‘బర్మింగ్‌హమ్‌’ బరిలోకి దిగుతాం

31 Dec, 2019 01:28 IST|Sakshi

2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ బహిష్కరణ యోచన విరమించుకున్న భారత ఒలింపిక్‌ సంఘం

భారత్‌లో 2026 లేదా 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌ నిర్వహణకు బిడ్‌ దాఖలు చేయాలని నిర్ణయం

న్యూఢిల్లీ: బర్మింగ్‌హమ్‌–2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో షూటింగ్‌ క్రీడాంశాన్ని తొలగించినందుకు నిరసనగా ఇన్నాళ్లూ ఆ క్రీడలను బహిష్కరిస్తామని హెచ్చరించిన భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) మెత్త బడింది. బర్మింగ్‌హమ్‌ గేమ్స్‌లో భారత బృందం పాల్గొంటుందని సోమవారం ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐఓఏ ప్రకటన చేసింది. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ జరిగే ఏడాదే భారత్‌లో ప్రత్యేకంగా కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌ను నిర్వహించేలా ప్రతిపాదనలు పంపించాలని కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య (సీజీఎఫ్‌) కోరడంతో ఐఓఏ బహిష్కరణ నిర్ణయంలో మార్పునకు కారణమైంది. ‘బర్మింగ్‌హమ్‌ 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ను భారత్‌ బహిష్కరించకూడదని ఏజీఎంలో నిర్ణయం తీసుకున్నాం. అంతేకాకుండా 2026 లేదా 2030 కామన్వెల్త్‌ గేమ్స్‌ ఆతిథ్యం కోసం భారత్‌ బిడ్‌ దాఖలు చేయాలని ఏజీఎంలో తీర్మానించాం.

కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నాక అధికారికంగా బిడ్‌ దాఖలు చేస్తాం’ అని ఐఓఏ సెక్రటరీ జనరల్‌ రాజీవ్‌ మెహతా తెలిపారు. 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌ వేదికను వచ్చే ఏడాది ప్రకటిస్తారు. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో చోటు దక్కని ఆర్చరీ క్రీడాంశంలోనూ ప్రత్యేకంగా కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌ను నిర్వహించాలనే ప్రతిపాదనను సీజీఎఫ్‌కు పంపిస్తామని ఐఓఏ అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా తెలిపారు. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటివరకు భారత్‌ నుంచి 60 మంది క్రీడాకారులు అర్హత సాధించారని... ఈ సంఖ్య 125 లేదా 150కు చేరుకునే అవకాశం ఉందని... టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల నుంచి కనీసం 10 పతకాలు ఆశిస్తున్నట్లు బాత్రా తెలిపారు.

మరిన్ని వార్తలు