మార్పులు చేర్పులతో...

6 Aug, 2019 05:07 IST|Sakshi

మూడో టి20కి భారత్‌ సిద్ధం

నేడు వెస్టిండీస్‌తో తుది పోరు

అమితోత్సాహంతో కోహ్లి సేన

పరువు కోసం విండీస్‌ ప్రయత్నం

రాత్రి 8 గంటల నుంచి సోనీ టెన్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

అమెరికా వేదికగా రెండు టి20 మ్యాచ్‌ల క్రికెట్‌ సంబరం తర్వాత ఇప్పుడు పోరు విండీస్‌ గడ్డకు చేరింది. వరుస విజయాలతో ఇప్పటికే సిరీస్‌ నెగ్గి ఊపు మీదున్న టీమిండియా క్లీన్‌స్వీప్‌పై కన్నేస్తే... కనీసం సొంత మైదానంలోనైనా గెలుపు అందుకొని పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్‌ ఆశిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల తర్వాత కుర్రాళ్లకు భారత తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరో వైపు రెండు సార్లు వరల్డ్‌ కప్‌ గెలిచినా... అతి ఎక్కువ మ్యాచ్‌లు ఓడిన చెత్త రికార్డు మూటగట్టుకున్న బ్రాత్‌వైట్‌ బృందం ఈ సారైనా తమ స్థాయికి తగినట్లుగా ఆడుతుందా చూడాలి.  

జార్జ్‌టౌన్‌ (గయానా): పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌ను మట్టికరిపించిన భారత్‌ మరో విజయంతో ముగింపు ఇచ్చేందుకు సన్నద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడి ప్రావిడెన్స్‌ స్టేడియంలో చివరి మ్యాచ్‌ జరుగుతుంది. భారత్‌ ఇప్పటికే 2–0తో సిరీస్‌ గెలుచుకుంది. భారత్‌ చేతిలో వరుసగా ఐదు టి20లలో ఓడిన విండీస్‌ ఒక్క విజయం కోసం తపిస్తోంది.  

చహర్‌ బ్రదర్స్‌కు చాన్స్‌!
తొలి రెండు టి20ల్లో ఒకే జట్టుతో ఆడిన భారత్‌... బెంచీకే పరిమితమైన మిగిలిన నలుగురికి కూడా ఒకేసారి చాన్స్‌ ఇవ్వాలని భావిస్తోంది. సిరీస్‌ ఇప్పటికే సొంతమైన నేపథ్యంలో కొత్త కుర్రాళ్లు తమ సత్తా చాటుకునేందుకు ఇది మంచి అవకాశం. పైగా ఐపీఎల్‌ కారణంగా ఈ ఫార్మాట్‌లో మన ఆటగాళ్లు రాటుదేలారు కాబట్టి జట్టు కూర్పు మారినా టీమ్‌ పటిష్టంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ‘చహర్‌ బ్రదర్స్‌’ మ్యాచ్‌లో ఆడేందుకు ఎదురు చూస్తున్నారు. పేసర్‌ దీపక్‌ చహర్‌ భారత్‌ తరఫున ఒకే ఒక్క టి20 ఆడగా, లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ ఇప్పటి వరకు అరంగేట్రం చేయలేదు.

ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా జట్టులోకి ఎంపికైన రాహుల్‌ ఎలాగూ వన్డే టీమ్‌లో లేడు కాబట్టి ఈ మ్యాచ్‌లో ఆడించవచ్చు. పైగా కెప్టెన్‌ కోహ్లి పదే పదే చెబుతున్నట్లు వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచ కప్‌ కోసం సరైన జట్టును తయారు చేసేందుకు కూడా ఈ మ్యాచ్‌లను భారత్‌ ఉపయోగించుకోనుంది. కేఎల్‌ రాహుల్‌ను పంత్‌ స్థానంలో ఆడించే అవకాశం ఉంది. ఇక చాలా రోజులుగా సరైన చాన్స్‌ లభించని శ్రేయస్‌ అయ్యర్‌ను బరిలోకి దించవచ్చు. వీరంతా కాకుండా కోహ్లి, రోహిత్, ధావన్, భువనేశ్వర్‌లాంటి ప్రధాన ఆటగాళ్లతో జట్టు తిరుగులేనిదిగా కనిపిస్తోంది. తాజా ఫామ్‌ ప్రకారం చూస్తే మరో విజయం భారత్‌కు కష్టం కాకపోవచ్చు.  

గెలిపించేదెవరు?  
టి20 లీగ్‌లో విధ్వంసక ఆటతో చెలరేగిపోయే వెస్టిండీస్‌ క్రికెటర్లు అంతర్జాతీయ పోరుకు వచ్చేసరికి మాత్రం పేలవంగా మారిపోయారు. తొలి మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్‌ ప్రదర్శనతో వంద పరుగులు కూడా చేయలేకపోయిన ఆ జట్టు రెండో మ్యాచ్‌లో కూడా పేలవ రన్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేసి మ్యాచ్‌ను చేజార్చుకుంది. రావ్‌మన్‌ పావెల్‌ అర్ధసెంచరీ చేసినా, పూరన్‌ నెమ్మదైన బ్యాటింగ్‌ జట్టును దెబ్బ తీసింది. భారత స్పిన్నర్లు సుందర్, కృనాల్‌లను ఎదుర్కోవడంలో ఆ జట్టు విఫలమైంది. జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న హెట్‌మైర్‌ పెద్దగా ఆకట్టుకోలేదు. మొదటి మ్యాచ్‌లో బాగా ఆడిన పొలార్డ్‌ గత మ్యాచ్‌లో క్రీజ్‌లోకి వచ్చే సరికే పరిస్థితి చేయిదాటిపోయింది. పేరుకు బ్యాటింగ్‌ లైనప్‌లో అంతా దూకుడైన ఆటగాళ్లే కనిపిస్తున్నా ఆశించిన మెరుపులు మాత్రం రాలేదు. ముఖ్యంగా కెప్టెన్‌ బ్రాత్‌వైట్‌నుంచి విండీస్‌ అభిమానులు ఒక దూకుడైన ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. బ్యాటింగ్‌తో పోలిస్తే జట్టు బౌలింగ్‌ కొంత మెరుగ్గా ఉండటం ఊరట.  

తుది జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి, రోహిత్, ధావన్, అయ్యర్, రాహుల్, కృనాల్, జడేజా, రాహుల్‌ చహర్, దీపక్‌ చహర్, భువనేశ్వర్, ఖలీల్‌.  

వెస్టిండీస్‌: బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), క్యాంప్‌బెల్, నరైన్, పూరన్, హెట్‌మైర్, పొలార్డ్, రావ్‌మన్‌ పావెల్, కీమో పాల్, ఖారీ పైర్, కాట్రెల్, థామస్‌

పిచ్, వాతావరణం
దేశం మారినా తొలి రెండు మ్యాచ్‌లలాగే ఇక్కడ కూడా నెమ్మదైన పిచ్‌ సిద్ధంగా ఉంది. విధ్వంసక షాట్లకు అవకాశం తక్కువ. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించవచ్చు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు