ఆటలో మమ్మల్ని పట్టుకోండి చూద్దాం...

5 Dec, 2019 01:11 IST|Sakshi

భారత జట్టు ‘ఛేజ్‌ డ్రిల్‌’

నెట్స్‌లో శ్రమించిన వెస్టిండీస్‌

రేపు హైదరాబాద్‌లో తొలి టి20 మ్యాచ్‌

సాక్షి, హైదరాబాద్‌:  భారత ఆటగాళ్లలో ఒక బృందం వరుసగా నిలబడింది... వాళ్లంతా తమ షార్ట్స్‌లో ఒక ఎరుపు రంగు కర్చీఫ్‌ పెట్టుకున్నారు... వారందరి వెనక మరో ఆటగాడు పసుపు రంగు కర్చీఫ్ తో నిలబడి ఉన్నాడు. ట్రైనర్‌ విజిల్‌ వేయడమే తరువాయి...అంతా పరుగు మొదలు పెట్టేశారు. తమ ముందు నిలబడ్డ ఆటగాడిని అందుకోవడమే వెనక ఉన్నవారి పని అయితే అందకుండా ఎంత వేగంగా పరుగెత్తగలరో ముందున్న ఆటగాళ్ల సవాల్‌! ఇలా ఒకరి తర్వాత మరొకరు వంతులుగా ఈ ఛేదనలో పాల్గొన్నారు. ఒకసారి ముందు వరుసలో నిలబడిన ఆటగాళ్లు మరోసారి వెనకకు వెళ్లిపోయి తమ పరుగు సత్తాను పరీక్షించుకున్నారు. బుధవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కనిపించిన దృశ్యమిది.

దీనికి టీమిండియా పెట్టుకున్న పేరు ‘ఛేజ్‌ డ్రిల్‌’. గతంలో పలు సందర్భాల్లో విభిన్న తరహా విధానాలతో సాధన చేసిన కోహ్లి బృందంలో ఇప్పుడు ఈ పద్ధతి కొత్తగా వచ్చి చేరింది. భారత జట్టు స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ నిక్‌ వెబ్‌ ఆలోచన ఇది. దీని వల్ల ఆటగాళ్ల పరుగు వేగాన్ని పెంచవచ్చని అతను చెబుతున్నాడు. సహచరుల మధ్య పోటీ తత్వం పెంచడంతో పాటు ఒత్తిడిని తట్టుకునేందుకు కూడా ఇది ఒక సాధనంగా పనికొస్తుందని నిక్‌ అన్నాడు. రెగ్యులర్‌గా ఆడే ఫుట్‌బాల్‌తో పాటు ‘ఛేజ్‌ డ్రిల్‌’ తర్వాత మన ఆటగాళ్లు నెట్‌ ప్రాక్టీస్‌కు వెళ్లారు.  

విరాట్‌ ‘స్విచ్‌ బ్యాటింగ్‌’
బంగ్లాదేశ్‌తో టి20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న అనంతరం మళ్లీ భారత జట్టులో చేరిన కెపె్టన్‌ విరాట్‌ కోహ్లి తొలి రోజు ప్రాక్టీస్‌ సెషన్‌ను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. సుదీర్ఘ సమయం పాటు అతను సాధన చేశాడు. నెట్స్‌లోనే ముందుకొచ్చి కొన్ని భారీ షాట్లు ఆడిన అతను స్విచ్‌ హిట్‌ను కూడా ప్రయత్నించాడు. ఆ తర్వాత పూర్తిగా స్టాన్స్‌ మార్చి ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ తరహాలో కొన్ని బంతులు ఎదుర్కొన్నాడు. రోహిత్‌ శర్మ కూడా ఎక్కువ సేపు ప్రాక్టీస్‌లో గడపగా...యువ ఆటగాడు శివమ్‌ దూబే చూడచక్కటి షాట్లు ఆడాడు. విరామం తర్వాత పునరాగమనం చేస్తున్న భువనేశ్వర్‌ కుమార్‌కు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ పలు సూచనలివ్వడం కనిపించింది. వెస్టిండీస్‌ ఆటగాళ్లు కూడా తీవ్రంగా శ్రమించారు.

మళ్లీ నంబర్‌వన్‌గా కోహ్లి

దుబాయ్‌: భారత కెపె్టన్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్‌ ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్‌వన్‌ స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ (923 రేటింగ్‌ పాయింట్లు)ను వెనక్కి నెట్టి కోహ్లి (928) అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన టెస్టులో కోహ్లి సెంచరీతో కదం తొక్కగా... ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న స్మిత్‌ అడిలైడ్‌తో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 36 పరుగులే చేసి పాయింట్లు కోల్పోయాడు. టాప్‌–10లో భారత్‌నుంచి చతేశ్వర్‌ పుజారా (4వ స్థానం), అజింక్య రహానే (6వ స్థానం)లో ఉన్నారు. పాక్‌పై అద్భుతమైన ట్రిపుల్‌ సెంచరీ సాధించిన డేవిడ్‌ వార్నర్‌ ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకొని 5వ స్థానానికి చేరుకోవడం విశేషం. మరో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబూషేన్‌ ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు.  

ఐదో స్థానంలో బుమ్రా...
బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ (900) నంబర్‌వన్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టాప్‌–10 బౌలర్ల జాబితాలో భారత్‌నుంచి జస్‌ప్రీత్‌ బుమ్రా (5వ స్థానం), ఆర్‌. అశి్వన్‌ (9వ స్థానం), మొహమ్మద్‌ షమీ (10వ స్థానం) ఉన్నారు.

విండీస్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా మాంటీ
సాక్షి, హైదరాబాద్‌:  భారత్‌తో జరిగే టి20, వన్డే సిరీస్‌లకు ముందు వెస్టిండీస్‌ జట్టు కొత్త బ్యాటింగ్‌ కోచ్‌ను నియమించింది. మాంటీ దేశాయ్‌ను రెండేళ్ల కాలానికి బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపిక చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. పుష్కర కాలపు కెరీర్‌లో మాంటీ అఫ్గానిస్తాన్, నేపాల్‌ జాతీయ జట్లకు ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్, గుజరాత్‌ లయన్స్‌ జట్ల కోచింగ్‌ బృందాల్లో పని చేశారు. మాంటీ ఇప్పటికే హైదరాబాద్‌లో జట్టుతో చేరాడు.

తొలి టి20 మ్యాచ్‌...
క్రికెట్‌ అభిమానులు ఉప్పల్‌ స్టేడియంలో పెద్ద సంఖ్యలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూశారు. కానీ ఈ మైదానంలో ఇప్పటి వరకు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ జరగలేదు. సరిగ్గా రెండేళ్ల క్రితం భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరగాల్సి ఉన్నా... అంతకు ముందునుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా టాస్‌ వేయాల్సిన అవసరం కూడా లేకుండానే ఆ మ్యాచ్‌ రద్దయింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఇప్పటి వరకు 6 వన్డేలు, 5 టెస్టులకు ఆతిథ్యం ఇచ్చింది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా