వచ్చే ఐదేళ్లు బిజీ బిజీ...

21 Jun, 2018 01:01 IST|Sakshi

200 పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్న భారత్‌

ఎఫ్‌టీపీ విడుదల చేసిన ఐసీసీ

టెస్టు చాంపియన్‌షిప్‌కు గ్రీన్‌సిగ్నల్‌

దుబాయ్‌: సుదీర్ఘ కాలంగా చర్చోపచర్చలు, సమావేశాల అనంతరం ఎట్టకేలకు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు మోక్షం లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) బుధవారం ప్రకటించిన ఐదేళ్ల భవిష్యత్తు పర్యటన కార్యక్రమం (ఎఫ్‌టీపీ)లో దీనికి కొత్తగా చోటు లభించింది. టెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు వన్డే వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ లీగ్‌కు కూడా ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. కొత్త ఎఫ్‌టీపీ ప్రకారం జూన్‌ 2019 నుంచి మొదలు పెట్టి వచ్చే రెండేళ్ల కాలంలో టాప్‌–9 టెస్టు జట్లు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ కోసం పోటీ పడతాయి. లీగ్‌ దశలో ఆరు సిరీస్‌లు జరిగే అవకాశం ఉం డగా, పాయింట్లలో అగ్రస్థానంలో నిలిచిన రెండు టీమ్‌లు ఫైనల్లో తలపడతాయి. వన్డే లీగ్‌ 2020లో ప్రారంభమవుతుంది. ఇందులో 12 టెస్టు జట్లతో పాటు వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన నెదర్లాండ్స్‌ కూడా బరిలోకి దిగుతుంది. పాయింట్ల ప్రకారం టాప్‌–8లో నిలిచిన జట్లు 2023 వరల్డ్‌ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. అయితే అన్ని టెస్టు మ్యాచ్‌లు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌కు, అన్ని వన్డే మ్యాచ్‌లు వన్డే లీగ్‌కు పరిగణలోకి తీసుకోరు. ఈ రెండు మెగా ఈవెంట్లలో భాగంగా ఉండే సిరీస్‌లు మాత్రమే కాకుండా అన్ని జట్లు విడిగా ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ఆడతాయి.  

సొంతగడ్డపై 102 మ్యాచ్‌లు... 
వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ కోసం జరిగే పోరులో భాగంగా వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో భారత్‌ తమ తొలి సిరీస్‌ ఆడుతుంది. 2019 వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత కరీబియన్‌ గడ్డపై భారత్‌ 2 టెస్టులు ఆడుతుంది. ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాకు భారత్‌ ఆతిథ్యం ఇస్తుంది. ఊహించినట్లుగానే తాజా ఎఫ్‌టీపీలో భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య ఎలాంటి టెస్టులు లేవు. పాక్‌తో పాటు ఐర్లాండ్‌తో కూడా భారత్‌ ఒక్క టెస్టూ ఆడటం లేదు. మిగతా జట్లతో మాత్రం ఇంటా, బయటా తలపడుతుంది. వన్డే లీగ్‌లో కూడా పాక్, ఐర్లాండ్‌లకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం లేదు. మొత్తంగా ఐదేళ్ల కాలంలో భారత్‌ 200కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉండగా వాటిలో 102 సొంత గడ్డపైనే జరగనున్నాయి. ఐదేళ్ల ఎఫ్‌టీపీలో అన్ని జట్లకంటే ఎక్కువ మ్యాచ్‌లు భారత జట్టే ఆడనుండటం విశేషం.   2018–2023 మధ్య కాలంలో భారత జట్టు స్వదేశంలో వరుసగా వెస్టిండీస్‌ (3 టెస్టులు), దక్షిణాఫ్రికా (3), బంగ్లాదేశ్‌ (2), జింబాబ్వే (1), ఇంగ్లండ్‌ (5), న్యూజిలాండ్‌ (2), శ్రీలంక (3), ఆస్ట్రేలియా (4)లతో ... విదేశీ గడ్డపై వరుసగా ఇంగ్లండ్‌ (5), ఆస్ట్రేలియా (4), వెస్టిండీస్‌ (2), న్యూజిలాండ్‌ (2), ఆస్ట్రేలియా (4), ఇంగ్లండ్‌ (5), దక్షిణాఫ్రికా (3), బంగ్లాదేశ్‌ (2)లతో టెస్టు సిరీస్‌లలో తలపడుతుంది. 

మరిన్ని వార్తలు