వైజాగ్‌ మ్యాచ్‌.. టికెట్లు బ్లాక్‌లో అమ్మేశారా?

17 Dec, 2017 11:49 IST|Sakshi

22వేల టికెట్ల బ్లాక్‌లో అమ్మారని ఆరోపణలు

‘మీ-సేవ’లో టికెట్ల దొరకకపోవడంతో అభిమానుల ఆగ్రహం

వైజాగ్‌ వైఎస్సార్‌ స్టేడియం వద్ద అభిమానుల కొలాహలం

సాక్షి, విశాఖపట్నం: ఉక్కునగరం విశాఖపట్నం వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య కీలక వన్డే మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇరుజట్లు చెరో వన్డే గెలిచి సమంగా ఉండటంతో సిరీస్‌ విజేతను తేల్చే ఈ మ్యాచ్‌ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో విశాఖలోని వైఎస్సార్‌ స్టేడియం వద్ద ఆదివారం ఉదయం నుంచి అభిమానుల కోలాహలం నెలకొంది. మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్‌-శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

అయితే, మూడు వన్డేల సిరీస్‌లో విజేత ఎవరో తేల్చే ఆఖరి వన్డే కావడంతో సహజంగానే ఈ వన్డేపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌ టికెట్లు కొనేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. అయితే, నేరుగా టికెట్లు దొరకకపోవడంతో అభిమానులు నిరాశచెందారు. ఈ మ్యాచ్‌ సంబంధించి పెద్ద ఎత్తున బ్లాక్‌ టికెట్లు అమ్మినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ మ్యాచ్‌ కోసం 27వేల టికెట్లను ‘మీ-సేవా’ ద్వారా అమ్మాల్సి ఉంది. కానీ, ఐదువేల టికెట్లు మాత్రమే ఇప్పటివరకు విక్రయించారు. మిగతా 22వేల టికెట్లు అధికారులు బ్లాక్‌ చేసి.. అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్లు దొరకకపోవడంతో క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైజాగ్‌ ఫేవరెట్‌ భారత్‌...
విశాఖపట్నంలో క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఠక్కున గుర్తొచ్చేది ధోనినే. ఇక్కడికి ఓ అనామకుడిగా వచ్చి అసాధారణ కెప్టెన్‌గా ఎదిగిన వైనం మనకందరికీ తెలుసు. ‘ఈ చరిత్ర ఏ సిరాతో’ అన్నట్లు ‘అతని భవిత ఈ వేదికతో’ మారిపోయింది. అంతేకాదు అతనితో పాటు చాలా మంది ఆటగాళ్లకు అచ్చొచ్చిన స్టేడియం ఇది. పైగా టీమిండియాకు ఫేవరెట్‌ వేదిక కూడా. ఇక్కడ ఏడు మ్యాచ్‌లాడిన భారత్‌ ఐదింట గెలిచి, ఒక్కసారే ఓడింది. మరో మ్యాచ్‌ రద్దయింది. దీంతో ఇక్కడ జరిగే నిర్ణాయక మూడో మ్యాచ్‌లో తమ ‘ఫేవరెట్‌ ఇజం’తో లంకను ఓడించి సిరీస్‌ను గెలవాలని భావిస్తోంది టీమిండియా. రెండేళ్లుగా సొంతగడ్డపై భారత్‌ రికార్డు అజేయంగా ఉంది. 2015 అక్టోబర్‌ తర్వాత భారత్‌ ఒక్క సిరీస్‌ను కోల్పోలేదు. అన్నీ  చేజిక్కించుకుంది.

ఫామ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మెన్‌...
తొలి మ్యాచ్‌లో ఒక్క ధోని మినహా మూకుమ్మడిగా విఫలమైన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ మొహలీలో కదంతొక్కారు. కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్, మరో ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ ధావన్, కొత్త కుర్రాడు శ్రేయస్‌ అయ్యర్‌ పిచ్‌ పరిస్థితుల్ని చక్కగా ఆకలింపు చేసుకొని చెలరేగారు. టాపార్డర్‌ అంతా ఫామ్‌లోకి రావడంతో భారత్‌ ఇక్కడ కూడా మరో భారీ స్కోరును ఆశిస్తోంది. రెండో వన్డేలో ధోని, పాండ్యా ఇన్నింగ్స్‌ చివర్లో తక్కువ పరుగులకే నిష్క్రమించినా... అదేమంతా కలవరపెట్టే అంశం కాదు. ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన సమయంలో ధోని ఎంత చురుగ్గా వ్యవహరిస్తాడో అందరికీ తెలుసు. ఇక బౌలింగ్‌లో భువీ, బుమ్రా తమ సత్తాను పూర్తిస్థాయిలో బయటపెట్టలేదు. ఒకట్రెండు వికెట్లు తీసినప్పటికీ కీలకమైన నిర్ణాయక పోరులో ఇదే మాత్రం సరిపోదు. ఆరంభంలో, డెత్‌ ఓవర్లలో తమ జోరు చాటితే మిగతా పనిని చహల్, హార్దిక్‌ పాండ్యాలు చూసుకుంటారు.  


పిచ్, వాతావరణం
ఎపుడైనా సరే విశాఖ పిచ్‌ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు సమాన అవకాశాలిస్తుంది. బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లకు ఇది మంచి వికెట్‌. ధర్మశాల, మొహాలీలతో పోల్చుకుంటే ఇది కోస్తా ప్రాంతం కాబట్టి శ్రీలంకకు కొలంబోను తలపించవచ్చు. వర్షం ముప్పు లేదు.

జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ధావన్, శ్రేయస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తీక్, మనీశ్‌ పాండే, ధోని, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్‌/సుందర్‌.
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్‌), గుణతిలక, తరంగా, సమరవిక్రమ, మాథ్యూస్, డిక్‌వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, నువాన్‌ ప్రదీప్‌.

► మధ్యాహ్నం 1.30 గంటల నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

మరిన్ని వార్తలు