విశాఖ చేరిన భారత్, విండీస్‌ జట్లు

17 Dec, 2019 01:24 IST|Sakshi

నేడు నెట్‌ ప్రాక్టీస్‌

విశాఖ స్పోర్ట్స్‌: రెండో వన్డే మ్యాచ్‌లో తలపడేందుకు భారత్, వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్లు సోమవారం విశాఖపట్నం చేరుకున్నాయి. మంగళవారం రెండు జట్లు నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొననున్నాయి. మ్యాచ్‌ నిర్వహణ సజావుగా సాగేందుకు అపెక్స్‌ కమిటీ సోమవారం సమీక్ష నిర్వహించింది. నిర్వహణ కమిటీలు సమావేశమై ఏర్పాట్లపై చర్చించాయి. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ... క్రీడాకారుల భద్రత, టిక్కెట్ల విక్రయాలు, స్టేడియంలో ఆహార పదార్థాలు తదితర విషయాలపై తీసుకున్న చర్యలను వివరించారు. స్థానిక ఆటగాడు, భారత మాజీ క్రికెటర్‌ వై.వేణుగోపాల్‌ రావు పేరిట స్టేడియంలో ఓ గేట్‌ను ఏర్పాటు చేయనున్నామని... దానిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు శరత్‌ చంద్రారెడ్డి, కార్యదర్శి దుర్గాప్రసాద్, కోశాధికారి గోపీనాథ్‌ రెడ్డిలతో పాటు డీసీపీ రంగారెడ్డి, జేసీ వేణుగోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వెస్టిండీస్‌కు భారీ జరిమానా 
తొలి వన్డేలో భారత్‌ను ఓడించిన వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టు ఓవర్‌రేట్‌లో మాత్రం భారీగా వెనుకబడింది. దాంతో ఆ జట్టు ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో ఏకంగా 80 శాతం కోత పడింది. భారత బ్యాటింగ్‌ సమయంలో  50 ఓవర్లకు నిర్దేశించిన సమయం ముగిసినా దానిని పూర్తి చేయలేక విండీస్‌ మరో నాలుగు ఓవర్లు వెనుకబడింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఒక్కో ఓవర్‌కు 20 శాతం జరిమానా చొప్పున విండీస్‌ జట్టు సభ్యులపై 80 శాతం మ్యాచ్‌ ఫీజును జరిమానాగా విధిస్తున్నట్లు రిఫరీ డేవిడ్‌ బూన్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు