భారత్‌ ముందుకెళ్లేనా? 

6 Mar, 2020 01:23 IST|Sakshi

నేటి నుంచి క్రొయేషియాతో డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌

జాగ్రెబ్‌ (క్రొయేషియా): డేవిస్‌ కప్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌ బెర్త్‌పై కన్నేసిన భారత పురుషుల టెన్నిస్‌ జట్టుకు నేటి నుంచి కఠిన సవాల్‌ ఎదురుకానుంది. డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా రెండు రోజుల పాటు సాగే ఈ పోరులో భారత్‌... 2014 యూఎస్‌ ఓపెన్‌ విజేత మారిన్‌ సిలిచ్‌తో కూడిన క్రొయేషియాను ఎదుర్కోనుంది. అయితే మారిన్‌ సిలిచ్‌ మినహా మిగతా క్రొయేషియా ఆటగాళ్లు చెప్పుకోదగ్గ స్థాయి ప్లేయర్లు కాకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం. సుమీత్‌ నాగల్, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్, లియాండర్‌ పేస్, రోహన్‌ బొపన్న, రామ్‌కుమార్‌ రామనాథన్‌లతో కూడిన భారత్‌ ఈ మ్యాచ్‌లో అండర్‌ డాగ్స్‌గా బరిలో దిగనుంది. తన కెరీర్‌లో చివరి డేవిస్‌ కప్‌ సీజన్‌ ఆడుతున్న లియాండర్‌ పేస్‌ ఘనమైన ముగింపు పలకాలనే పట్టుదలతో ఉన్నాడు.

రెండు సింగిల్స్‌... డబుల్స్‌... రెండు రివర్స్‌ సింగిల్స్‌ పద్ధతిన జరిగే ఈ పోరులో మూడు మ్యాచ్‌లను గెలిచిన జట్టు మాడ్రిడ్‌ వేదికగా నవంబర్‌లో జరిగే డేవిస్‌ కప్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తుంది. శుక్రవారం జరిగే రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్, రామ్‌కుమార్‌ రామనాథన్‌లు బరిలో దిగనున్నారు. భారత నంబర్‌వన్‌ సుమీత్‌ నాగల్‌కు అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో బోర్నా గోజోతో ప్రజ్నేశ్‌; రెండో మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్‌ మారిన్‌ సిలిచ్‌తో రామ్‌కుమార్‌ తలపడతారు. శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో మ్యాట్‌ పావిచ్‌–స్కుగోర్‌లతో లియాండర్‌ పేస్‌–రోహన్‌ బోపన్న... నాలుగో మ్యాచ్‌లో సిలిచ్‌తో ప్రజ్నేశ్‌; ఐదో మ్యాచ్‌లో గోజోతో రామ్‌కుమార్‌ ఆడతారు. చివరిసారిగా ఈ రెండు జట్లు 1995లో న్యూఢిల్లీ వేదికగా తలపడగా... అందులో భారత్‌ 3–2తో గెలుపొందింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా