భారత్ క్లీన్‌స్వీప్

3 Feb, 2014 00:47 IST|Sakshi
భారత్ క్లీన్‌స్వీప్

ఇండోర్: డేవిస్‌కప్‌లో ఆంధ్రప్రదేశ్ యువ సంచలనం సాకేత్ మైనేని మళ్లీ మెరిశాడు. భారత్ సంపూర్ణ విజయానికి తన వంతు సహకారం అందించాడు. దీంతో డేవిస్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్-1లో భారత్ 5-0తో చైనీస్ తైపీపై క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లే గెలిచారు. తెలుగు కుర్రాడు సాకేత్ 2-0 సెట్‌లతో సంగ్ హూ యంగ్‌పై, యూకీ బాంబ్రీ 2-0 సెట్‌లతో సియెన్ యిన్ పెంగ్‌పై జయభేరి మోగించారు. మొత్తం మీద ఓ జట్టుపై వైట్‌వాష్ సాధించడం 2005 తర్వాత భారత్‌కిదే తొలిసారి. తాజా విజయంతో ఏప్రిల్‌లో జరిగే  రెండో రౌండ్ పోరులో దక్షిణ కొరియాతో తలపడనుంది. ఇందులో గెలిస్తే భారత్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సంపాదిస్తుంది.
 
 సాకేత్ మెరుపులు
 తాను ఆడుతున్న తొలి డేవిస్‌కప్ పోరులో సాకేత్ మైనేని సత్తాచాటుకున్నాడు. శనివారం డబుల్స్‌లో అదరగొట్టిన ఈ ఏపీ ఆటగాడు ఆదివారం సింగిల్స్‌లోనూ మెరుపులు మెరిపించాడు. 26 ఏళ్ల మైనేని తనకన్నా మెరుగైన ర్యాంకింగ్ ఆటగాడు సంగ్ హూ యంగ్‌ను కంగుతినిపించాడు. ప్రపంచ 313వ ర్యాంకర్ సాకేత్ 6-1, 6-4తో కేవలం 48 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించడం విశేషం.
 
 యూకీ ఖాతాలో మరో గెలుపు
 తొలి సింగిల్స్‌లో గెలిచి భారత్‌కు శుభారంభాన్నిచ్చిన ఢిల్లీ ఆటగాడు యూకీ బాంబ్రీ రివర్స్ సింగిల్స్‌లోనూ తన జోరు కొనసాగించాడు. 22 ఏళ్ల యూకీ 7-5, 6-0తో సియెన్ యిన్ పెంగ్‌పై గెలుపొందాడు. ఇతను కూడా గంటలోపే (55 నిమిషాల్లోనే) ప్రత్యర్థిపై
 జయకేతనం ఎగురవేశాడు. తొలి సెట్‌లో గట్టి పోటీనిచ్చిన పెంగ్ రెండో సెట్‌లో యూకీ బాంబ్రీ ధాటికి చేతులెత్తేశాడు.
 
 ‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ మ్యాజికే విజయాలందించింది. కేవలం ఐటీఎఫ్ టోర్నీలే కాకుండా ఇదే ఉత్సాహంతో ఈ సీజన్‌లో గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయర్స్‌పై కూడా దృష్టిసారిస్తాను. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూనే ఆటలో నైపుణ్యాన్ని సాధిస్తా’    
 - సాకేత్ మైనేని
 

>
మరిన్ని వార్తలు