కరీబియన్‌తో కటీఫ్!

19 Oct, 2014 01:08 IST|Sakshi
ఈ దోస్తీ కొనసాగేనాః ధర్మశాల వన్డే సందర్భంగా ధోనితో విండిస్ ఆటగాళ్లు

ముంబై: వెస్టిండీస్ జట్టు అర్ధంతరంగా పర్యటన నుంచి నిష్ర్కమించడం బీసీసీఐకి మింగుడు పడటం లేదు. తాజా పరిణామాల నేపథ్యంలో కరీబియన్లతో కఠినంగా వ్యవహరించాలని బోర్డు భావిస్తోంది. ఈ క్రమంలో కనీసం ఐదేళ్ల పాటు ఆ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడరాదనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ‘విండీస్ తప్పుకోవడం వల్ల మేం భారీగా నష్టపోయాం.

కాబట్టి దానికి పరిహారం కోరతాం. అదే విధంగా ఐసీసీ ముందు కూడా విషయాన్ని ఉంచుతాం. తదుపరి చర్యలు, విండీస్‌తో భవిష్యత్తులో సంబంధాల విషయంపై చర్చించేందుకు వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశాం. ఆలోగా న్యాయపరమైన సలహా కూడా తీసుకుంటాం’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. పర్యటన రద్దు కావడంలో ఆటగాళ్ల తప్పు లేదని, వారిని శిక్షించడం సరైంది కాదని కూడా బోర్డులో కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

 మాకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు: ఆటగాళ్లు సమ్మెకే మొగ్గు చూపడంతో పర్యటన రద్దు చేసుకోవడం మినహా తమకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ) వెల్లడించింది. సిరీస్ మధ్యలో తప్పుకున్నందుకు బీసీసీఐ, స్పాన్సర్లు, అభిమానులకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించింది.

ఆటగాళ్లతో చర్చించేందుకు ఈ నెల 20న వెస్టిండీస్ నుంచి ప్రత్యేక బృందం భారత్‌కు రావాల్సి ఉండగా, ఆలోపే అవాంఛనీయ ఘటనలు జరిగాయని పేర్కొంది. ‘బ్రేవో నాయకత్వంలోని జట్టు ఇకపై పర్యటన కొనసాగించరాదని నిర్ణయించుకొని ఆ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్ ద్వారా మాకు తెలియజేసింది. దాంతో టూర్ రద్దు మినహా మేమేం చేయగలం? ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని భావించినా దానికి బీసీసీఐ అంగీకరించకపోయేదని మాకు తెలుసు’ అని విండీస్ బోర్డు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు