ధావన్, రహానే మెరుపులు

24 Jun, 2017 00:38 IST|Sakshi
ధావన్, రహానే మెరుపులు

అర్ధ సెంచరీలతో ఓపెనర్ల హవా
► భారత ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం
► వెస్టిండీస్‌తో తొలి వన్డే  


పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: కరీబియన్‌ పర్యటనలోనూ భారత జట్టును వర్షం వీడలేదు. చాంపియన్స్‌ ట్రోఫీలాగానే ఇక్కడా వరుణుడు తన ‘సత్తా’ చూపాడు. వెస్టిండీస్‌తో శుక్రవారం ఇక్కడి క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానంలో జరిగిన తొలి వన్డేలో శిఖర్‌ ధావన్‌ (92 బంతుల్లో 87; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రహానే (78 బంతుల్లో 62; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో అదరగొట్టారు.

అయితే 38 ఓవర్ల అనంతరం దాదాపు గంటపాటు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత ఆట ఆరంభమైనా మరో ఎనిమిది బంతులకే భారీ వర్షం కురవడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ సాధ్యం కాలేదు. అప్పటికి టీమిండియా 39.2 ఓవర్లలో మూడు వికెట్లకు 199 పరుగులు చేసింది. కోహ్లి (32 నాటౌట్‌; 1 ఫోర్‌) రాణించాడు.  

ఓపెనర్లు అదుర్స్‌
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అజింక్యా రహానే, శిఖర్‌ ధావన్‌ అద్భుత ఆరంభాన్ని అందించారు. తమ చివరి నాలుగు ఇన్నింగ్స్‌లో 83, 125, 56, 112 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన ఈ జోడి ఈ మ్యాచ్‌లోనూ అదరగొట్టింది. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో ఓపెనర్‌గా తుది జట్టులో చోటు దక్కించుకున్న రహానే... తనకు లభించిన అవకాశాన్ని సొమ్ము చేసుకున్నాడు. ఆరంభంలో కుదురుకునేందుకు సమయం తీసుకున్నా ఆ తర్వాత జోరు కనబరిచాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అడపాదడపా ఫోర్లు బాదుతూ వీరిద్దరూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఇదే జోరుతో రహానే 67 బంతుల్లో ఓ చక్కటి బౌండరీతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

అటు ధావన్‌ ఓ భారీ సిక్సర్‌తో 63 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. అయితే ఆత్మవిశ్వాసంతో దూసుకెళుతున్న ఈ జోడిని జోసెఫ్‌ విడదీశాడు. మిడ్‌ ఆన్‌లో హోల్డర్‌ పట్టిన క్యాచ్‌తో రహానే ఇన్నింగ్స్‌ ముగిసింది. అప్పటికి తొలి వికెట్‌కు 132 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొంది. అనంతరం విండీస్‌ బౌలర్లు బంతిపై పట్టు సాధించడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ కాస్త తడబడింది.  

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రహానే (సి) హోల్డర్‌ (బి) జోసెఫ్‌ 62; శిఖర్‌ ధావన్‌ ఎల్బీడబ్లు్య (బి) బిషూ 87; కోహ్లి నాటౌట్‌ 32; యువరాజ్‌ (సి) లూయిస్‌ (బి) హోల్డర్‌ 4; ధోని నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (39.2 ఓవర్లలో మూడు వికెట్లకు) 199.
వికెట్ల పతనం: 1–132, 2–168, 3–185.
బౌలింగ్‌: హోల్డర్‌ 8–0–34–1; జోసెఫ్‌ 8–0–53–1; నర్స్‌ 4–1–22–0; కమిన్స్‌ 8–0–46–0; బిషూ 10–0–39–1; కార్టర్‌ 1.2–0–5–0.

విండీస్‌ గడ్డపై వన్డేల్లో భారత్‌ తరఫున తొలి వికెట్‌కు మూడు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు కాగా... ఇవన్నీ క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానంలోనే రావడం విశేషం.

మరిన్ని వార్తలు