భారత్‌ ఆరు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే బుధవారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది.  

టపటపా...
ఒక దశలో 26 బంతుల వ్యవధిలో 12 పరుగులకే 4 వికెట్లు... కొంత పోరాటం తర్వాత చివర్లో 36 బంతుల వ్యవధిలో 19 పరుగులకే 6 వికెట్లు... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ రెండు దశల్లో ఈ రకంగా కుప్పకూలింది! ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయలేకపోగా, ఆరుగురు ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనే అందుకు కారణం. మొదట్లో భువీ, బుమ్రా... ఆ తర్వాత చహల్, కుల్దీప్‌ సఫారీల పని పట్టడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. డివిలియర్స్, డు ప్లెసిస్‌ లేని బ్యాటింగ్‌ లైనప్‌ ఈ మ్యాచ్‌లో మరీ పేలవంగా కనిపించింది.  

ఓపెనర్లు ఆమ్లా (23; 4 ఫోర్లు), డి కాక్‌ (20; 2 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను అతి జాగ్రత్తగా ప్రారంభించారు. టెస్టు సిరీస్‌ నుంచి వరుసగా విఫలమవుతున్న డి కాక్‌ను బుమ్రా ఒక ఆటాడుకున్నాడు. అతని తొలి ఓవర్లో మొదటి బంతినే డి కాక్‌ దాదాపు వికెట్లపైకి ఆడుకున్నాడు. అదృష్టవశాత్తూ బెయిల్స్‌ పడలేదు. రెండో బంతి బౌన్సర్‌ను అతి కష్టమ్మీద తప్పించుకున్న డి కాక్, మూడో బంతికి వేలికి గాయం చేసుకున్నాడు. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఆమ్లాను భువీ అవుట్‌ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది.

ఆ తర్వాత డి కాక్‌ను అవుట్‌ చేసి చహల్‌ తన జోరు మొదలు పెట్టాడు. కుల్దీప్‌ వేసిన మరుసటి ఓవర్లోనే కెప్టెన్‌ మార్క్‌రమ్‌ (8), మిల్లర్‌ (0) అవుట్‌ కావడంతో దక్షిణాఫ్రికా కష్టాలు పెరిగాయి. 51 పరుగుల స్కోరు వద్దే ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. ఈ దశలో డుమిని, తొలి వన్డే ఆడుతున్న జోండో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. భారత బౌలింగ్‌ను కొద్ది సేపు నిరోధించగలిగిన వీరిద్దరు 12.4 ఓవర్లలో ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు.  

అయితే మళ్లీ చహల్‌ మాయ మొదలైంది. భారీ షాట్‌ ఆడబోయిన జోండో మిడ్‌ వికెట్‌లో పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. చహల్‌ తన వరుస ఓవర్లలో డుమిని, మోర్కెల్‌ (1)ల పని పట్టగా...మధ్యలో రబడ (1)ను కుల్దీప్‌ వెనక్కి పంపించాడు. తాహిర్‌ (0)ను బుమ్రా బౌల్డ్‌ చేయగా...మోరిస్‌ (14)ను అవుట్‌ చేసి చహల్‌ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.  

అలవోకగా...
అతి సునాయాస లక్ష్యాన్ని భారత్‌ ఏమాత్రం తడబాటు లేకుండా చేరుకుంది. అయితే రోహిత్‌ శర్మ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు, ఒక సిక్స్‌) మాత్రం మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. మూడో బంతికి సిక్సర్‌ బాది దూకుడుగా ఆటను ప్రారంభించిన రోహిత్‌... రబడ బౌన్సర్‌ను హుక్‌ చేయబోయి మోర్కెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ధావన్, కోహ్లి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ చకచకా పరుగులు రాబట్టారు. ఇదే జోరులో ధావన్‌ 49 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్‌ విరామం తర్వాత తొమ్మిదో బంతిని స్క్వేర్‌లెగ్‌ దిశగా ఆడి కోహ్లి రెండు పరుగులు తీయడంతో భారత్‌ విజయం ఖాయమైంది.  

స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌:
ఆమ్లా (సి) ధోని (బి) భువనేశ్వర్‌ 23; డి కాక్‌ (సి) పాండ్యా (బి) చహల్‌ 20; మార్క్‌రమ్‌ (సి) భువనేశ్వర్‌ (బి) కుల్దీప్‌ 8; డుమిని (ఎల్బీ) (బి) చహల్‌ 25; మిల్లర్‌ (సి) రహానే (బి) కుల్దీప్‌ 0; జోండో (సి) పాండ్యా (బి) చహల్‌ 25; మోరిస్‌ (సి) భువనేశ్వర్‌ (బి) చహల్‌ 14; రబడ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 1; మోర్కెల్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 1; తాహిర్‌ (బి) బుమ్రా 0; షమ్సీ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (32.2 ఓవర్లలో ఆలౌట్‌) 118

వికెట్ల పతనం: 1–39; 2–51; 3–51; 4–51; 5–99; 6–107; 7–110; 8–117; 9–118; 10–118.  

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 5–1–19–1; బుమ్రా 5–1–12–1; పాండ్యా 5–0–34–0; చహల్‌ 8.2–1–22–5; కుల్దీప్‌ 6–0–20–3; జాదవ్‌ 3–0–11–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) మోర్కెల్‌ (బి) రబడ 15; ధావన్‌ (నాటౌట్‌) 51; కోహ్లి (నాటౌట్‌) 46; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 119

వికెట్ల పతనం: 1–26.

బౌలింగ్‌: మోర్కెల్‌ 4–0–30–0; రబడ 5–0–24–1; మోరిస్‌ 3–0–16–0; తాహిర్‌ 5.3–0–30–0; షమ్సీ 3–1–18–0.  

మరిన్ని వార్తలు