నిలవాలంటే గెలవాలి

18 Dec, 2019 01:31 IST|Sakshi
నెట్‌ ప్రాక్టీస్‌ సెషన్‌లో రిషభ్‌ పంత్‌

సిరీస్‌ కాపాడుకునే ప్రయత్నంలో టీమిండియా

నేడు వెస్టిండీస్‌తో రెండో వన్డే

విశాఖపట్నం వేదికగా పోరు

మరో విజయంపై విండీస్‌ కన్ను

భారత జట్టు సొంతగడ్డపై ఎప్పుడో 15 ఏళ్ల క్రితం వరుసగా రెండు వన్డే సిరీస్‌లు ఓడిపోయింది. స్వదేశంలో గతంలో ఎప్పుడూ వరుసగా ఐదు వన్డేలు ఓడిన పరాభవం కూడా ఎప్పుడూ ఎదుర్కోలేదు. కానీ విశాఖ వేదికగా రెండో మ్యాచ్‌లో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోతే మాత్రం ఈ రెండు చెత్త రికార్డులు మన ఖాతాలో చేరతాయి.

ఈ ఏడాది ఆరంభంలో ఆ్రస్టేలియా చేతిలో వరుసగా మూడు వన్డేలు ఓడి సిరీస్‌ కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు వెస్టిండీస్‌కు ఆ అవకాశం ఇవ్వరాదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రెండో వన్డేకు రంగం సిద్ధమైంది. భారత్‌కు అచ్చొచ్చిన వేదికల్లో వైజాగ్‌ ఒకటి కాగా... ఇక్కడ ఎదురైన ఏకైక పరాజయం విండీస్‌ చేతిలోనే కావడం గమనార్హం.   

సాక్షి, విశాఖపట్నం: వెస్టిండీస్‌పై టి20 సిరీస్‌ గెలుచుకున్న తర్వాత చెన్నై వన్డేలో అనూహ్య పరాజయం భారత్‌ను నేలకు దించింది. గత మ్యాచ్‌లో టాపార్డర్‌ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న కోహ్లి సేన ఇప్పుడు పట్టుదలగా తర్వాతి సమరానికి సిద్ధమైంది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా నేడు జరిగే పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలిచే స్థితిలో టీమిండియా ఉండగా... మరో దూకుడైన విజయంతో 2002 తర్వాత భారత గడ్డపై వన్డే సిరీస్‌ను అందుకోవాలని పొలార్డ్‌ బృందం పట్టుదలతో ఉంది.  

చహల్‌కు చోటు!
చెన్నైలాంటి నెమ్మదైన పిచ్‌పై 288 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్‌ విఫలమైంది. భారత బ్యాటింగ్‌ పటిష్టంగానే ఉన్నా... బౌలింగ్‌ వైఫల్యం విండీస్‌ పనిని సులువు చేసింది. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌కంటే ఒక స్పెషలిస్ట్‌ బౌలర్‌ అదనంగా జట్టులో ఉంటే మంచిదని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. భిన్నమైన బంతులతో ప్రత్యర్థిని దెబ్బ తీయగల యజువేంద్ర చహల్‌పై అందరి దృష్టీ నిలిచింది. గత మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా కలిసి పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో ఈ లెగ్‌ స్పిన్నర్‌కు అవకాశం దక్కవచ్చు. అదే జరిగితే శివమ్‌ దూబే, జడేజాలలో ఒకరిని పక్కన పెట్టే అవకాశం ఉంది. చెన్నై మ్యాచ్‌లో దూబే ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి విఫలమయ్యాడు. బౌలింగ్‌లోనూ రాణించలేకపోయాడు.

ఇక షమీ, దీపక్‌ చాహర్‌ కూడా మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. బౌలింగ్‌లో కేదార్‌ జాదవ్‌ ప్రత్యేకత చూపించకపోయినా అతను చేసిన కీలక పరుగులు జట్టులో స్థానానికి ఢోకా లేకుండా చేశాయి. సుదీర్ఘ కాలం తర్వాత భారత టాప్‌–3 బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడం చెన్నై మ్యాచ్‌లోనే జరిగింది. విశాఖలో అద్భుత రికార్డు ఉన్న కోహ్లి, రోహిత్‌లలో ఏ ఒక్కరు చెలరేగినా విండీస్‌కు కష్టాలు తప్పవు. రెండో ఓపెనర్‌గా రాహుల్‌ బాగా ఆడుతున్నాడు కాబట్టి మయాంక్‌ అగర్వాల్‌కు ప్రస్తుతానికి అవకాశం లేదు. యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్‌ రాణించడం భారత్‌కు శుభసూచకం. తొలి వన్డేలో ఓటమి పలకరించినా ఓవరాల్‌గా భారత జట్టు పటిష్టంగానే ఉంది. అందరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గెలుపు కష్టం కాకపోవచ్చు.  

లూయిస్‌ పునరాగమనం!
సిరీస్‌లో శుభారంభం చేయడం వెస్టిండీస్‌ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచిందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా హెట్‌మైర్, షై హోప్‌ బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకొని వీరిద్దరు బాగా ఆడి 218 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం అందరి ప్రశంసలకు కారణమైంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే వైజాగ్‌ వేదికపై వీరిద్దరు చక్కటి ఇన్నింగ్స్‌లతో తమ జట్టును ఓటమి నుంచి కాపాడి మ్యాచ్‌ను ‘టై’గా ముగించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చెలరేగితే భారత బౌలర్లు ఇబ్బంది పడాల్సిందే.

హెట్‌మైర్‌,షై హోప్‌

పూరన్, పొలార్డ్‌లతో జట్టు బ్యాటింగ్‌ మరింత బలంగా కనిపిస్తోంది. మరో భారీ హిట్టర్‌ ఎవిన్‌ లూయిస్‌ గాయం నుంచి కోలుకుంటే అతను ఆంబ్రిస్‌ స్థానంలో జట్టులోకి వస్తాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన విశాఖ పిచ్‌పై పేసర్లు కాట్రెల్, జోసెఫ్, హోల్డర్‌ ఎలా ప్రత్యర్థిని నిలువరిస్తారనేది ఆసక్తికరం. స్పిన్నర్లు  వాల్ష్, ఛేజ్‌ కూడా గత మ్యాచ్‌లో మెరుగ్గానే బౌలింగ్‌ చేశారు. అయితే మొత్తంగా చూస్తే విండీస్‌ విజయరహస్యం, బలమంతా ఆ జట్టు విధ్వంసక బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉంది. కాబట్టి బ్యాట్స్‌మెన్‌ చెలరేగితే చిరస్మరణీయ సిరీస్‌ వారి ఖాతాలో చేరవచ్చు.   విండీస్‌ మాజీ క్రికెటర్‌ బాసిల్‌ బుచర్‌ (86 ఏళ్లు) మృతికి సంతాపంగా నేటి మ్యాచ్‌లో విండీస్‌ క్రికెటర్లు చేతికి నల్ల బ్యాడ్జిలు ధరించి ఆడతారు.

తుది జట్ల వివరాలు (అంచనా)  
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, రాహుల్, అయ్యర్, పంత్, జాదవ్, జడేజా, దూబే/చహల్, చాహర్, షమీ, కుల్దీప్‌.

విండీస్‌: పొలార్డ్‌ (కెపె్టన్‌), షై హోప్, ఆంబ్రిస్‌/లూయిస్, హెట్‌మైర్, పూరన్, ఛేజ్, హోల్డర్, కీమో పాల్, వాల్ష్, జోసెఫ్, కాట్రెల్‌.

పిచ్, వాతావరణం

పిచ్‌ను పరిశీలిస్తున్న జడేజా, ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌

బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. అయితే డిసెంబర్‌ మాసం కావడంతో రాత్రి మంచు ప్రభావంతో బౌలర్లకు పట్టు చిక్కడం కష్టంగా మారిపోవచ్చు. దీంతో పాటు ఛేదననే ఇరు జట్లు ఇష్టపడుతున్నాయి కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవడం లాంఛనమే. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు