కజకిస్తాన్‌తో భారత్‌ తొలి పోరు

11 Feb, 2020 03:00 IST|Sakshi

నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

మనీలా (ఫిలిప్పీన్స్‌): కరోనా వైరస్‌ భయాందోళనల్ని పక్కనబెట్టి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు భారత పురుషుల జట్టు సిద్ధమైంది. ఈ ఈవెంట్‌లో భారత్‌ పూర్తిస్థాయి జట్టుతో తలపడనుంది. ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య విజేత భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్‌.ఎస్‌.ప్రణయ్, శుభాంకర్‌ డే, లక్ష్యసేన్‌లు ఒలింపిక్‌ ఏడాది సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. నాలుగేళ్ల క్రితం 2016లో భారత పురుషుల జట్టు కాంస్యం నెగ్గింది. ఇప్పుడు ఈ పతకం వన్నె మార్చాలనే లక్ష్యంతో ఆటగాళ్లు పోటీ పడనున్నారు. ముందుగా భారత్‌కు క్లిష్టమైన డ్రా ఎదురైంది. రెండు సార్లు చాంపియన్‌ అయిన ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లతో కలిసి గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న భారత్‌ కరోనా పుణ్యమాని ఇప్పుడు మలేసియా, కజకిస్తాన్‌లతో గ్రూప్‌ ‘బి’కి మారింది.

వైరస్‌ ప్రభావమున్న చైనా, హాంకాంగ్‌లను ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం నిషేధించడంతో ‘డ్రా’ షెడ్యూలును మార్చారు. బ్యాడ్మింటన్‌లో కజకిస్తాన్‌ కష్టమైన ప్రత్యర్థి కాదు. దీంతో ఈ జట్టుతో మంగళవారం జరిగే పోరులో భారత్‌ గెలుపు ఖాయమవుతుంది. అయితే గురువారం మలేసియాతోనే భారత్‌కు కష్టాలు తప్పవు. ఆ జట్టులో ప్రపంచ 14వ ర్యాంకర్‌ లీ జి జియా, 2014 యూత్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ చీమ్‌ జున్‌ వీ, ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో మూడుసార్లు రన్నరప్‌ అయిన హవ్‌ లియాంగ్‌ జున్‌లు ఉండటంతో భారత్‌ చెమటోడ్చాల్సిన అవసరముంది. కాగా... ప్రాణాంతక వైరస్‌ భయంతో భారత మహిళల జట్టు ఈ టోర్నీకి దూరమైంది.

ఇకపై ఆకర్షణీయంగా ‘బాయ్‌’ టోర్నీలు 
న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీలను మరింత రసవత్తరంగా, ఆకర్షణీయంగా నిర్వహించేందుకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) సిద్ధమవుతోంది. మ్యాచ్‌ల్లో పోటీ పెంచేందుకు కేటగిరీల వారీగా నిర్వహిస్తుంది. అలాగే ప్రైజ్‌మనీని కూడా భారీగా పెంచింది. మొత్తం రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీతో ఏడాది పొడవునా మూడు దశల్లో బాయ్‌ ఈవెంట్లు జరుగనున్నాయి. లెవెల్‌ 1, 2, 3 టోర్నీలు నిర్వహించాలని బాయ్‌ ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటీవ్‌ కమిటీలో నిర్ణయించింది. సీనియర్‌ కేటగిరీలో ‘బాయ్‌ ప్రీమియర్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ’ని లెవెల్‌ 1 స్థాయిలో నిర్వహిస్తారు. లెవెల్‌ 2లో నాలుగు ‘బాయ్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలు’ జరుగుతాయి. ఇక లెవెల్‌ 3లో ఆరు ‘బాయ్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ’లను నిర్వహిస్తారు. మేటి ర్యాంకింగ్‌ల ఆధారంగా ఆయా టోర్నీల్లో నేరుగా మెయిన్‌ డ్రా ఆడే అవకాశం కల్పిస్తారు. అగ్రశ్రేణి క్రీడాకారులు జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొనేందుకు ముందుగా రావాలనేది కూడా కొత్త ప్రణాళికలో భాగం.

మరిన్ని వార్తలు