ఈసారి సులభం కాదు 

4 Nov, 2018 02:48 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే సిరీస్‌లను భారత్‌ పెద్దగా చెమటోడ్చకుండానే సొంతం చేసుకుంది. కరీబియన్‌ ఆటగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్స్‌ ఆడటంలో బిజీగా ఉన్నారు. తమ దేశం తరఫున సరైన అవకాశాలు లేకపోవడంతో వారు లీగ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు వారిలో చాలామంది ఈ సిరీస్‌కు అందుబాటులోకి రానున్నారు. ప్రపంచ చాంపియన్‌ విండీస్‌ను ఈ ఫార్మాట్‌లో ఓడించడం భారత్‌కు అంత సులభం కాదు. టెస్టులు, వన్డేల్లోలాగా ఈ సిరీస్‌లో ఆ జట్టు తేలిగ్గా తలొగ్గదు. రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి లేకుండానే భారత్‌ బరిలో దిగనుంది. అతను అందుబాటులో లేకపోవడం ప్రత్యర్థికి సానుకూలాంశం. ప్రారంభంలోనే వికెట్లు పడగొట్టి కొత్త ఆటగాళ్లపై పైచేయి సాధించాలని విండీస్‌ చూస్తుంది. ఈ సిరీస్‌లో భారత్‌ స్లో బౌలర్లకు అవకాశం ఇచ్చింది.

వారి బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడటం కష్టం. కానీ విండీస్‌ విధ్వంసక వీరులు ఎలాంటి బౌలింగ్‌నైనా తుత్తునియలు చేయగలరని గుర్తుంచుకోవాలి. జట్టులో మహేంద్ర సింగ్‌ ధోని కూడా లేడు. ఇది రిషబ్‌ పంత్, దినేశ్‌ కార్తీక్‌లకు చక్కటి అవకాశం. తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఇంతకు మించి ఛాన్స్‌ రాదు. వీరిద్దరూ ఐపీఎల్‌లో సత్తా చాటినవారే. దాన్నే ఇక్కడ కొనసాగించాలి. తాను తెలివైన బౌలర్‌నని నిరూపించుకోవడానికి కృనాల్‌ పాండ్యాకు మంచి అవకాశం. ఈ సిరీస్‌ ఇరు జట్లలోని యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకునేందుకు చక్కటి వేదిక కానుంది. 

మరిన్ని వార్తలు