పౌరుషానికి.. రోషానికి.. పోటీ!

18 Dec, 2019 13:16 IST|Sakshi
పిచ్‌ మాతా.. కరుణించమ్మా... భారత ఆటగాళ్ల వేడుకోలు

మీసం మెలేసే మగానుభావులెవరు?

రోషంతో కుబుసం విడిచే కోడెనాగులెవరు?

పౌరుషంతో ఇరగదీసే ప్రతాపరుద్రులెవరు?

పంతం పూని పైచేయి సాధించే పతాకధారులెవరు?

వారా.. వీరా! మనవారా... వైరి పక్షం వారా! వీరులా.. శూరులా! ఇద్దరిలో గెలుపెవరిది? పరాయి గడ్డ నుంచి వచ్చిన కొదమ సింహం ధాటికి సొంత గడ్డ మీద దుమ్ము రేపేస్తున్న మదపుటేనుగు మోకరిల్లుతుందా? ఒక్కసారిగా విరుచుకు పడే మెన్‌ ఇన్‌ బ్లూ మెరుపు దాడి ముందు కరేబియన్‌ దళం కకావికలవుతుందా? అంతుచిక్కని ప్రశ్న ఇది. ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి చేసే సందేహమిది. అందుకే.. బుధవారం వైఎస్సార్‌ స్టేడియంలో భారత, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో వన్డే చూడాల్సిన సందర్భమిది.

విశాఖ స్పోర్ట్స్‌: సవాళ్లకే సవాలని.. సమరాలకే సమరమని.. సంఘర్షణలకే సంఘర్షణని చెప్పుకోదగ్గ సంఘటనలు కొన్నే జరుగుతాయి. అలాటి సందర్భాలు అరుదుగా వస్తాయి. అలాటి.. రసవత్తర.. మహత్తర పోరాటం బుధవారం వైఎస్సార్‌ స్టేడియం వేదికగా బుధవారం మధ్యాహ్నం ప్రారంభం కాబోతోంది. ఉత్కంఠను పరాకాష్టకు తీసుకువెళ్లే ‘ఘర్షణ’కు కొన్ని గంటల్లో తెర తొలగబోతోంది. ఇటీవలి విజయాలతో ఊపు మీద ఉన్న కోహ్లీ సేనతో, సంచలనం సాధించే తాపత్రయంతో ఉన్న పోలార్డ్‌ బృందం తలపడనున్న వన్డే క్రికెట్‌ మ్యాచ్‌.. ఈ చలికాలంలో కూడా సెగలు పుట్టించనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్‌ గెలిచి.. సిరీస్‌ మీద కన్నేసిన వెస్టిండీస్‌ జట్టు తమను కాస్త కరుణించిన విశాఖ గడ్డ మీద అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైతే.. అచ్చొచ్చిన స్టేడియంలో పట్టు చేజారనివ్వకుండా.. మ్యాచ్‌ను నిలబెట్టుకోవాలని భారత జట్టు పట్టుదలతో కృషి చేయనుంది. దాంతో క్రికెట్‌ వీరాభిమానులకు విందు వంటి మ్యాచ్‌ చూసే అవకాశం దక్కబోతోంది.

టాప్‌ ప్లేయర్ల డుమ్మా
భారత జట్టు హోమ్‌ సిరీస్‌ విజయాలకు విశాఖలో గండి కొట్టాలని ఊపు మీద ఉన్న వెస్టిండీస్‌ జట్టు వ్యూహం పన్నడంలో వింత లేదు కానీ.. మంగళవారం ప్రాక్టీస్‌ను భారత్‌ జట్టు సీరియస్‌గా తీసుకోలేదా? అన్న సందేహం సగటు అభిమానికి కలిగే అవకాశం ఉంది. గత పదిహేనేళ్లలో భారత్‌ జట్టు రెండే సార్లు హోమ్‌ సిరీస్‌లో పరాజయం పాలైంది. వరుసగా ఐదు సిరీస్‌ల్లో భారత్‌ విజయకేతనం ఎగురవేసింది. వన్డే సిరీస్‌లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌ భారత్‌దైతే...విశాఖ వేదికగానే సిరీస్‌ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది వెస్టీండీస్‌ జట్టు.  అచ్చివచ్చిన స్టేడియంలో మరోసారి గెలిచి ప్రస్తుతానికి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో భారత్‌ జట్టు ప్రాక్టీస్‌ చేసినా ప్రధాన ఆటగాళ్ళు కనీసం నెట్స్‌లో ప్రాక్టీస్‌కు రాకపోవడం విస్మయపరిచేదే.  మంగళవారం ఇరుజట్లు ప్రాక్టీస్‌ చేశాయి.  ఉదయం వెస్టీండీస్‌ ప్రాక్టీస్‌ చేయగా మధ్యాహానం భారత్‌ జట్టు ఒళ్లొంచింది.  భారత కెప్టెన్‌ కోహ్లీ, హిట్టర్‌ రోహిత్‌శర్మ లాంటి కీలక ఆటగాళ్ళు ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టారు. ప్రాక్టీస్‌లోనూ దీపక్‌ చాహర్‌ ప్రధానంగా నిలవగా ప్రీసెషన్‌ సమావేశంలోనూ ఇతనే మాట్లాడాడు. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ రాహుల్, శ్రేయస్, రిషబ్, శివమ్‌ నెట్స్‌లో చెమటోడ్చారు.  మిడిల్‌ ఓవర్లలో కోహ్లీ రాణిస్తున్నా... ఓపెనింగ్‌ భాగస్వామ్యం నిలదొక్కుకోలేక పోతే అచ్చివచ్చిన స్టేడియంలోనూ భారత్‌ కష్టపడాల్సి వస్తుంది. జట్టులో లేని బుమ్రా మంగళవారం ఫిట్‌నెస్‌ నిరూపణకు బౌలింగ్‌లో చెమటోడ్చగా.. కుల్దీప్, జడేజా కూడా కోచ్‌ల సూచనలకు అనుగుణంగా బంతులు సంధించారు.

విశాఖ ప్రత్యేకం
విశాఖలో గడిచిన ఆరు వన్డేల్లో ఒక్కసారి మినహా చేజింగ్‌ జట్టే విజయాలు సాధించడం విశేషం.
ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు సరాసరి పరుగులు 275గా నమోదు కావడం గమనార్హం.  
విశాఖలో కోహ్లీకి సంచలన రికార్డులున్నాయి. వెస్టిండీస్‌ విజయం సాధించిన మ్యాచ్‌లో అతడు 99 పరుగుల వద్ద ఔట్‌ కావడం ఓ విశేషమైతే.. మూడు సార్లు సెంచరీలు చేయడం మరో ప్రత్యేకాంశం. అతడు ఇక్కడ మొత్తం556 పరుగులు చేయగా అత్యధికం 157 పరుగులు.

వైజాగ్‌లో విండీస్‌
వెస్టిండీస్‌ జట్టు విశాఖలో మొత్తం ఐదు వన్డేలాడింది. వీటిలో ఒకటి పాతనగరంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో.. నాలుగు వైఎస్సార్‌ ఏసీఏ స్టేడియంలో జరిగాయి. హుద్‌హుద్‌ తుపాను కారణంగా ఓ మ్యాచ్‌ రద్దయింది.
వైఎస్సార్‌ స్టేడియంలో భారత జట్టు ఓడిన ఏకైక మ్యాచ్‌ 2013లో జరగ్గా.. ఆ మ్యాచ్‌లో కరేబియన్‌ జట్టు రెండు వికెట్ల తేడాతో నెగ్గింది.
ఈ స్టేడియంలో టై అయిన ఏకైక వన్డేలో కూడా తలపడినవి ఈ రెండు జట్లే. గతేడాది అక్టోబర్‌ 24న జరిగిన ఆ మ్యాచ్‌లో రెండు జట్లూ 321 పరుగులే చేయడం విశేషం.
టై అయిన మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగి చేసిన 157 పరుగులు ఈ స్టేడియంలో రికార్డు. ఆ మ్యాచ్‌లో విజృంభించిన విండీస్‌ ఆటగాళ్లు హోప్‌ (123), హెట్మేయర్‌ (94) ఈసారి కూడా బరిలోకి దిగుతున్నారు. 

మరిన్ని వార్తలు