‘టీమిండియా పర్యటనే మాకు శరణ్యం’

27 Apr, 2020 12:43 IST|Sakshi

మా కష్టాలు తీరాలంటే భారత్‌తో సిరీస్‌ తప్పనిసరి

సిరీస్‌ జరగపోతే భారీగా నష్టపోతాం: టిమ్‌ పైన్‌

సిడ్నీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తోన్న కరోనా వైరస్‌ ప్రభావం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)పై పడింది. ప్రపంచ ధనిక క్రికెట్‌ బోర్డుల్లో ఒకటైన సీఏ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ఈ సంక్షోభంతో భారీ స్థాయిలో ఆటగాళ్ల జీతాల కోత విధింపుతో పాటు సిబ్బందిని కూడా తొలగించడానికి కూడా సీఏ సిద్ధమైంది. ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి జూన్‌ 30 వరకూ ఉద్యోగుల, కాంట్రాక్టర్ల జీతాల్లో 80 శాతం కోత విధించనున్నారు. అయితే ప్రస్తుతం సీఏను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలంటే టీమిండియాతో సిరీసే శరణ్యమని ఆ జట్టు టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ అభిప్రాయపడ్డాడు.  తమ ఆర్థిక కష్టాలు తీరాలంటే టీమిండియా..  ఆస్ట్రేలియా పర్యటనకు ఎలాగైనా రావడం ఒక్కటే మార్గమన్నాడు. (సరైన సమయంలో చెబుతాం)

ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ వెళ్లాల్సి ఉంది. దీనిపై సీఏ ఎన్నో ఆశలు పెట్టుకుంది.  ఈ సీజన్‌ ఆఖర్లో భారత్‌-ఆస్ట్రేలియాల టెస్టు సిరీస్‌ సజావుగా సాగితేనే తమ క్రికెట్‌ బోర్డు ఆర్థిక కష్టాలన్నీ తీరుతాయని పైన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌ సక్రమంగా జరిగితే  తమ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయన్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ రాకపోతే 250 నుంచి 300 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతుందన్నాడు. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా-ప్రభుత్వం మధ్య ఇప్పటికే చర్చలు నడిచాయన్నాడు. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా కొన్ని  ఆంక్షల్ని సడలించడమే కాకుండా, చార్టెడ్‌ విమానాలు, ఐసోలేషన్‌ వంటివి టీమిండియా క్రికెటర్ల కోసం ప్రత్యేకం ఏర్పాటు చేస్తుందన్నాడు. (నా కొడుకు కెరీర్‌ను నాశనం చేశావ్‌ అన్నాడు..!)

టీమిండియా పర్యటనపై తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని, తమ కష్టాలకు భారత పర్యటనతో ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నానని పైన్‌ అన్నాడు. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌ మరుసటి ఏడాదికి వాయిదా పడగా, క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అయిన ఐపీఎల్‌ నిరవధిక వాయిదా వేశారు. అదే సమయంలో అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహణ కూడా డైలమాలో  పడింది. కరోనాపై పోరాటంలో ఆస్ట్రేలియా కచ్చితమైన మార్గదర్శకాలతో ముందుకెళుతున్న తరుణంలో క్రికెట్‌ టోర్నీలపై కూడా కఠినంగా ఉండే అవకాశం ఉంది. ఒకవైపు వరల్డ్‌కప్‌, మరొకవైపు భారత్‌ పర్యటన అంశాలు ఇప్పుడు సీఏను ఇరకాటంలో పడేస్తున్నాయి. ఒకవేళ కరోనా ఉధృతి తగ్గకపోతే మాత్రం సీఏ ఆర్థికంగా ఇంకా నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి. (బుమ్రాకు ‘చుక్కలు’ చూపించాడు..!)

మరిన్ని వార్తలు