'డబుల్‌' సిక్సర్‌...

4 Dec, 2017 04:01 IST|Sakshi

విరాట్‌ మరో డబుల్‌ సెంచరీ

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ద్విశతకం

భారత్‌ 536/7 డిక్లేర్డ్‌  ∙ శ్రీలంక 131/3

మూడో టెస్టుపై భారత్‌ ఆదిపత్యం  

కోహ్లి డబుల్‌ సెంచరీ, రోహిత్‌ సమయోచిత ఇన్నింగ్స్, షమీ, ఇషాంత్‌ అద్భుత బౌలింగ్, లంకను ఆదుకున్న మాథ్యూస్‌... ఇవీ మైదానంలో చివరి టెస్టు రెండో రోజు ఆటలో విశేషాలు. అయితే ఆటలో అరటి పండులా మ్యాచ్‌పై ఢిల్లీ కాలుష్యం దెబ్బ... ముఖానికి మాస్క్‌లతో బరిలోకి దిగిన శ్రీలంక క్రికెటర్లు... కనీసం 11 మంది మైదానంలో లేక చివరకు సహాయక సిబ్బందిని సన్నద్ధం చేయడం... వాద ప్రతివాదాలు, భారత ఆటగాళ్ల అసహనం, బయట నుంచి లంకపై అభిమానుల ఆగ్రహం, అంపైర్ల జోక్యం, తీవ్రమైన చర్చోపచర్చలు... ఇదీ ఫిరోజ్‌ షా కోట్లాలో రెండో రోజు పరిస్థితి.

 భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో 1932 నుంచి 2015 మధ్య 83 ఏళ్ల కాలంలో కేవలం నలుగురు భారత కెప్టెన్లు మాత్రమే ఒక్కో డబుల్‌ సెంచరీ సాధించగలిగారు. కానీ విరాట్‌ కోహ్లి మాత్రం నాయకుడిగా ముందుండి నడిపించడం అంటే ఏమిటో పదే పదే చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు అదే కోవలో అతను ఏకంగా ఆరో డబుల్‌ సెంచరీని బాది ఓవరాల్‌గా బ్రియాన్‌ లారా లాంటి దిగ్గజాన్ని దాటి అత్యధిక డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. కోహ్లి జోరు మొదలైన గత 17 నెలల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో మరే కెప్టెన్‌ కూడా డబుల్‌ సెంచరీ నమోదు చేయలేకపోవడం విరాట్‌ ఘనతను రెట్టింపు చేస్తోంది.
 
న్యూఢిల్లీ: శ్రీలంకతో జరుగుతున్న చివరి టెస్టులోనూ భారత్‌ ఆధిపత్యానికి ఎక్కడా లోటు రాలేదు. మ్యాచ్‌ రెండో రోజు వేగంగా పరుగులు సాధించిన భారత జట్టు, తర్వాత లంక బ్యాటింగ్‌ను దెబ్బ తీసి టెస్టుపై పట్టు బిగించింది. ఆదివారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్‌ (118 బంతుల్లో 57 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చండిమాల్‌ (25 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 371/4తో ఆట కొనసాగించిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 536 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. విరాట్‌ కోహ్లి (287 బంతుల్లో 243; 25 ఫోర్లు) డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకోగా, రోహిత్‌ శర్మ (102 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. లంక బౌలర్లలో సందకన్‌కు 4 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం లంక మరో 405 పరుగులు వెనుకబడి ఉంది.

కొనసాగిన జోరు...
తొలి రోజు ఆటలో ప్రదర్శించిన దూకుడును భారత్‌ ఆదివారం కూడా కొనసాగించింది. ఆరంభంలో స్పిన్నర్లు వేసిన తొలి ఆరు ఓవర్లలో రోహిత్‌ రెండు ఫోర్లు, సిక్సర్‌తో ధాటిని ప్రదర్శించగా, ఆ తర్వాత పేస్‌ బౌలింగ్‌లో కోహ్లి జోరు మొదలైంది. లక్మల్, గమగే వేసిన తర్వాతి ఆరు ఓవర్లలో వీరిద్దరు 32 పరుగులు రాబట్టారు. 195 పరుగుల వద్ద పెరీరా ఓవర్లో కోహ్లి ఎల్బీడబ్ల్యూ అవుట్‌ కోసం శ్రీలంక రివ్యూ చేసింది. అయితే బంతి బ్యాట్‌కు తగిలిందని తేలడంతో విరాట్‌కు సమస్య రాలేదు. కొద్ది సేపటికే లక్మల్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌వికెట్‌ దిశగా ఆడి రెండు పరుగులు తీసిన భారత కెప్టెన్‌... 238 బంతుల్లో డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పెరీరా బంతిని భారీ సిక్సర్‌ బాది రోహిత్‌ అర్ధసెంచరీని అందుకున్నాడు. అయితే సందకన్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన తర్వాత అదే ఓవర్లో రోహిత్‌ వెనుదిరగడంతో 135 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది.  

కోహ్లి బ్యాడ్‌లక్‌...
లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఫోర్‌తో కోహ్లి టెస్టుల్లో తన అత్యధిక స్కోరు (235)ను అధిగమించాడు. అయితే ఇదే సమయంలో ‘కాలుష్య విరామాలు’ భారత జట్టు లయను దెబ్బ తీశాయి. మొదట గమగే బౌలింగ్‌లో అశ్విన్‌ (4) వెనుదిరగగా... ఆ తర్వాత మరో విరామంలో కోహ్లి తన వికెట్‌ ఇచ్చుకున్నాడు. సందకన్‌ బౌలింగ్‌లో లోపలికి దూసుకొచ్చిన బంతిని ఫ్లిక్‌ చేయడంలో విరాట్‌ విఫలమయ్యాడు. దాంతో బంతి ప్యాడ్లకు తగలడంతో అంపైర్‌ అవుట్‌గా నిర్ధారించారు. కోహ్లి రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అప్పటి వరకు ఏమాత్రం శ్రమ లేకుండా అలవోకగా పరుగులు సాధిస్తున్న కోహ్లి సునాయాసంగా ట్రిపుల్‌ సెంచరీ సాధిస్తాడని అనిపించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ అవకాశం చేజారింది. మరికొద్ది సేపటికే లంక ఫీల్డింగ్‌ ఇబ్బందిని గమనించిన కోహ్లి... భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసేందుకు సిద్ధమైపోయాడు.  

తొలి బంతికే...
కొండలాంటి స్కోరు ముందుండగా బరిలోకి దిగిన శ్రీలంకకు తొలి బంతికే షాక్‌ తగిలింది. షమీ వేసిన చక్కటి బంతికే కరుణరత్నే (0) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కొద్దిసేపటికే ధనంజయ డి సిల్వా (1)ను ఇషాంత్‌ అవుట్‌ చేశాడు. అయితే సమరవిక్రమ స్థానంలో రెండో ఓపెనర్‌గా వచ్చిన దిల్‌రువాన్‌ పెరీరా (54 బంతుల్లో 42; 9 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. పెరీరా 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు లైఫ్‌ లభించింది. షమీ వేసిన బంతిని పెరీరా స్లిప్‌లోకి ఆడగా మొదటి స్లిప్‌లో పుజారాకు చక్కటి అవకాశం ఉండగా...రెండో స్లిప్‌ నుంచి పుజారాకు అడ్డంగా వచ్చిన ధావన్‌ దానిని పట్టుకోలేక వదిలేశాడు.

బంతి మైదానంలో ఉన్న హెల్మెట్‌కు కూడా తగలడంతో లంకకు ఐదు పెనాల్టీ పరుగులు లభించాయి. ఆ వెంటనే ఇషాంత్‌ బౌలింగ్‌లో మాథ్యూస్‌ (6 పరుగుల వద్ద) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను స్లిప్‌లో కోహ్లి వదిలేయగా... ఇషాంత్‌ తర్వాతి ఓవర్లోనే మాథ్యూస్‌ మూడు బౌండరీలు బాది చిరునవ్వులు చిందించాడు! చివరకు పెరీరాను జడేజా ఎల్బీగా అవుట్‌ చేయడంతో 61 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత అశ్విన్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి మాథ్యూస్‌ తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా మరో వికెట్‌ తీయలేకపోయారు.  

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: విజయ్‌ (సి) డిక్‌వెలా (బి) సందకన్‌ 155; ధావన్‌ (సి) లక్మల్‌ (బి) పెరీరా 23; పుజారా (సి) సమరవిక్రమ (బి) గమగే 23; కోహ్లి (ఎల్బీ) (బి) సందకన్‌ 243; రహానే (స్టంప్డ్‌) డిక్‌వెలా (బి) సందకన్‌ 1; రోహిత్‌ (సి) డిక్‌వెలా (బి) సందకన్‌ 65; అశ్విన్‌ (సి) పెరీరా (బి) గమగే 4; సాహా (నాటౌట్‌) 9; జడేజా (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (127.5 ఓవర్లలో 7 వికెట్లకు డిక్లేర్డ్‌) 536.  

వికెట్ల పతనం: 1–42; 2–78; 3–361; 4–365; 5–500; 6–519; 7–523.  

బౌలింగ్‌: లక్మల్‌ 21.2–2–80–0; గమగే 25.3–7–95–2; పెరీరా 31.1–0–145–1; సందకన్‌ 33.5–1–167–4; డి సిల్వా 16–0–48–0.  

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: కరుణరత్నే (సి) సాహా (బి) షమీ 0; పెరీరా (ఎల్బీ) (బి) జడేజా 42; డి సిల్వా (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 1; మాథ్యూస్‌ (బ్యాటింగ్‌) 57; చండిమాల్‌ (బ్యాటింగ్‌) 25; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (44.3 ఓవర్లలో 3 వికెట్లకు) 131.  

వికెట్ల పతనం: 1–0; 2–14; 3–75.

బౌలింగ్‌: షమీ 11–3–30–1; ఇషాంత్‌ 10–4– 44–1; జడేజా 14.3–6–24–1; అశ్విన్‌ 9–3–28–0.   

కోహ్లి కెరీర్‌లో ఇది ఆరో డబుల్‌ సెంచరీ. కెప్టెన్‌గా ఆరు డబుల్‌ సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా అతను వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా (5 డబుల్‌ సెంచరీలు)ను అధిగమించాడు. భారత్‌ తరఫున అత్యధిక (6) డబుల్‌ సెంచరీలు సాధించిన సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ రికార్డును కూడా కోహ్లి సమం చేశాడు.  
 
టెస్టుల్లో వరుసగా రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన ఆరో ప్లేయర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. గతంలో వాలీ హామండ్‌ (ఇంగ్లండ్‌; 1928, 1933లో) రెండుసార్లు ఈ ఘనత సాధించగా... డాన్‌ బ్రాడ్‌మన్‌ (ఆస్ట్రేలియా–1934లో), వినోద్‌ కాంబ్లీ (భారత్‌–1993లో), కుమార సంగక్కర (శ్రీలంక–2007లో), మైకేల్‌ క్లార్క్‌ (ఆస్ట్రేలియా–2012లో) ఒక్కోసారి ఇలా చేశారు.  
 
వినూ మన్కడ్‌ (1955) తర్వాత ఒకే సిరీస్‌లో రెండు డబుల్‌ సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. విరాట్‌ వరుసగా రెండేళ్ల పాటు మూడేసి ద్విశతకాలు సాధించడం విశేషం.   

మరిన్ని వార్తలు