కోహ్లి సెంచరీ.. భారీ స్కోర్‌ దిశగా టీమిండియా

11 Oct, 2019 12:29 IST|Sakshi

ఈ ఏడాది తొలి టెస్టు సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లి

పుణే : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి (104 బ్యాటింగ్‌; 183 బంతుల్లో16 ఫోర్లు) శతకం సాధించాడు. కోహ్లికి తోడు అజింక్యా రహానే (58 బ్యాటింగ్‌; 161 బంతుల్లో 8ఫోర్లు) అర్దసెంచరీతో రాణిచండంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. 273/3 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లి, రహానేలు నిలకడగా ఆడుతున్నారు. తొలుత ఆచితూచి ఆడిన కోహ్లి.. అనంతరం తన బ్యాట్‌ ఝుళిపించాడు. దీంతో స్కోర్‌ బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు రహానే చాలా నెమ్మదిగా ఆడుతూ కోహ్లికి అండగా నిలుస్తున్నాడు. 

ఈ క్రమంలో ఫిలాండర్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి కోహ్లి శతకం పూర్తి చేశాడు. ఇది కోహ్లికి 26వ టెస్టు సెంచరీ కాగా.. సారథిగా 19వది కావడం విశేషం. అంతేకాకుండా స్వదేశంలో దక్షిణాఫ్రికాపై కోహ్లికి ఇదే తొలి టెస్టు సెంచరీ.. కాగా, ఇక ఈ ఏడాది(2019)లో ఇదే  తొలి టెస్టు శతకం కావడం విశేషం. ఇక టెస్టుల్లో దక్షిణాఫ్రికాపై నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడిగా కోహ్లి- రహానేలు సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగులు(145) చేసిన జోడిగా ద్రవిడ్‌-గంగూలీ పేరిట ఉన్న రికార్డును తాజాగా కోహ్లి-రహానేలు బ్రేక్‌ చేశారు.  ప్రస్తుతం లంచ్‌ విరామం వరకు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. 

>
మరిన్ని వార్తలు