‘డల్’ డర్బన్!

29 Dec, 2013 02:23 IST|Sakshi
జాక్ కలిస్‌ ,రవీంద్ర జడేజా

నాలుగో రోజు ఆట మ. గం. 1.00 నుంచి
 టెన్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 వాండరర్స్ టెస్టులో నాణ్యమైన టెస్టు క్రికెట్ చూసిన తర్వాత డర్బన్‌లో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టుపై అంచనాలు భారీగా పెరిగాయి. కలిస్‌కు విజయంతో వీడ్కోలు పలకాలని దక్షిణాఫ్రికా... సఫారీ గడ్డపై సిరీస్ గెలవాలని భారత్... మొదటి రెండు రోజులు ఈ పట్టుదల ఆటలో కనిపించి, మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ అనూహ్యంగా మూడో రోజు మ్యాచ్ డల్‌గా మారిపోయింది.
 
 భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా స్పిన్ మ్యాజిక్‌తో సఫారీల జోరుకు అడ్డుకట్ట వేశాడు. అటు ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్ కూడా ఆచితూచి ఆడారు. దీనికి తోడు వరుణుడు కూడా ప్రతిబంధకంగా మారాడు. వెరసి... కీలకమైన ఈ టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఇక అనూహ్య పరిణామాలేమైనా జరిగితే తప్ప డ ర్బన్‌లో ఫలితాన్ని ఆశించలేం.
 
 డర్బన్: పేసర్లకు సహకరించే సఫారీ పిచ్‌లపై ఒక స్పిన్నర్ నాలుగు వికెట్లు తీయడం గొప్ప ఘనతే. అది కూడా జట్టుకు లభించిన ఐదులో నాలుగు ఒక్కరే తీస్తే అద్భుతమే. భారత ఎడమచేతివాటం స్పిన్నర్ జడేజా ఈ మ్యాజిక్ చేశాడు. ఇది భారత అభిమానులకు ఆనందం. ఏడాదిగా టెస్టుల్లో ఘోరంగా విఫలమవుతూ ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా ఆల్‌రౌండ్ దిగ్గజం కలిస్... తన చివరి మ్యాచ్‌లో నిలకడగా ఆడుతూ సెంచరీ దిశగా సాగుతున్నాడు. ఇది దక్షిణాఫ్రికా ఫ్యాన్స్‌కు సంతోషం.
 
 భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆటలో ఇంతకంటే చెప్పుకోదగ్గ విశేషం ఏమీ లేదు. 84.5 ఓవర్ల ఆటలో కేవలం 217 పరుగులు మాత్రమే రావడంతో మ్యాచ్ డల్‌గా మారింది. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 104.5 ఓవర్లలో 5 వికెట్లకు 299 పరుగులు చేసింది.
 
 కలిస్ (224 బంతుల్లో 78 బ్యాటింగ్; 10 ఫోర్లు) సెంచరీ దిశగా సాగుతున్నాడు. డివిలియర్స్ (117 బంతుల్లో 74; 9 ఫోర్లు), పీటర్సన్ (100 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధసెంచరీలు చేయగా... కెప్టెన్ స్మిత్  (81 బంతుల్లో 47; 7 ఫోర్లు) ఈ మార్కును కొద్దిలో మిస్ అయ్యాడు. కలిస్‌తో పాటు స్టెయిన్ (0) క్రీజులో ఉన్నాడు. భారత్ తీసిన ఐదు వికెట్లలో నాలుగు జడేజా సాధించగా... ఒకటి షమీ ఖాతాలో చేరింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు వెనకబడి ఉంది.
 
 జడేజా మ్యాజిక్
 ఓవర్‌నైట్ స్కోరు 82/0తో మూడో రోజు ఆట కొనసాగించిన స్మిత్, పీటర్సన్ రెండో రోజు మాదిరిగానే ధాటిగా ఆడేందుకు ప్రయత్నించారు. ఇషాంత్, జడేజా వేసిన తొలి రెండు ఓవర్లలో వీరిద్దరు మూడు బౌండరీలు సాధించారు. ఈ క్రమంలో పీటర్సన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.  అయితే భారీ షాట్లకు ప్రయత్నించిన స్మిత్... 28వ ఓవర్‌లో జడేజా వేసిన బంతిని మిడాన్‌లో గాల్లోకి లేపాడు.
 
  వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లిన ధావన్ కళ్లు చెదిరే రీతిలో దాన్ని అందుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య తొలి వికెట్‌కు నెలకొన్న 103 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత రెండు బంతుల వ్యవధిలోనే ఆమ్లా (3), పీటర్సన్ అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా 113 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత కలిస్, డివిలియర్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా... క్రమంగా బ్యాట్లు ఝుళిపించారు. ముఖ్యంగా జడేజాను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడారు. 39వ ఓవర్‌లో జహీర్, 47వ ఓవర్‌లో ఇషాంత్ రెండోసారి బౌలింగ్‌కు దిగినా ఈ జోడిని విడదీయలేకపోయారు. దీంతో సఫారీ జట్టు 181/3తో లంచ్‌కు వెళ్లింది.
 
 ఒకే ఒక్క వికెట్
 లంచ్ తర్వాత కలిస్, డివిలియర్స్ మరింత మెరుగ్గా ఆడారు. అద్భుతమైన షాట్లతో బౌండరీలు కొడుతూ వేగంగా పరుగులు రాబట్టారు. పేసర్లు రివర్స్ స్వింగ్ కోసం ప్రయత్నించినా లాభం లేకపోయింది. జడేజాను కుదురుకోనీయకుండా షాట్లు ఆడిన డివిలియర్స్ చివరకు షమీ బౌలింగ్‌లో ఓ ఫోర్, డబుల్‌తో అర్ధ సెంచరీ (87 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. లంచ్ తర్వాత తొలి గంటలో వీరిద్దరు 55 పరుగులు జోడించారు.
 
 
 చివరకు జడేజా ఈ జోడిని విడదీశాడు. 74వ ఓవర్ ఆఖరి బంతికి డివిలియర్స్ స్లిప్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కలిస్, డివిలియర్స్ మధ్య నాలుగో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. తర్వాత వచ్చిన డుమిని (82 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఎలాంటి తడబాటు లేకుండా ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. టీ విరామానికి కొద్ది ముందు కలిస్ 131 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. పేసర్లు వికెట్లు తీయలేకపోవడంతో పార్ట్‌టైమ్ బౌలర్ రోహిత్ కొన్ని ఓవర్లు వేశాడు. ఈ సెషన్ మొత్తం బౌలింగ్ చేసిన భారత్‌కు ఒక్క వికెట్ మాత్రమే దక్కింది.
 
 వర్షం అడ్డంకి
 టీ తర్వాత వికెట్లు తీసేందుకు ధోని.. బౌలర్లను తరచుగా మార్చి ప్రయోగించాడు. అయినా కూడా కలిస్, డుమిని ఆచితూచి ఆడారు. ఒకట్రెండు బౌండరీలు కొట్టినా ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌కే పరిమితమయ్యారు. కొత్త బంతిని తీసుకోకుండా ఓ ఎండ్‌లో జడేజాను కొనసాగించిన కెప్టెన్ రెండో ఎండ్‌లో రోహిత్‌ను తీసుకొచ్చాడు. ఈ వ్యూహం సత్ఫలితాన్నిచ్చింది. 104 ఓవర్‌లో జడేజా స్పిన్ మ్యాజిక్‌కు డుమిని బలయ్యాడు. ఈ ఇద్దరి మధ్య ఐదో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. సహచరులు వెనుదిరుగుతున్నా... కలిస్ మాత్రం ఒంటరిపోరాటం చేశాడు. స్టెయిన్ తొమ్మిది బంతులు ఎదుర్కొన్న తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌ను ఆపేశారు.
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 334 ఆలౌట్
 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: స్మిత్ (సి) ధావన్ (బి) జడేజా 47; పీటర్సన్ (సి) విజయ్ (బి) జడేజా 62; ఆమ్లా (బి) షమీ 3; కలిస్ బ్యాటింగ్ 78; డివిలియర్స్ (సి) కోహ్లి (బి) జడేజా 74; డుమిని ఎల్బీడబ్ల్యు (బి) జడేజా 28; స్టెయిన్ బ్యాటింగ్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (104.5 ఓవర్లలో 5 వికెట్లకు) 299.
 
 వికెట్లపతనం: 1-103; 2-113; 3-113; 4-240; 5-298.
 బౌలింగ్: జహీర్ 16-2-46-0; షమీ 19-2-62-1; ఇషాంత్ 23-7-76-0; జడేజా 37-9-87-4; రోహిత్ 9.5-1-22-0.
 
 22 ఏళ్ల తర్వాత...
 భారత లెఫ్టార్మ్ స్పిన్నర్ ఒకరు ఉపఖండం బయట ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టడం 22 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కావడం విశేషం. 1992 జనవరిలో ఆస్ట్రేలియాతో రవిశాస్త్రి (4/45-సిడ్నీలో)
 ఈ గణాంకాలు నమోదు చేశాడు.
 
 2 మరో రెండు పరుగులు చేస్తే కలిస్ సొంతగడ్డపై 7 వేల పరుగులు పూర్తవుతాయి. స్వదేశంలో ఏడువేల పరుగులు చేసిన పాంటింగ్ (7578), సచిన్ (7216)ల సరసన కలిస్ చేరతాడు.
 
 ‘భారత గడ్డపై మాత్రమే బంతిని తిప్పగలనని నాపై విమర్శలున్నాయి. అయితే దక్షిణాఫ్రికాలో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయాలనేది నా కోరిక. ఆదివారం మరో వికెట్ తీసి ఇక్కడా స్పిన్ చేయగలనని నిరూపించి విమర్శకులకు సమాధానమిస్తా. పిచ్‌పై కొన్ని చోట్ల బంతి బాగా టర్న్ అయింది. దానిని ఉపయోగించుకున్నాను. నేరుగా వికెట్లపైకి బౌలింగ్ చేసి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగా. భారత్‌తో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు భిన్నం. కాబట్టి తుది జట్టులో ఒక స్పిన్నర్ ఉంటే చాలు’    
 - రవీంద్ర జడేజా, భారత బౌలర్
 
 దక్షిణాఫ్రికా తరఫున ముగ్గురు ఆటగాళ్లు (వాండర్ బిల్, లీ ఇర్విన్, బారీ రిచర్డ్స్) తమ చివరి టెస్టుల్లో సెంచరీలు చేశారు. కలిస్ ఈ మైలురాయిని అందుకుంటే నాలుగో క్రికెటర్ అవుతాడు.
 
 సెషన్-1 ఓవర్లు: 37; పరుగులు: 99; వికెట్లు: 3
 
 సెషన్-2 ఓవర్లు: 32; పరుగులు: 86; వికెట్లు: 1
 
 సెషన్-3 ఓవర్లు: 15.5; పరుగులు: 32; వికెట్లు: 1
 
 కలిస్‌కు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’
 డర్బన్: కెరీర్‌లో ఆఖరి టెస్టు ఆడుతున్న జాక్ కలిస్‌కు మూడో రోజు సముచిత గౌరవం దక్కింది. ఈ ‘నాలుగో నంబర్’ దిగ్గజ క్రికెటర్ క్రీజులోకి అడుగు పెట్టినప్పుడు భారత క్రికెట్ జట్టు సభ్యులు ‘గార్డ్ ఆఫ్ ఆనర్’తో గౌరవించారు. కెప్టెన్ ధోని ముందుకొచ్చి కలిస్‌కు షేక్ హ్యాండ్‌తో స్వాగతం పలికాడు. భారత ఆటగాళ్లతో పాటు అంపైర్లు కూడా కలిస్‌ను అభినందించారు. కింగ్స్‌మీడ్ మైదానం మొత్తం ‘కింగ్ కలిస్’ బ్యానర్లతో నిండిపోయింది.
 

>
మరిన్ని వార్తలు