-

విజయంతో ముగిస్తారా..!

3 Feb, 2019 03:02 IST|Sakshi

నేడు వెల్లింగ్టన్‌లో చివరి వన్డే 

బరిలోకి దిగనున్న ధోని

గాయంతో కివీస్‌ ఓపెనర్‌ గప్టిల్‌ దూరం

కఠినంగా సాగుతుందని భావించిన వన్డే సిరీస్‌ను వరుసగా మూడు విజయాలతో సునాయాసంగా కైవసం చేసుకుంది టీమిండియా. హామిల్టన్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో మాత్రం అచ్చమైన న్యూజిలాండ్‌ పిచ్‌ ఎదురయ్యే సరికి ట్రెంట్‌ బౌల్ట్‌ స్వింగ్‌ ధాటికి బోల్తాకొట్టింది. తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా బ్యాట్స్‌మెన్‌ కలసికట్టుగా విఫలమవడంతో బౌలర్లకూ చేసేందుకు ఏమీ లేకపోయింది.

జట్టులో ఎవరున్నారు? ఎవరు లేరు? అని కాకుండా... స్వింగ్‌కు పేరుగాంచిన ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచ కప్‌ ముందు ఓ మేల్కొలుపు లాంటి ఓటమి ఇది. ఇక చివరి వన్డే వేదికైన వెల్లింగ్టన్‌లోనూ పిచ్‌ దాదాపు హామిల్టన్‌ తరహాలోనే ఉండనున్నట్లు కనిపిస్తోంది. ఈ సవాల్‌ను అధిగమించి భారత్‌ తమ ఆధిక్యాన్ని 4–1కు పెంచుకుంటుందా? లేక తలొంచి 3–2తో సంతృప్తిపడుతుందా?

వెల్లింగ్టన్‌ 
‘ఇలాంటి ఫలితం మాకు హెచ్చరికలాంటిది. దీన్నుంచి మేం పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది...’ నాలుగో వన్డేలో ప్రతిఘటనే లేకుండా ఓడటంతో టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ చేసిన వ్యాఖ్యలివి. ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌ ముందు, విదేశీ గడ్డపై చివరి వన్డే ఆడబోతున్న భారత్‌ విషయంలో ఈ అభిప్రాయం వంద శాతం నిజమైనదే.

దీన్నుంచి మన జట్టు ఎలాంటి పాఠం నేర్చుకుంది అనేది న్యూజిలాండ్‌తో ఆదివారం ఇక్కడి బేసిన్‌ రిజర్వ్‌ మైదానంలో జరిగే చివరిదైన ఐదో వన్డేలో తెలియనుంది. మరోవైపు గాయంతో గత రెండు వన్డేలకు దూరమైన వెటరన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఈ మ్యాచ్‌లో ఆడనుండటం టీమిండియాకు సానుకూలాంశం. కాగా, ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ వెన్నునొప్పితో దూరం కావడం కివీస్‌కు ప్రతికూలం కానుంది.   

మహి వచ్చాడు... 
సిరీస్‌ గణాంకాలను 4–1తో ముగిస్తే భారత్‌ తనదైన ఆధిపత్యం చాటినట్లవుతుంది. నాలుగో వన్డేలో ఊహించని పిచ్‌పై దెబ్బతిన్నందున ఈ మ్యాచ్‌లో కొంచెం జాగ్రత్తగా ఆడే అవకాశం కనిపిస్తోంది. హామిల్టన్‌లో బౌల్ట్‌ స్పెల్‌ను కాచుకుని ఉంటే... తర్వాత పరుగులు వచ్చేవి. మరోసారి అతడి ప్రభావానికి లొంగకుండా చూసుకోవాలి. కోహ్లి లేని నేపథ్యంలో ఆ బాధ్యత ఓపెనర్లు రోహిత్, ధావన్‌లదే.

యువ శుబ్‌మన్‌ గిల్‌ను పరీక్షించి చూడాలనుకుంటే... దినేశ్‌ కార్తీక్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. గిల్‌ను తప్పిస్తే రాయుడు మూడో స్థానంలో వస్తాడు. 4, 5 స్థానాల్లో కార్తీక్, ధోని ఆడతారు. షమీకి విశ్రాంతితో రెండో పేసర్‌గా ఖలీల్‌నే ఎంచుకోవచ్చు. హైదరాబాదీ సిరాజ్‌ పేరు వినిపిస్తున్నా అది ఖాయం కాదు. భువనేశ్వర్‌కు స్వింగ్‌ అనుకూలిస్తే ఫలిస్తే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు. 

కివీకి కేన్‌ బెంగ 
ఆతిథ్య జట్టును కెప్టెన్‌ విలియమ్సన్‌ ఫామ్‌ కంగారు పెడుతోంది. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేసిన తర్వాత అతడు మళ్లీ రాణించలేదు. బ్యాటింగ్‌ భారాన్ని రాస్‌ టేలర్‌ ఒక్కడే మోస్తున్నాడు. గప్టిల్‌ లేనందున నికోల్స్‌తో మున్రో ఇన్నింగ్స్‌ ప్రారంభించవచ్చు. వీరితోపాటు లాథమ్‌ను త్వరగా ఔట్‌ చేస్తే టీమిండియా పని సులువవుతుంది. ఇక పేసర్‌ హెన్రీ బదులుగా టిమ్‌ సౌథీని బరిలో దింపే ఆలోచనలో న్యూజిలాండ్‌ ఉంది. అనుకూల పరిస్థితుల్లో బౌల్ట్‌కు సౌథీ తోడైతే భారత్‌ శ్రమించక తప్పదు.

పిచ్, వాతావరణం 
పిచ్‌ స్వింగ్‌కు అనుకూలించవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. గాలులతో కూడిన వేడి వాతావరణం ఉండనుంది. గత మూడేళ్లలో ఈ మైదానంలో న్యూజిలాండ్‌ సగటు స్కోరు 207 మాత్రమే కావడం గమనార్హం. 

తుది జట్లు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్, రాయుడు, గిల్‌/దినేశ్‌ కార్తీక్, ధోని, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, ఖలీల్‌ 
న్యూజిలాండ్‌: నికోల్స్, మున్రో, విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాస్‌ టేలర్, లాథమ్, గ్రాండ్‌హోమ్, నీషమ్, బ్రేస్‌వెల్‌/సాన్‌ట్నర్, ఆస్టల్, హెన్రీ/సౌథీ, బౌల్ట్‌. 


 

మరిన్ని వార్తలు