ఎక్కడ కొట్టింది తేడా?

7 Dec, 2017 00:41 IST|Sakshi

సాక్షి క్రీడావిభాగం: మూడో టెస్టు డ్రాకు కారణమేంటి..? లంక బ్యాట్స్‌మెన్‌ పోరాట పటిమా..? భారత బౌలర్ల (ప్రత్యేకించి స్పిన్నర్లు) వైఫల్యమా..? మన ఖాతాలో మరో విజయం చేరకపోవడానికి లోపం ఎక్కడుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం బౌలింగ్‌ను విశ్లేషించడమే..! నాలుగో రోజే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు పడగొట్టి... విజయానికి బాటలు వేసుకుని... పిచ్, వాతావరణ పరిస్థితులు అనుకూలించి... కావల్సినన్ని ఓవర్లు అందుబాటులో ఉన్నా చివరి రోజు లంక రెండో ఇన్నింగ్స్‌ను చుట్టేయలేకపోవడం మన బౌలర్ల వైఫల్యమే. మరీ ముఖ్యంగా స్పిన్నర్లను వేలెత్తి చూపాల్సిన పరిస్థితి. అంతమాత్రాన లంక బ్యాట్స్‌మెన్‌ ధనంజయ డిసిల్వా, రోషన్‌ సిల్వా, డిక్‌వెలాల ప్రదర్శనను విస్మరించలేం. ఫిరోజ్‌ షా కోట్లా వంటి స్పిన్నర్లకు స్వర్గధామమైన పిచ్‌పై భారత బౌలింగే స్థాయికి తగ్గట్లు లేదనుకోవాలి. వాస్తవానికి బుధవారం 87 ఓవర్ల ఆట సాగింది. ఈ లెక్కన రోజులో దాదాపు మొత్తం ఓవర్లు వేసినట్లే. ఇందులో అశ్విన్‌ 30, జడేజా 33 ఓవర్లు వేశారు. అంటే.. సుమారు 80 శాతం బౌలింగ్‌ వారే చేశారు. అయినా సాధించింది చెరో వికెట్టే. ఇందులోనూ చండిమాల్‌ ముందుకొచ్చి ఆడి అనవసరంగా అశ్విన్‌కు వికెట్‌ ఇచ్చాడు. జడేజా... మాథ్యూస్‌ను అవుట్‌ చేసినా అది నోబాల్‌. అయితే రివ్యూకు వెళ్లకపోవడంతో వికెట్‌ లభించింది. దీనిప్రకారం చూస్తే పడిన రెండు వికెట్లలోనూ బౌలర్ల ప్రతిభ లేదు. ఒకట్రెండు మంచి అవకాశాలు చేజారడం ఆటలో సహజం. వాటి కారణంగానే ఫలితం రాలేదని నిందించలేం. మేటి బ్యాట్స్‌మెన్‌ ఉన్న ఆసీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లనే అయిదో రోజు కుదురుకోనీయకుండా చేసి, రెండు సెషన్లలోపే ముగించిన అశ్విన్, జడేజాలకు ఇది నిజంగా ‘టెస్టు’ సమయమే. ఓవైపు తొలుత విశ్రాంతి అని చెప్పి నెమ్మదిగా టి20లు, వన్డేల నుంచి తప్పించిన వైనం.. మరోవైపు చహల్‌ వంటి లెగ్‌ స్పిన్నర్‌ను టెస్టుల్లోనూ ఆడించాలన్న వ్యాఖ్యలు, వైవిధ్యం చూపే కుల్దీప్‌లాంటివారు తుది జట్టులో తప్పక ఉండాలన్న అంచనాలు.. అక్షర్‌ పటేల్‌ వంటి లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ను ఎంపిక చేయాలన్న విశ్లేషణల మధ్య... సీనియర్‌ స్పిన్‌ ద్వయం మేల్కొనాల్సిన సమయం వచ్చింది.

‘స్లిప్‌’ పారా‘హుషార్‌’...
‘క్యాచ్‌లే మ్యాచ్‌లను గెలిపిస్తాయి’ అనేది సంప్రదాయ నానుడి. మరీ ముఖ్యంగా టెస్టుల్లో స్లిప్‌ ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ ప్రదేశంలో ఎంత చురుగ్గా ఉంటే అంత ప్రయోజనం. ప్రస్తుత జట్టులో ‘స్లిప్‌ స్పెషలిస్ట్‌’ల కొరత కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో రహానేను గల్లీ ఏరియాలో ఉంచడం చర్చకు తావిచ్చింది. దాంతోపాటు విశ్లేషకులు కూడా జట్టులోని స్లిప్‌ స్పెషలిస్ట్‌లను సరిగ్గా వినియోగించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.  

రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఎదురయ్యేది పేస్‌ పిచ్‌లు. అలాంటిచోట స్లిప్‌లోకి దూసుకొచ్చే బంతిని అంతే ఒడుపుగా అందుకునే నైపుణ్యం అవసరం. విదేశాల్లోనూ జైత్రయాత్ర సాగించాలన్న ప్రణాళికల్లో ఉన్న కోహ్లి సేన ఈ విషయమై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు షార్ట్‌ లెగ్‌ ఫీల్డర్‌గా ఎవరిని ఉంచాలన్నదీ ఆలోచించాల్సిన విషయమే. ఇక దేశంలో నెంబర్‌ వన్‌ టెస్టు కీపర్‌గా పేరొందిన సాహా... కీలక సమయంలో స్టంపౌట్‌ అవకాశాన్ని వదిలేశాడు.  

కొసమెరుపు: ఢిల్లీ టెస్టుకు లంక మూడు మార్పులతో బరిలో దిగింది. ఈ కారణంగా జట్టులోకి వచ్చిన ధనంజయ డిసిల్వా, రోషన్‌ సిల్వాలే భారత్‌ విజయానికి అడ్డుగోడలా మారారు.  

>
మరిన్ని వార్తలు