వాహ్‌ క్యాచ్‌... వారెవ్వా కోహ్లి!

9 Dec, 2019 09:07 IST|Sakshi

తిరువనంతపురం: బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి.. ‘సరిలేరు నీకెవ్వరు’ అని పించుకుంటున్నాడు. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టి20లో అతడు పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ చూస్తే ఎవరైనా ఈ మాట ఒప్పుకోవాల్సిందే. మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా కోహ్లి పట్టిన క్యాచ్‌ హైలైట్‌గా నిలిచింది. జడేజా ఇన్నింగ్స్‌ 14వ ఓవర్లో హెట్‌మైర్‌ 2 వరుస సిక్సర్లు బాదేశాడు. మరుసటి బంతికీ భారీ షాట్‌నే బాదాడు. లాంగాన్‌లో ఉన్న కోహ్లి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చి బౌండరీ దగ్గర అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. లిప్తపాటు కాలంలోనే క్యాచ్‌ను పట్టేయడం... అసాధారణ వేగాన్ని నియంత్రించుకొని... బౌండరీ లైన్‌కు తగిలే సమయంలో చేతిని తాకకుండా చేయడం అన్నీ కళ్లు మూసి తెరిచేలోపే జరిగిపోయాయి. వారెవ్వా క్యాచ్‌ అంటూ స్టేడియం చప్పట్లతో మోగిపోయింది.  

ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 8 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–1తో నిలిచింది. చివరి మ్యాచ్‌ ఈనెల 11న ముంబైలో జరగనుంది. మరోవైపు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(2563) చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ(2562) అత్యధిక పరుగుల రికార్డును అధిగమించాడు. కోహ్లి, రోహిత్‌లు ఉండగా.. మార్టిన్‌ గప్టిల్‌(2463, న్యూజిలాండ్‌), షోయాబ్‌ మాలిక్‌(2263; పాకిస్తాన్‌) తరువాతి స్థానాల్లో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు